Kendriya vidyalayas: ప్రవేశాలకు వేళాయే.... కేంద్రీయ విద్యాలయాలకు ఇలా అప్లై చేసుకోండి
ఉదయం 10గంటలకే ప్రారంభం....
2023-24 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలు మొదలయ్యాయి. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 17న రాత్రి 7గంటల వరకు కొనసాగనుంది. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు పూర్తి కావాలి.
ప్రాధాన్యత క్రమంలో....
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి జాబితాను ఏప్రిల్ 20న విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్ 21వ తేదీ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలిదశలో సీట్లు మిగిలిపోతే రెండో, మూడో జాబితాలను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. అలాగే రెండో తరగతి, ఆపై తరగతుల్లో ఖాళీగా ఉండే సీట్లను భర్తీ చేసేందుకు ఏప్రిల్ 3న ఉదయం 8గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమై ఏప్రిల్ 12న సాయంత్రం 4గంటలకు ముగుస్తుంది.
వీరికే మొదటి ప్రాధాన్యం...
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.
- ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్ల చొప్పున కేటాయిస్తారు.
- ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టమ్ ప్రకారం సీటును కేటాయిస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది.
- సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
- పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
- విద్యార్థుల తల్లిదండ్రులు https://kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.