International Teacher's Day: ఉపాధ్యాయులే.. దేశ భవిష్యత్తు నిర్మాతలు
కడప సెవెన్‌రోడ్స్: దేశ భవిష్యత్తు నిర్మాతలు ఉపాధ్యాయులేనని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. అజ్ఞానాన్ని తొలగించి పిల్లల్లో క్రమశిక్షణ నేర్పి ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదేనన్నారు. అందుకే ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో గౌరవప్రదమైన స్థానముందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో కడప, రాజంపేట పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 400 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి పురస్కారాలు అందజేశారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 1982లో వైఎస్.రాజశేఖరరెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల జీతభత్యాలు, ఇతర సమస్యలను పరిష్కరించారన్నారు. సీఎంగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు ఉన్నత విద్య చదివే అవకాశం కల్పించారన్నారు. నేటి సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారన్నారు. చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధ్యాయులే దేశ ఆర్థిక నిర్మాతలు అన్నారు. సీఎం వైఎస్ జగన్ విద్యకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. మన విద్యార్థులు ఐక్య రాజ్య సమితిలో ప్రతిభ చాటుతున్నారని కొనియాడారు. కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ పిల్లలను క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. క్రమశిక్షణతోనే భవిష్యత్తు సాధ్యపడుతుందన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులనే ఆదర్శంగా తీసుకుంటారని చెప్పారు. తమ జిల్లాలో 12000 కంటి ఆపరేషన్లు, 1000 మంది టీబీ రోగులను ఆదుకునే విషయంలో ఆకేపాటి ఫౌండేషన్ ఇచ్చిన సాయం మరువలేనిదన్నారు. మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ అవినీతికి తావు లేని రంగం ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ రంగమేనని కొనియాడారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి రూ. 58 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. పాఠశాలల్లో డిజిటల్ బోర్డులు, బాత్ రూమ్‌లు, ఫ్యాన్లు, ఇతర సదుపాయాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, కడప, అన్నమయ్య డీఈఓలు రాఘవరెడ్డి, పురుషోత్తంతోపాటు పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.