Degree Second Phase Counselling: ఈనెల 22 నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యా మండలి నిర్ణయం ప్రకారం…ఈనెల 24 వరకు రిజిస్ట్రేషన్లు, 23-25 వరకు ధ్రువపత్రాల పరిశీలన, కోర్సుల ఎంపిక ఉంటుంది. 26న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది. 29న సీట్లను కేటాయిస్తారు. ఈ క్రమంలో విద్యార్థులు ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 3లోపు కాలేజీ చేరాల్సి ఉంటుంది.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 1045 డిగ్రీ కళాశాలల్లో 3,33,757 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 1,27,659 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం మూడు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అర్హత ఉన్న విద్యార్థులు https://oamdc-apsche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందుకోసం బీసీ విద్యార్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200, జనరల్ కేటగిరీ (ఓసీ) విద్యార్థులు రూ.400 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ మార్కు షీట్, కుల ధృవీకరణ, ఇతర అవసరమైన పత్రాలు స్కాన్ చేసిన కాపీలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.