Startup Hub: ఉమెన్ స్టార్టప్ హబ్
సాక్షి, విశాఖపట్నం: ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్–విశాఖపట్నం(ఐఐఎంవీ) విభిన్న ఆలోచనలతో ముందుకెళ్తోంది. మహాత్మాగాంధీ నేషనల్ ఫెలో షిప్ పొందిన 9వ ఐఐఎంగా చరిత్ర పుటల్లోకెక్కిన ఐఐఎంవీ.. మహిళల కోసం ప్రత్యేకంగా వుమెన్ స్టార్టప్ హబ్‌ను ప్రారంభించింది. ఇప్పటికే 90 మందికిపైగా మహిళల స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్ సౌకర్యాన్ని కల్పించింది. మరోవైపు మూడు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 14 జిల్లాల్లో స్టార్టప్ హబ్‌లు ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.
రెండేళ్ల సుదీర్ఘ ఫెలోషిప్‌తో పాటు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడంలో భాగంగా అవసరమైన శిక్షణ, వనరులను సృష్టించే మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ (ఎంజీఎన్‌ఎఫ్)ని ఐఐఎంవీ దక్కించుకుంది. ఇందుకు ఎంపికై న 75 మంది యువత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఆయా కలెక్టర్ల వద్ద అండర్ స్టడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక స్టార్టప్ హబ్‌లను ఏర్పాటు చేయడంలో ఐఐఎంవీ విజయవంతంగా వ్యవహరిస్తోంది.
మహిళల కలలు సాకారం
ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గ్రూప్–3 సెంటర్(జీ3సీ) ఇంక్యుబేటర్‌ను మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం ఈ సెంటర్‌ను సెక్షన్–8 కంపెనీగా నిర్వహించాల్సిన నేపథ్యంలో ఐఐఎంవీ ఫౌండేషన్ ఫర్ ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్రెన్యూరియల్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్(ఐఐఎంవీ ఫీల్డ్)ను ఏడాదిన్నర కిందట ప్రారంభించింది. ఈ సెంటర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 90కిపైగా మహిళల నేతృత్వంలోని ఇక్కడ స్టార్టప్‌లు పురుడుపోసుకున్నాయి. తాజాగా 36 మంది మహిళా పారిశ్రామికవేత్తలతో మరో వుమెన్ స్టార్టప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు తమ కలలను సాకారం చేసుకునే దిశగా సహకారం తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ స్టార్టప్‌లలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి.
డిస్ట్రిక్ట్ స్టార్టప్ హబ్‌లకు శ్రీకారం
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 14 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ స్టార్టప్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఐఐఎంవీ సన్నద్ధమవుతోంది. క్యాంపస్ అధికారులు ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపించగా.. వారి సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సామర్థ్య నిర్మాణానికి కృషి చేయడంతో పాటు వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ అనే అంశాన్ని ప్రోత్సహించేందుకు కూడా డిస్ట్రిక్ట్ స్టార్టప్ హబ్‌లు ఉపయుక్తంగా నిలుస్తాయని క్యాంపస్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ తెలిపారు.