Chief Justice of India: దేశ భవిష్యత్తు యువతదే
తిరుపతి సిటీ: ‘దేశ భవిష్యత్తు యువతదే. న్యాయశాస్త్ర అధ్యయనం సామాజిక బాధ్యతగా యువత పరిగణించాలి’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ధనంజయ వై చంద్రచూడ్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన బీఏ ఎల్‌ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు పదవ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగపడాలన్నారు. దేశంలో యువత డాక్టర్, ఇంజినీరింగ్ కోర్సుల కంటే న్యాయశాస్త్ర పఠనంపై ఆసక్తి చూపడం శుభపరిణామన్నారు. భవిష్యత్‌లో న్యాయమూర్తులుగా రాణించాలనే యువత సమస్యను సావధానంగా వినడం, విషయాన్ని లోతుగా పరిశీలించడం అనే రెండు విషయాలను ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలన్నారు. దేశంలో న్యాయవ్యవస్థలో మహిళలు పెద్ద ఎత్తున రాణిస్తున్నారని, సుమారు 50 శాతానికిపై చిలుకు న్యాయాధికారులుగా, అడ్వకేట్లుగా ఉన్నారని ప్రశంసించారు. ఇక్కడి విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత శిఖిరాలను అధిరోహించి ఆకాంక్షించారు.
సీజే యువతకు ఆదర్శం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతకు ఆదర్శమని ఎస్వీయూ వీసీ వీ.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఎస్వీయూ నాణ్యమైన విద్య, ఉపాధి కల్పనే లక్ష్యంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తోందన్నారు. సీజే సూచనలతో యువత మాజ సేవకు అంకితం కావాల ని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్వీయూ లా కళాశాల గౌరవ ప్రొఫెసర్లుగా ఆరుగురు న్యాయాధికారులను నియమిస్తూ సీజే చేతుల మీదుగా ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా సీజే దంపతులను వర్సిటీ అధికారులు జ్ఞాపికతో ఘనంగా సన్మానించగా, వర్సిటీ లా విద్యార్థులు వారిని గజమాలతో సత్కరించారు. సీజే సతీమణి కల్పనాదాస్ చంద్రచూడ్, హైకోర్టు జడ్జి యూ.దుర్గాప్రసాద్‌రావు, డిసిగ్నేటెడ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ మహాలక్ష్మి పావని, రిజిస్ట్రార్ ఓ.మహ్మద్ హుస్సేన్, ప్రిన్సిపల్ పద్మనాభం, డీన్ ఆచార్య ఆర్‌సీ కృష్ణయ్య, హైకోర్టు న్యాయవాదులు, జిల్లా న్యాయమూర్తులు, అడ్వకేట్లు పాల్గొన్నారు.