Anganwadi Centre: అంగన్‌వాడీలకు మహర్దశ

కథలాపూర్‌(వేములవాడ): ‘ఉపాధిహామీ పథకంలో మొదటి ప్రాధాన్యంగా అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేయాలి’.. ఇవి సీ్త్ర శిశు సంక్షేమశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాటలు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టనుందని ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

అద్దె భవనాల్లో 535 కేంద్రాలు
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 20మండలాలు, 380 గ్రామాలున్నాయి. వీటి పరిధిలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 48,991 మంది చిన్నారులున్నారు. 6,389 మంది గర్భిణులు, 6,569 మంది బాలింతలు ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతిరోజూ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే వంటగది, చిన్నారులకు ఒక గది గర్భిణులు, బాలింతలకు మరో గది, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉంటే పూర్తిస్థాయిలో వసతులు ఉన్నట్లు. కానీ.. 535 కేంద్రాలు అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 279 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మరో 251 కేంద్రాలు అద్దె లేకుండా ప్రభుత్వ పాఠశాలలు, కులసంఘాల భవనాల్లో నిర్వహిస్తున్నారు.

చదవండి: Entrance Exam: గురుకుల ప్రవేశ పరీక్ష తేదీ ఎప్పుడంటే..

సొంత భవనాలకు ప్రభుత్వ నిర్ణయం
అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానాన్ని కేంద్రాల నిర్వాహకులు స్వాగతిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా అంగన్‌వాడీ టీచర్లు గుర్తుకొస్తారు. గ్రామసభలు నిర్వహిస్తే ప్రజలు రావడం కష్టమే. అలాంటి పరిస్థితుల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు, వీవోఏలను పిలిపించి సభలు నిర్వహించిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానం అమల్లోకి వస్తే అంగన్‌వాడీ టీచర్లు కేంద్రాలను వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ కార్యక్రమాన్ని త్వరగా అమలు చేస్తే బాగుంటుందని అంగన్‌వాడీ టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణలో పారదర్శకత మరింత మెరుగుపడుతుందన్నారు.

#Tags