APSCHE Chairman: ఇంజినీరింగ్‌, మెడికల్‌ ఒక్కటే లక్ష్యం కాదు

గుంటూరుఎడ్యుకేషన్‌: ఇంజినీరింగ్‌, మెడికల్‌ కోర్సులు ఒక్కటే జీవిత లక్ష్యం కారాదని, పిల్లలకు ఆసక్తి గల కోర్సుల్లో చేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ డాక్టర్‌ కె.హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల కల్పనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌ఈహెచ్‌ఈ), మెల్‌బోర్న్‌ యూనవర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో కెరీర్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 21 ప్రభుత్వ పాఠశాలలు, ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం గుంటూరు అమరావతి రోడ్డులోని నెక్ట్స్‌ జెన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజంలో సత్ప్రవర్తన, క్రమశిక్షణతో జీవించేందుకు విద్య ఎంతో అవసరమని చెప్పారు. పాఠశాల విద్యార్థి దశలో నేర్చుకునే పాఠ్యాంశాలు, ఉపాధ్యాయుల బోధన విద్యార్థుల భావిజీవితాన్ని ప్రభావితం చేస్తాయని, టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ విద్య పూర్తి చేసుకునే నాటికి విద్యార్థులను క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన కలిగిన విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఇంజినీరింగ్‌, మెడికల్‌ కోర్సులు ఒక్కటే జీవిత గమ్యమనే భావనతో తల్లిదండ్రులు ఉంటున్నారని, వాటికి మించిన జీవన నైపుణ్యాలను అందించగల ఆర్ట్స్‌, సైన్స్‌, ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయని చెప్పారు. ఒత్తిడి లేని విద్యా విధానంతో ఉత్తమ ఫలితాలను సాధించడంతోపాటు విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దగలమని అన్నారు. ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్‌ దేవకుమార్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగించుకుని విద్యార్థులు తమ కెరీర్‌ను ఎంచుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. కన్సల్టెంట్‌ రాక్వెల్‌ ష్రార్ఫ్‌ మాట్లాడుతూ అంతర్జాతీయంగా లభిస్తున్న ఉద్యోగావకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రెండు రోజులపాటు జరగనున్న శిక్షణా కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి బి.విజయభాస్కర్‌, డీఈవో పి.శైలజ, సమగ్ర శిక్ష ఏపీసీ జి.విజయలక్ష్మి, యూనిసెఫ్‌ ప్రతినిధి ప్రియాంక, 86 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఆసక్తి గల కోర్సుల్లో చేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి
 

#Tags