47 Percent Quota For Women: 47 శాతం కొలువులు మహిళలకే.. వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: గడిచిన మూడు నెలల్లో మొత్తం 28,942 కొలువులను భర్తీ చేయగా, అందులో 13,571 (47 శాతం) కొలువులను మహిళలు, 15,371 (51 శాతం) ఉద్యోగాలను పురుషులు దక్కించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్‌గా అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.3 జారీ చేయగా, దీనితో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో మహిళలు, పురుషులకు లభించిన పోస్టుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కోటా మాత్రమే ఉన్నా, వారు ఏకంగా 47 శాతం ఉద్యోగాలను దక్కించుకున్నారని ప్రభుత్వం తెలిపింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాల మేరకు 2022 లోనే రాష్ట్ర ప్రభుత్వం 7593 మెమో జారీ చేసిందని, దాని ఆధారంగానే ప్రభుత్వం ఇటీవల జీవో నం. 3 జారీ చేసిందని అధికారవర్గాలు తెలిపాయి.