NCF: రెండో త‌ర‌గ‌తి వ‌ర‌కు ప‌రీక్ష‌లే వ‌ద్దు

పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది. సీబీఎస్‌ఈకి సంబంధించి ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన, పరీక్షల నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ పాఠ్యాంశ ప్రణాళిక(ఎన్‌సీఎఫ్‌) ముసాయిదాను సిద్ధం చేయించింది. ఇస్రో మాజీ చీఫ్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలోని కమిటీ పాఠశాల విద్యకోసం రూపొందించిన ‘ప్రీ డ్రాఫ్ట్‌’ను విద్యాశాఖ విడుదల చేసింది.

నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ప్రకారం ఎన్‌సీఎఫ్‌ అభివృద్ధి చేస్తున్న ఈ ఫ్రేమ్‌వర్క్‌.. విద్యార్థి పునాది దశకు అవసరమైన రెండు ముఖ్యమైన మూల్యాంకన పద్ధతులు, ప్రాథమిక స్థాయిలో పిల్లల అంచనా, అభ్యసన సమయంలో వారు రూపొందించిన మెటీరియల్‌ విశ్లేషణ ముఖ్యమైనవని పేర్కొంది.

చ‌ద‌వండి: ప‌ది, ఐటీఐ, డిప్లొమా అర్హ‌త‌తో కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే
ప్రత్యక్ష పరీక్షలు, రాత పరీక్షలు రెండో తరగతిలోపు పిల్లలపై అదనపు భారాన్ని మోపుతున్నాయని, వారికి అలాంటి మూల్యాంకన పద్ధతులను తీసేయాలని సూచించింది. మూడో తరగతి నుంచి రాత పరీక్షలు ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. ముసాయిదాలో సన్నాహక దశ (3 నుంచి 5వ తరగతి వరకు)నుంచి రాత పరీక్షలు ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. అలాగే ఎన్సీఎఫ్‌ కమిటీ 6 నుంచి 8 తరగతులను మధ్యదశగా గుర్తిస్తూ తరగతి గదుల్లోని అంచనా పద్ధతులపై మరికొన్ని సూచనలు చేసింది. ‘‘ప్రాజెక్టులు, చర్చలు, ప్రెజెంటేషన్లు, ప్రయోగాలు, పత్రికలు తదితరాలతో అభ్యాస అంచనా జరగాలి. ఈ దశలో ఓ క్రమ పద్ధతిలో జరిగే మూల్యాంకన పరీక్షలు విద్యార్థులకు ఉపయోగపడతాయి. రెండోదశలో (9 నుంచి 12వ తరగతి) సమగ్ర తరగతి గది మూల్యాంకనం సమర్థంగా సాధన  చేయాలి. ఈ దశలో విద్యార్థుల అభ్యాసంలో స్వీయ మూల్యాంకనం కీలకపాత్ర పోషిస్తుంది. బోర్డు పరీక్షలకు, ఇతర పోటీ పరీక్షలకు వారు సిద్ధం కావాలి’’ అని ముసాయిదా వివరించింది.

చ‌ద‌వండి: ప‌ది, డిప్లొమా అర్హ‌త‌తో ఇస్రోలో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే

#Tags