Solar installation in schools: సర్కారు బడుల్లో సౌర వెలుగులు
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల్లో సోలార్ వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెరుగుతున్న విద్యుత్ భారం తగ్గించేందుకు సౌర వెలుగులకు విద్యాశాఖ, టీఎస్ రెడ్‌కో ఈ పథకం అమలుకు నిర్ణయించాయి. స్కూల్ గ్రాంటులో అత్యధికంగా విద్యుత్ బిల్లుల చెల్లింపులకే సరిపోతుంది. విద్యుత్ ఖర్చులు తగ్గింపు ఇతర పరిస్థితుల నేపథ్యంలో 133 పాఠశాలలను ఎంపిక చేశారు. పాఠశాలలో క్షేత్రస్థాయి టీఎస్ రెడ్‌కో ప్రతినిధి బృందం పరిశీలన అనంతరం ఎంత మేర సోలార్ పలకలు అవసరం ఉన్నాయో గుర్తించనున్నారు. ఆయా పాఠశాలల్లో సోలార్ సిస్టం అమర్చడంతో సౌర వెలుగులు రానున్నాయి.
విద్యుత్ ఖర్చులు అధికంతో..
ఎంపిక చేసిన 133 పాఠశాలలకు సోలార్ వెలుగులు రానున్నాయి. సోలార్ పలకలు ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్లు, ఫ్యాన్లు, బల్పులు, బోరు మోటర్ నడవడానికి అధికంగా విద్యుత్ వినియోగిస్తుంటారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసే సోలార్ విద్యుత్ పలకలతో రెండు కిలో వాట్స్ నుంచి 10 కిలోవాట్స్ వరకు విద్యుత్ ఉత్పత్తి కానుంది. కిలోవాట్స్‌లను బట్టి రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు వ్యయం చేయనున్నారు. బ్యాటరీ ఇన్వర్టర్ల ద్వారా సోలార్ విద్యుత్‌ను నిల్వ చేసుకొని పాఠశాలల్లో అవసరం మేరకు వినియోగిస్తారు.
ఎంపికై న పాఠశాలలు ఇవే..
జిల్లాలో ఎంపిక చేసిన వాటిలో ఎంపీపీఎస్, ఎంపీయూపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, రెసిడెన్సీ పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 2కిలోవాట్స్, ప్రాథమికోన్నత, జెడ్పీ ఉన్నత పాఠశాలలో 5కిలోవాట్స్, రెసిడెన్సీ, కేజీబీవీలో 10 కిలోవాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కసరత్తు చేస్తున్నారు. బెల్లంపల్లి మండలంలో 10, భీమినిలో 6, భీమారంలో 1, చెన్నూర్‌లో 9, దండేపల్లిలో 8, హాజీపూర్‌లో 6, జైపూర్‌లో 8, జన్నారంలో 14, కన్నెపల్లిలో 6, కాసిపేటలో 8, కోటపల్లిలో 7, లక్సెట్టిపేటలో 12, మంచిర్యాలలో 11, మందమర్రిలో 10, నస్పూర్‌లో 5, నెన్నెలలో 3, తాండూర్‌లో 6, వేమనపల్లి మండలంలో 3 పాఠశాలలు ఎంపిక చేశారు.
విద్యాలయాల్లో సోలార్ ఏర్పాటు
సర్కారు పాఠశాలల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తొలి విడతలో పాఠశాలలు ఎంపిక చేశాం. త్వరలోనే సోలార్ విద్యుత్ వ్యవస్థ పాఠశాలల్లో అమల్లోకి రానుంది.
– యాదయ్య, డీఈవో, మంచిర్యాల