Govt Hostels: హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలు, వసతి గృహాల్లో మరుగుదొడ్లు సహా ఇతర మౌలిక వసతుల స్థితిగతులపై సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

జూన్‌ 10 వరకు సమయం ఇస్తున్నామని స్పష్టం చేస్తూ, విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వ హాస్టళ్లలో బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్‌–2018 నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు సౌకర్యాలు అందించడం లేదని, 10 మందికి ఓ బాత్రూమ్, ఏడుగురికి ఓ మరుగుదొడ్డి, 50 మందికో వార్డెన్‌ ఉండాలని చెబుతున్నా.. ఆ మేరకు సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన కీర్తినేడి అఖిల్‌ శ్రీ గురుతేజ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

చదవండి: NEET 2024: ప్రశాంతంగా ‘నీట్‌’.. ఈసారి కటాఫ్‌ మార్కులు ఇలా..

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ..  విద్యాహక్కు, బాలల హక్కుల వంటి పలు చట్టాలతో పాటు రాజ్యాంగ నిబంధనల ప్రకారం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

సెలవుల్లోగా వసతులు కల్పిస్తారన్న ఏఏజీ

ఇన్ని రోజులూ విద్యార్థులు హాస్టళ్లలో ఉండటంతో నిర్మాణాలు చేపట్టడానికి ఇబ్బందులు ఉండేవని ఏఏజీ వాదించారు. ఇప్పుడు సెలవులు రావడంతో విద్యార్థులు హాస్టళ్ల నుంచి వెళ్లిపోయారని.. వేసవి సెలవులు జూన్‌ 11న ముగియనున్నాయని చెప్పారు. ఈ సెలవుల కాలంలో పాఠశాలలు, హాస్టళ్లలో వసతులు కల్పిస్తామని తెలియజేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, విచారణను జూన్‌ 10కి వాయిదా వేసింది. 
 

#Tags