Revanth Reddy: యూపీఎస్సీలా టీఎస్‌పీఎస్సీ!
టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ మొదలు పోస్టుల భర్తీ వరకు యూపీఎస్సీ తరహాలోనే జరిగేలా తగిన మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి జనవరి 5న యూపీఎస్సీ చైర్మన్‌తో, అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వినతిపత్రాలు సమర్పించారు.
తగిన సహకారం అందించండి మంత్రి ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులతో కలసి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్‌కుమార్‌లతో రేవంత్ భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన అంశంపై చర్చించారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
వివాద రహితంగా పరీక్షల నిర్వహణ, నియామకాల్లో పారదర్శకత విషయంలో సహకరించాలని వారిని కోరారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటకుండా సమర్థవంతంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశంసించారు.
ఏడాది చివరికల్లా రెండు లక్షల ఉద్యోగాలు
తెలంగాణలో చేపట్టే నియామకాల్లో నూతన విధానాలు, పద్ధతులను పాటించాలని నిర్ణయించినట్టు యూపీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి.. కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. ఫలితంగా పేపర్ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందని పేర్కొన్నారు.
తాము రాజకీయ ప్రమేయం లేకుండా టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని.. అవకతవకలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు.
సీఎం దృష్టి సారించడం అభినందనీయం
టీఎస్‌పీఎస్సీ నియామకాల ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించడం అభినందనీయమని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని పేర్కొన్నారు. యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని.. సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన వివరించారు.
టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నానికి తాము సహకారం అందిస్తామని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తోపాటు సభ్యులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ భేటీలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాణిప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు.