Free Coaching: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ శిక్షణ
వీరిని ఉత్తమంగా తీర్చిదిద్ది పోటీ పరీక్షలకు సిద్ధంచేస్తోంది. గత ఏడాది ఆగస్టులో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు రెండు కళాశాలల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ శిక్షణను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది.
తొలిదశలో 3 వేల మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్‌కు శిక్షణనిస్తున్నారు. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లెక్చరర్లు 800 మందికి శిక్షణనిచ్చి, వారి సూచనల మేరకు విద్యార్థులకు శిక్షణ ప్రారంభించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఎంబైబ్ సంస్థ ఉచితంగా అందిస్తోంది.
చదవండి: Free Coaching: నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూప్స్, పోటీ పరీక్షలకు 3నెలల ఉచిత శిక్షణ
సైన్స్, మ్యాథమెటిక్స్ తరగతులకు అవసరమైన మెటీరియల్, వీడియో పాఠాలను ఈ సంస్థ అందిస్తోంది. శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఈ ఏడాది జరిగే ఏపీఈఏపీ సెట్, నీట్, జేఈఈ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా శిక్షణలో అవసరమైన మార్పులుచేసి రాష్ట్రంలోని 470 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోను ఈ శిక్షణను ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.
స్వచ్ఛంద బోధనకు లెక్చరర్ల అంగీకారం..
ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్ శిక్షణకు ఉచితంగా సాంకేతిక సహకారం అందించేందుకు వెంబైబ్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో సాధాసాధ్యాలను అంచనా వేసేందుకు ఇంటర్ బోర్డు లెక్చరర్ల సహకారం తీసుకుంది. ఒక్కో సబ్జెక్టు నుంచి ఆసక్తిగల 10 మందిని ఎంపిక చేసి, వారికి ఎంబైబ్ సంస్థ పరిశీలన కోసం మెటీరియల్‌ను పంపించింది.
వీడియో పాఠాలు, నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించిన అనంతరం వారు సూచించిన మార్పులు చేసి శిక్షణను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఖరీదైన ఐఐటీ, నీట్ వంటి శిక్షణను అందించేందుకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా 800 మంది జూనియర్ లెక్చరర్లు ముందుకొచ్చారు.
వారికి నిపుణులతో శిక్షణపై ఇంటర్ బోర్డు పూర్తి అవగాహన కల్పించింది. రెగ్యులర్ పాఠాలు పూర్తయిన తర్వాత ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ, ఏపీఈఏపీ సెట్.. బైసీసీ విద్యార్థులకు నీట్, ఈఏపీ సెట్ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
చదవండి: Free Coaching: స్టడీ సర్కిళ్లు సిద్ధం.. వీరు అర్హులు..
ఐఎఫ్‌పీలపై 3డీలో వీడియో పాఠాలు..
మెటీరియల్‌తో పాటు సబ్జెక్టు వారీగా వందలాది వీడియో పాఠాలను ఎంబైబ్ సంస్థ అందించింది. నాడు–నేడులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను అందించింది. మరికొన్ని కాలేజీల్లో ప్రొజెక్టర్లు ఉన్నాయి.
వీటిద్వారా విద్యార్థులకు 3డీలో సైన్స్ వీడియో పాఠాలను బోధిస్తున్నారు. పాఠం పూర్తయ్యాక టాపిక్ వారీగా ఆన్‌లైన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో స్వయంగా టాపిక్‌ల వారీగా టెస్టు పేపర్లు తయారుచేసుకునే విధానం అందుబాటులోకి తెచ్చారు. గతంలో వచ్చిన ప్రశ్నలను విశ్లేషించి, ఏ తరహా ప్రశ్నలు రావచ్చో ఈ టెక్నాలజీ వివరిస్తోంది.
గతంలో హెచ్‌సీఎల్ నిర్వహించిన “టెక్ బీ’ ప్రోగ్రామ్‌కు 4,500 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, 900 మంది ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇస్తున్న జేఈఈ, నీట్‌లోను విద్యార్థులు విజయం సాధిస్తారని ఇంటర్మీడియట్ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఆశాభావం వ్యక్తంచేశారు.