APPGCET 2023: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు
ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2023 (ఏపీ పీజీసెట్–2023) కౌన్సెలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యా మండలి సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం నుంచి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంతో పాటు, 16 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పీజీ సెట్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించింది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజును విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీలకు రూ. 700, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులకు రూ.500గా ఫీజు నిర్ణయించారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, కౌన్సెలింగ్ ఆప్షన్ల నమోదు వంటి ప్రక్రియలకు హెచ్‌టీటీపీఎస్:సీఈటీఎస్.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవి.ఇన్‌లోకి వెళ్లి హాట్ టిక్కెట్, డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫీజు డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించ వచ్చు. అనంతరం విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
షెడ్యూల్...
వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్: ఈ నెల 12 నుంచి 20 వరకు కొనసాగుతుంది.
ఆన్‌లైన్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన: ఈ నెల 13 నుంచి 22 వరకు కొనసాగుతుంది.
ప్రత్యేక కేటగిరీలకు సంబంధించి విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్‌లో ధ్రువీకరణ పత్రాలు నేరుగా పరిశీలిస్తారు. పీహెచ్, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్సు విద్యార్థులు షెడ్యూల్ మేరకు ఫీజు చెల్లించి హాజరు కావాల్సి ఉంటుంది.
వెబ్ ఆప్షన్ల నమోదు: ఈ నెల 20 నుంచి 24 వరకు
వెబ్ ఆప్షన్ల మార్పు: 25వ తేదీన
సీట్ల అలాట్‌మెంట్: 27న సాయంత్రం ఆరు గంటలకు
క్లాస్ వర్క్ : ఈ నెల 29వ తేదీన
అవసరమైన ధ్రువీకరణ పత్రాలు
హాట్ టిక్కెట్, ర్యాంకు కార్డు, బదిలీ ధ్రువీకరణ పత్రం, డిగ్రీ మార్కుల మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, టెన్త్, ఇంటర్, డిప్లమా, స్టడీ, రెసిడెన్స్, ఆదాయ, కుల, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, లోకల్ స్టేటస్ వంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం మేరకు అప్‌లోడ్ చేయాలి.
వర్సిటీలో..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 16 కోర్సులు, 570 సీట్లు ఉన్నాయి. ఎకనామిక్స్‌లో 40, రూరల్ డెవలప్‌మెంట్‌లో 40, ఎంకాంలో 40, ఎంఎల్‌ఐఎస్సీలో 40, ఇంగ్లిష్‌లో 40, ఎంఈడీలో 40, సోషల్ వర్క్‌లో 40, తెలుగులో 40, ఎంజేఎంసీలో 3 0, మ్యాథ్స్‌లో 44, అప్‌లైడ్ మ్యాథ్స్‌లో 22, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 33, ఎననాటికల్ కెమిస్ట్రీలో 22, బయోటెక్నాలజీలో 33, మైక్రో బయోలజీలో 22, ఫిజిక్స్‌లో 44 సీట్లు ఉన్నాయి. అఫిలియేషన్ కాలేజీలైన శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల, గురజాడ, ఎస్‌ఎస్‌ఆర్, ఆదిత్య, రంగముద్రి కళాశాలల్లో 650 సీట్లు ఉన్నాయి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, తెలుగు, జువాలజీ వంటి కోర్సులు ఉన్నాయి.
ప్రమాణాలతో కూడిన విద్య
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 16 పీజీ కోర్సులు నిర్వహిస్తున్నాం. అఫిలియేషన్ కళాశాలల్లో సైతం విద్యార్థులు చేరవచ్చు. వర్సిటీలో ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నాం. అర్హత ఉన్న వారికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వర్తిస్తాయి. కౌన్సెలింగ్ షెడ్యూల్ మేరకు ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాలి. విద్యార్థులు అందుబాటులో ఉన్న పీజీ విద్యను సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రొఫెసర్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్, రిజిస్ట్రార్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం
నేటి నుంచి పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్
రాష్ట్రంలో 16 విశ్వవిద్యాలయాల పీజీ కోర్సుల్లో ప్రవేశాలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 16 కోర్సులు, 570 సీట్లు వర్సిటీ అఫిలియేషన్ కళాశాలల్లో 650 సీట్లు, మొత్తం 1220 సీట్లు