2 Lakh Jobs Guarantee : 2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ, ఇప్పటికే 31వేల ఉద్యోగాల భర్తీ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని, 71రోజుల్లో ఇప్పటికే 31వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. మార్చి 10న కాకతీయ యూనివర్సిటీలో సుమారు రూ.47కోట్లతో నిర్మించిన కె–హబ్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
వీసీ ఆచార్య తాటికొండ రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు ధనసరి అనుసూయ(సీతక్క), కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కె–హబ్‌లో మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే నాలుగు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు యూనివర్సిటీల్లోని యువతను రెచ్చగొట్టి దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించకుండా విస్మరించిందని విమర్శించారు.