Anganwadi news: అంగన్‌వాడీలకు Bad News.. అంగన్‌వాడీ కేంద్రాలు బంద్‌..!

Anganwadi news

మంచిర్యాలటౌన్‌: విద్యాసంస్థలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించినా.. చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాల్సి ఉండడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వలేదు. కానీ మే నెలలో 15రోజుల చొప్పున ఆయాలు, అంగన్‌వాడీ టీచర్లకు సెలవులు ప్రకటించింది.

అంటే 15రోజులు ఆయాలు, మిగతా 15రోజులు టీచర్లు కేంద్రాలను తెరిచి చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాల్సి ఉంటుంది. ఎండలు మండిపోతుండడం, ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఉక్కపోత ఉంటుందని సగం మంది చిన్నారులు మాత్రమే కేంద్రాలకు హాజరవుతున్నారు.

గర్భిణులూ అంతంత మాత్రంగానే వస్తుండడంతో ఎవరూ రావడం లేదనే సాకుతో ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పని దినాల్లోనూ అంగన్‌వాడీ కేంద్రాలను తెరవడం లేదు. జిల్లాలో సగానికిపైగా కేంద్రాలు మూసి ఉండడం వల్ల కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆయా రోజుల్లో పౌష్టికాహారం అందకుండా పోతోంది. ఆటపాటలతో కూడిన విద్యాబోధన, పౌష్టికాహారం ఉచితంగా అందించే కేంద్రాలు మూసివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హాజరవుతున్న సగం మందికై నా పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించి, హాజరు కాని వారికి ఇంటికి ఆయా సరుకులను అందించడం లేదు.

చిన్నారుల ఎదుగుదలపై ప్రభావం

పేద కుటుంబాలకు ఆర్థికస్థోమత లేక చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు. ఇలాంటి వారికి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకుకూరలతో వండిన భోజనం, పాలు, గుడ్లు, స్నాక్స్‌, బాలామృతం వంటివి అందిస్తుంటారు. గర్భిణులకు సైతం పౌష్టికాహారం అందుతుంది. ప్రభుత్వ సెలవు దినాల్లో కేంద్రాలు మూసే ఉంచుతారు.

పనిదినాల్లో తప్పనిసరిగా పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నా చిన్నారుల్లో ఎదుగుదలలో లోపాలు కనిపిస్తున్నాయి. ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, వయస్సుకు తగిన ఎత్తు లేకపోవడం, బరువుకు తగిన ఎత్తు లేకపోవడం ఇలా ఏదో ఒక లోపం చిన్నారుల్లో కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా 969 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఎండ వేడి, వసతులు లేక, ఉక్కపోత భరించలేమనే సాకుతో సగానికి పైగా కేంద్రాలు తెరవడం లేదని తెలుస్తోంది.

తనిఖీ చేయాల్సిన ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు తాళాలు వేసి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కేంద్రాలను తెరవకున్నా తెరిచినట్లుగా కొందరు టీచర్లు సూపర్‌వైజర్లను మచ్చిక చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది మే నెలలో టీచర్లు, ఆయాలు అంగన్‌వాడీ కేంద్రాలను తెరవనందుకు గాను సూపర్‌వైజర్లు, సీడీపీవోలకు డబ్బులను జమ చేసి పెద్ద మొత్తంలో ముట్టజెప్పినట్లు బయటకు వచ్చింది.

ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి కారకులను బదిలీచేశారు. ఈ ఏడాది కూడా టీచర్లు, ఆయాలు కేంద్రాలను తెరవకపోవడం, గతంలో మాదిరిగానే డబ్బులు జమ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు, అంగన్‌వాడీ కేంద్రాలు, చిన్నారులు

ప్రాజెక్టు అంగన్‌వాడీ చిన్నారులు

కేంద్రాలు

బెల్లంపల్లి 279 11,477

చెన్నూరు 245 9,469

లక్సెట్టిపేట 203 7,874

మంచిర్యాల 242 12,657

మొత్తం 969 41,477

తనిఖీ చేస్తున్నాం

జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు ఆదేశాలు ఇవ్వడంతోపాటు సోమవారం కొన్నింటిని తనిఖీ చేశాం. మూసి ఉంచితే టీచర్లు, ఆయాలపై చర్యలు తీసుకుంటాం.

ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు తక్కువగా హాజరవుతున్నారు. పిల్లలు వచ్చినా, రాకపోయినా కేంద్రాలను పనిదినాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తెరిచి ఉంచడంతోపాటు వారికి పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని ఆదేశించాం.

#Tags