ITDA Deputy Director: విధి నిర్వహణలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బేల: విధి నిర్వహణలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలలను సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. స్టాకు నిల్వలు, వంట గది, నీళ్ల, తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. సమస్యలపై రోడ్డెక్కుతున్న విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్ల సమస్య లేకుండా పైప్‌లైన్ మరమ్మతు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వార్డెన్‌ను ఆదేశించారు. వార్డెన్ అందుబాటులో లేనప్పుడు, సెలవులో ఉన్నప్పుడు ఉపాధ్యాయుడికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని హెచ్‌ఎంకు సూచించారు. విద్యార్థుల వైద్య, ఆరోగ్యం పట్ల రెండు, మూడు రోజుల్లో ఒక్కో ఆశ్రమ పాఠశాలలో ఒక్కో ఏఎన్‌ఎంను నియమిస్తామన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం, రోడ్డెక్కడం పునరావృతమైతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా విద్యార్థులతో దురుసుగా మాట్లాడుతున్న వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు ఆడ శంకర్, పెందుర్ రాందాస్, సిడాం నందకుమార్‌లు డిప్యూటీ డైరెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.