Private Universities To Set Up Off-Campus Centres- ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ
ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఆఫ్ క్యాంపస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైవేట్ యూనివర్సిటీలు, ఆఫ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునేందుకు యూజీసీ రెగ్యులేషన్ 2003 ప్రకారం అన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కమిషన్ నిబంధనలను రూపొందించింది.
అంతేకాకుండా ఐదేళ్లకు మించకుండా కొత్తగా ఏర్పాటైన ప్రైవేట్ యూనివర్సిటీలు, ఆఫ్ క్యాంపస్‌లు స్థాపించడానికి అనుమతి లేదు. అంతేకాకుండా మెయిన్ క్యాంపస్‌కు ఏమాత్రం తగ్గకుండా ఫ్యాకల్టీ,సదుపాయాలు సహా అన్ని నాణ్యత ప్రమాణాలను ఆఫ్ క్యాంపస్‌లో పాటించాల్సి ఉంటుంది.
యూజీసీ ప్రమాణాల ప్రకారం.. ప్రస్తుతం 471 ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నా, ఇప్పటివరకు ఏ యూనివర్సిటీకి కూడా ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు యూజీసీ అనుమతించలేదు. తాజా నిబంధనల నేపథ్యంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఆఫ్-క్యాంపస్ సెంటర్లను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీలు స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదనలు పంపాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది.
తాజాగా ఈ అంశంపై UGC చైర్‌పర్సన్ M జగదీష్ కుమార్ మాట్లాడుతూ..విద్యారంగంలో మార్పులు తీసుకుని రావాలన్న లక్ష్యంతో నూతన విద్యావిధానంలో కీలక మార్పులు మంచి పరిణామమని అన్నారు.