Dr. YSR Health University: ‘నర్సింగ్’లో పరిశోధనలకు ప్రోత్సాహం
ఏయూ క్యాంపస్: నర్సింగ్ విద్యలోనూ పరిశోధనలకు ప్రోత్సాహం అందిస్తామని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జీ అన్నారు. శనివారం విశాఖలో సెయింట్ లూక్స్, విజయ లూక్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యాసంస్థల గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబ్జీ మాట్లాడుతూ.. ప్రపంచ అత్యుత్తమ నగరాల్లో విశాఖ ఒకటని.. సుందరంగా, ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. సుశిక్షితులైన నర్సింగ్ సిబ్బందిని తయారు చేసే విధంగా రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల నిర్వహణ జరుగుతోందన్నారు. కోవిడ్ వంటి విపత్కర సమయాల్లో వీరు అందించిన సేవలను సమాజం ఎన్నటికీ మరువదన్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, కేజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున మాట్లాడుతూ.. వైద్యులతో సమానంగా రోగులకు నర్సింగ్ సిబ్బంది సేవలందిస్తున్నారని.. ఇలాగే వృత్తి ధర్మాలను, నైతిక విలువలను పరిరక్షించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. నర్సింగ్ పూర్తి చేసిన వారికి విదేశాల్లో కూడా మెండుగా ఉపాధి అవకాశాలున్నాయని ఏపీ నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ ఏఎన్‌ఎం అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ఆచార్య కె.సుశీల అన్నారు. అనంతరం నర్సింగ్ డిగ్రీ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, సంస్థ చైర్‌పర్సన్ ఎం.విజయ లూక్, కరస్పాండెంట్ మమత ప్రసాద్, డైరెక్టర్ షావిలా ప్రీతం, డైరెక్టర్ షైనీ సుమన్, డైరెక్టర్ ప్రీతమ్ లూక్ తదితరులు పాల్గొన్నారు.