PM Vidyalakshmi Scheme : ఉన్నత విద్య రుణాలకు సర్కారు గ్యారెంటీ.. ఉన్నత విద్యాసంస్థల్లో అవకాశం!
కేంద్ర ప్రభుత్వం..తాజాగా పీఎం విద్యాలక్ష్మి స్కీమ్‌లో పలు కీలక మార్పులు చేసింది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో ర్యాంకులు పొందిన ఇన్‌స్టిట్యూట్స్‌తో పాటు ఇతర అత్యున్నత విద్యా సంస్థలలో ప్రవేశం పొందిన వారికి విద్యారుణ మొత్తంలో 75 శాతం గ్యారెంటీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. పీఎం–విద్యాలక్ష్మి స్కీమ్ నూతన విధి విధానాలు, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలు..
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్
కేంద్ర ప్రభుత్వం పీఎం–విద్యాలక్ష్మి స్కీమ్‌కు తాజాగా ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్‌తో ఉన్నత విద్య కోర్సుల్లో చేరే విద్యార్థులకు విద్యా రుణాలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగత వర్గాలు ప్రయోజనం పొందనున్నాయి. ఈ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు.
Government Job Notification: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. జీతం రూ.40వేలు
ఉన్నత చదువులు
➤ పీఎం–విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా దేశ వ్యాప్తంగా 860 విద్యా సంస్థల్లో ఉన్నత కోర్సుల్లో(బ్యాచిలర్, పీజీ, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ తదితర) ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి, చదువుతున్న వారికి ప్రయోజనం చేకూరనుంది.
➤ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకుల్లో ఓవరాల్ కేటగిరీలో టాప్–100లో నిలిచిన ఇన్‌స్టిట్యూట్స్, అదే విధంగా ఆయా విభాగాల్లో టాప్–100 కేటగిరీ లో నిలిచిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఈ స్కీమ్‌ను వర్తింపజేస్తారు.అదే విధంగా.. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 101–200శ్రేణిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు కూడా ఈ స్కీమ్ పరిధిలోకి వస్తా రు. దేశంలో అత్యున్నతమైన ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరొందిన విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులు సైతం ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందొచ్చు.
75 శాతం ప్రభుత్వ గ్యారెంటీ
➤ పీఎం–విద్యాలక్ష్మీ స్కీమ్ ద్వారా రూ.7.5 లక్షల వరకు రుణ మొత్తంలో, 75 శాతం మొత్తానికి కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుంది. అదే విధంగా కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండి.. ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్స్ తదితర ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలు పొందని విద్యార్థుల లోన్ రీపేమెంట్ మారటోరియం సమయంలో మూడు శాతం వడ్డీని ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. దీనిని ఏటా లక్ష మంది విద్యార్థులకు అందిస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
అయితే ఈ విధానంలో ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
➤ కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలోపు ఉన్న టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల లోన్ రీపేమెంట్‌లో మొత్తం వడ్డీని ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. ఇలా గరిష్టంగా రూ.పది లక్షల రుణం వరకు ఈ సదుపాయాన్ని కల్పిస్తారు.
22 లక్షల మందికి ప్రయోజనం
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా ఏటా 22 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌ను 2024–25, 2030–31 వరకు కొనసాగించనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.3,600 కోట్లను కేటాయించారు.
Act Apprentice Posts : ఆర్‌ఆర్‌సీ–నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 1,791 యాక్ట్ అప్రెంటిస్‌లు
ఆన్‌లైన్‌లోనే లోన్ ప్రక్రియ
పీఎం–విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్‌ను రూపొందించనున్నారు. విద్యార్థులు ఈ వెబ్ పోర్టల్‌లో లాగిన్ అయి.. ఆయా బ్యాంకుల విద్యా రుణ విధానాలు చూపి.. తమకు నచ్చిన బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
15 రోజుల్లోపు నిర్ణయం
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా నిర్దేశిత వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి.. ఆ ప్రక్రియ మొత్తాన్ని పదిహేను రోజుల్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో లోన్ కోసమే కాకుండా.. వడ్డీ రాయితీ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వడ్డీ రాయితీ మొత్తాన్ని ఈ–వోచర్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకు అందిస్తుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఏడాది మారటోరియం
ప్రస్తుతం ఐబీఏ మోడల్ ఎడ్యుకేషన్ లోన్ మార్గదర్శకాల ప్రకారం–విద్యా రుణం తిరిగి చెల్లింపునకు ఏడాది మారటోరియం వ్యవధి సదుపాయాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన సంవత్సరం తర్వాత లేదా ఉద్యోగం పొందిన అనంతరం.. ఈ రెండింటిలో ఏది ముందుగా సాధ్యమైతే అప్పటి నుంచి రుణం మొత్తాన్ని వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
విద్యాలక్ష్మి స్కీమ్‌కు కొనసాగింపు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించిన పీఎం–విద్యాలక్ష్మి స్కీమ్‌ను.. ఇప్పటికే అమలులో ఉన్న విద్యాలక్ష్మి స్కీమ్‌కు కొనసాగింపు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి విద్యా రుణాలకు దరఖాస్తు, మంజూరులో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో లాగిన్ అయి.. కామన్ ఎడ్యుకేషనల్ లోన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Civil Assistant Surgeon : టీవీవీపీలో ఒప్పంద ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
ఇలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను.. ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపడం జరుగుతుంది. సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి సంతృప్తి చెందితే తదుపరి దశలో ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు పంపుతారు. అంటే విద్యాలక్ష్మి పోర్టల్ విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు, బ్యాంకులకు అనుసంధానకర్తగా నిలుస్తోంది.
గుర్తింపు తప్పనిసరి
➤ ప్రస్తుతం అమలవుతున్న విద్యాలక్ష్మి స్కీమ్ ప్రకారం–ఏఐసీటీఈ, యూజీసీ, ఎంహెచ్‌ఆర్‌డీ, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ గుర్తింపు ఉన్న కళాశాలు, కోర్సులనే విద్యారుణ మంజూరులో పరిగణనలోకి తీసుకుంటాయి.
➤ ఉన్నత విద్యకు రుణాల మంజూరులో బ్యాంకులు అనుసరిస్తున్న మరో ప్రధానమైన నిబంధన.. విద్యా రుణానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ కోర్సుకు సంబంధించి నిర్వహించిన ఎంట్రన్స్‌లలో ఉత్తీర్ణత సాధిస్తేనే దరఖాస్తుకు అర్హత కల్పిస్తున్నాయి.
French and Germany Courses : ఉస్మానియా యూనివర్శిటీలో ఫ్రెంచ్/జర్మనీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
➤ దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నాయి. విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి గరిష్టంగా రూ.20 లక్షలు మంజూరు చేస్తునాయి.
➤ రుణాలను మూడు శ్లాబ్స్‌గా వర్గీకరించారు. శ్లాబ్–1 మేరకు రూ.4 లక్షల రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు. శ్లాబ్–2 మేరకు రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. శ్లాబ్–3 విధానంలో రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం ఉంటోంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్ సెక్యూరిటీ (స్థిరాస్థి పత్రాలను) ఇవ్వాల్సి ఉంటుంది.
మార్జిన్ మనీ నిబంధన
విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం ఉండదు. కాని రూ.4 లక్షలు దాటిన రుణ దరఖాస్తుల విషయంలో స్వదేశంలో చదివే విద్యార్థులు అయిదు శాతం, విదేశీ విద్య 15 శాతం మార్జిన్ మనీని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్జిన్ మనీ నిబంధన నుంచి కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ వెసులుబాటు కల్పిస్తుందనే వాదన వినిపిస్తోంది.
లభించే వ్యయాలు
దేశంలో అందుబాటులో ఉన్న విద్యా రుణాలు, అవి అందించే వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే.. ట్యూషన్ ఫీజు; హాస్టల్ ఫీజు; ఎగ్జామినేషన్/ లైబ్రరీ / లేబొరేటరీ ఫీజు; విదేశీ విద్యకు ప్రయాణ ఖర్చులు; పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే వ్యయం; కంప్యూటర్ కొనుగోలు వ్యయం; కోర్సు పరంగా అవసరమైన స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ తదితరాలకు అయ్యే వ్యయం; ఇన్‌స్టిట్యూట్‌లు వసూలు చేసే కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, రిఫండబుల్ డిపాజిట్‌లకు రుణం మంజూరు చేస్తారు. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్‌లో సైతం ఇవే వ్యయాలకు రుణం లభించనుంది.
Apprentice Training : బీడీఎల్‌లో అప్రెంటీస్ శిక్షణకు దరఖాస్తులు.. అర్హులు వీరే!
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్.. ముఖ్యాంశాలు
➤ 2024–25, 2030–31 కాలానికి స్కీమ్ అమలు.
➤ విద్యా రుణాలకు 75 శాతం గ్యారెంటీ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం.
➤ 22 లక్షల మందికి ప్రయోజనం;రూ.3,600 కోట్ల కేటాయింపు.
➤ దేశ వ్యాప్తంగా 860 అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందనున్న ప్రయోజనం.
➤ ఆన్‌లైన్‌లో రుణ దరఖాస్తు అవకాశం.
➤ రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉంటే మూడు శాతం, రూ.4.5 లక్షలలోపు వార్షికాదాయం ఉంటే మొత్తం వడ్డీ రాయితీ భరించనున్న ప్రభుత్వం.