Skip to main content

జేఎన్‌యూ వీసీగా తెలుగు మ‌హిళ‌ల‌కు అవకాశం... అలాగే యూజీసీ చైర్మన్‌గా కూడా..

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (JNU)కి వైస్‌ఛాన్సలర్‌గా తొలిసారిగా మహిళలను నియమించారు. జేఎన్‌యూ నూతన వీసీగా ఫ్రొఫెసర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను నియమిస్తూ కేంద్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.
జేఎన్‌యూ నూతన వీసీగా ఫ్రొఫెసర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌
జేఎన్‌యూ నూతన వీసీగా ఫ్రొఫెసర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌

జేఎన్‌యూ వీసీగా మ‌హిళ ప్రొఫెస‌ర్‌ను నియ‌మించ‌డం ఇదే తొలిసారి. వీసీ ప‌ద‌విలో శాంతిశ్రీ పదవి కాలం ఐదేళ్లు ఉండనుంది. జేఎన్‌యూకి వీసీగా వరుసగా రెండోసారి తెలుగు వ్యక్తి నియమితులు కావడం విశేషం. శాంతిశ్రీ ప్రస్తుతం సావిత్రీబాయి పూలే విశ్వవిద్యాలయంలో పొలిటికల్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక శాంతిశ్రీ జేఎన్‌యూ నుంచి ఎంఫిల్‌, పీహెచ్‌డీ డిగ్రీలను పొందారు. ఆమె 1988లో గోవా విశ్వవిద్యాలయంలో తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం 1993లో పూణె యూనివర్సిటీలో చేరారు.

యూజీసీ చైర్మన్‌గా తొలి తెలుగు వ్యక్తి ఈయ‌నే..

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) చైర్మన్‌గా ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌


యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) చైర్మన్‌గా ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ నియమితులయ్యారు.  కమిషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ డిపి సింగ్‌ పదవీకాలం ముగియడంతో 2021, డిసెంబర్‌ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్‌ ఎంపికయ్యారు. దీంతో యూజీసీ చైర్మన్‌గా నియమితులైన  మూడో తెలుగు వ్యక్తిగా జగదీశ్‌ నిలిచారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. 1961లో డాక్టర్‌ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు జగదీశ్‌  నియమితులయ్యారు. 60 ఏళ్ల జగదీశ్‌ కుమార్‌ ప్రస్తుతం ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. యూజీసీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 

జగదీశ్ కుమార్ గురించి మ‌రింత స‌మాచారం..
➤ నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామానికి చెందిన జగదీశ్ కుమార్ డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 
➤ 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ టీచింగ్‌’ అందుకున్నారు. 
➤ ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు.    
➤ అనంతరం కేంద్ర ప్రభుత్వ  సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియమ్స్‌ పాలకమండలి చైర్మన్‌గా, నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) సభ్యునిగా ఉన్నారు. 
➤ ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజనీరింగ్, ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, ది ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్స్‌ ఫెలో అందుకున్నారు.
➤ సెమీకండక్టర్‌ డివైజ్‌ డిజైన్, మోడలింగ్‌ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్‌లాల్‌ వాధ్వా గోల్డ్‌ మెడల్‌ లభించింది. 
➤ భారతదేశ ఎలక్ట్రానిక్స్‌ – సెమీకండక్టర్‌ అసోసియేషన్‌ అందించే మొట్టమొదటి ఐఎస్‌ఏ అండ్‌ వీఎస్‌ఐ టెక్నోమెంటర్‌ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు.

Published date : 07 Feb 2022 02:12PM

Photo Stories