International Womens Day 2024: స్త్రీ సాధికారత పొందాలంటే చేయాల్సింది అదే, అప్పుడే ఆర్థిక సమృద్ధి
స్త్రీలు సంపాదనపరులైతే ఏమవుతుంది?
ఆర్థికంగా సమృద్ధి సాధిస్తే ఏమవుతుంది?
తమ జీవితాలపై అధికారం వస్తుంది. కీలక నిర్ణయాలప్పుడు గొంతెత్తే ఆత్మవిశ్వాసం వస్తుంది.
తమకు ఏ హక్కులు రక్షణ ఇస్తాయో ఎరుక కలుగుతుంది.
స్త్రీ ఇవన్నీ కుటుంబ సంక్షేమానికే వెచ్చిస్తుంది.
స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం ఇంటా, బయటా
స్త్రీ, పురుషుల సమ భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుంది.
కాని స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి ఇంకా ఎంతో చైతన్యం కావాలి.
స్త్రీలు సాధికారత పొందటం అంటే ఏమిటి? పరాధీనత నుంచి బయటపడటమే. అంటే? మరొకరు తనను పోషించే స్థితి నుంచి బయటపడటమే. తండ్రి, భర్త, కుమారుడి సంపాదన వల్ల మాత్రమే జీవితం గడుస్తూ ఉంటే కనుక ఆ పరాధీనత నుంచి బయట పడటం. అంటే బంధం నుంచి బయటపడటం కాదు. స్థితి నుంచి మాత్రమే. స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు. స్త్రీలకు సామాజికంగా, కుటుంబపరంగా హక్కులు ఉంటాయి. అయితే ఆ హక్కులను దక్కించుకోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి.
పుట్టుక నుంచే
స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనే భావన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే తీసివేయడం నేటికీ జరుగుతోంది. ‘ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టడానికి’ అనుకునే తల్లిదండ్రులు, భర్త సంపాదన వల్ల మాత్రమే ఆమె బతకాలనుకునే తల్లిదండ్రులు ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం గ్రామీణ భారతంలో నేటికీ జరుగుతూనే ఉంది. ఆడపిల్లకు ఆస్తిపాస్తులు ఇచ్చినా చదువు వల్ల వచ్చే, ఆమెకై ఎంచుకునే ఉపాధి నుంచి వచ్చే సంపాదన కలిగించే ఆత్మవిశ్వాసం వేరు. స్త్రీలను ‘అదుపులో ఉంచడం’ అంటే వారిని ఆర్థిక వనరుల నుంచి దూరంగా పెట్టడమే. పోపుల డబ్బాలో కొద్దిపాటి చిల్లరకే ఆమె హక్కుదారు. దానివల్ల న్యూనతతో ఉండాలి.
కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల సమయంలో భర్త/తండ్రి/కుమారుడి మాట చెల్లుబాటు కావడానికి కారణం వారు ‘ఆర్థిక వనరులు కలిగి ఉండటం’. ‘రూపాయి సంపాదన లేని దానివి నువు కూడా మాట్లాడేదానివేనా’ అని స్త్రీలను పరోక్షంగా అనడం. అదే ఆమెకు సంపాదన ఉంటే నా వల్ల కూడా కుటుంబం నడుస్తోంది కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం నా పాయింట్ చెప్పాల్సిందే అని అనగలదు. కుటుంబపరంగా, సామాజికంగా తన జీవితం ఏ విధంగా గడవాలని స్త్రీ ఆశిస్తుందో ఆ నిర్ణయాన్ని వెల్లడించే శక్తి ఆర్థిక స్వావలంబన వల్ల కలుగుతుంది. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం. అందుకు చదువు ముఖ్య సాధనం.
సాధికారత అంటే?
స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే. ఒక స్త్రీ అంట్రప్రెన్యూర్ కావాలనుకున్నా, పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్నా, కాన్పు సమయంలో బ్రేక్ తీసుకుని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా, పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్లాలనుకున్నా, గృహిణిగా ఉంటూ ఇంటిపట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో 90 శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. పురుషులు నలభై–యాభై శాతం ఖర్చు పెడతారు. స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయట పడేయడం. ఎక్కువ తక్కువ లేని గౌరవ బంధాలను ప్రతిపాదించడం.
ఆర్థిక అక్షరాస్యత
స్త్రీలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్త్రీలకు ఆర్థిక అక్షరాస్యతను కలిగించాలి. వ్యక్తిగత ఖర్చులు, కుటుంబ బడ్జెట్, పొదుపు, ఆదాయం తెచ్చే పెట్టుబడి... వీటి గురించి అవగాహన ఉండాలి. ‘మీ జీవితం మీ చేతుల్లో ఉండాలంటే’ మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి... అందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలి. సొంత ఆస్తి, స్వీయపేరు మీద పాలసీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, షేర్లు, ఎమర్జన్సీ ఫండ్ కలిగి ఉండటం, డిజిటల్ పరిజ్ఞానం పొంది ఉండటం– అంటే ఆర్థిక లావాదేవీలు ఫోన్‌మీద, కంప్యూటర్ మీద చేయగలిగి వేగంగా పనులు నిర్వర్తించ గలగడం.
కుటుంబ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అనుకుంటే కుటుంబంలో కీలకమైన వాటాదారైన స్త్రీ ఎంత ఆర్థిక సమృద్ధితో ఉంటే దేశ సమృద్ధి అంతగా పెరుగుతుంది. ఉమెన్స్ డే సందేశం అదే.