Govt Schools: బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి
నంద్యాల(న్యూటౌన్): గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ సర్వేలో భాగంగా చిన్న చిన్న కారణాలతో బడికి వెళ్లని బడి ఈడు పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలకు పంపేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ పిలుపునిచ్చారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలోని జీఈఆర్ సర్వేపై ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ సర్వేలో భాగంగా వలంటీర్ల బృందాలు అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలలకు పంపేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
మండల తహసీల్దార్లు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంఈఓ, పాఠశాల హెచ్‌ఎంల ఆధ్వర్యంలో 60 మంది వలంటీర్లు బృందంగా ఏర్పాటై దీర్ఘకాలికంగా బడులకు వెళ్లని పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో నమోదు కాని పిల్లలను వెంటనే నమోదు చేయించి జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాలన్నారు. 5–18 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడి బయట ఉండకుండా కచ్చితంగా పాఠశాలల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు వలంటీర్ల పనితీరుపై కూడా స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. మండల స్పెషల్ అధికారులు జీఈఆర్ సర్వేపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బడి ఈడు పిల్లలను గుర్తించి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నారన్నారు. రూరల్ మండలాలలో డ్రాపౌట్స్ లేరని, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు తదితర పట్ట ణ ప్రాంతాల్లో అదనంగా మరొక జిల్లా అధికారిని ఏర్పాటు చేసి డ్రాపౌట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని డీఈఓ సుధాకర్‌రెడ్డికి సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తిరుగు ప్రయాణంలో ఎస్పీజీ గ్రౌండ్ సమీపంలో ఉన్న ముగ్గురు పిల్లల వివరాలు అడిగి తెలుసుకుంటూ ఎందుకు బడి బయట ఉన్నా రని ప్రశ్నించారు. తిరిగి పాఠశాలలకు పంపేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.