Skip to main content

టీఎస్పీఎస్సీ కమిషన్ను మూసేయాలని భావిస్తున్నారా?: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే కీలకమైన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కు చైర్మన్, సభ్యులను ఎందుకు నియమించడం లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇంత ప్రాముఖ్యత కలిగిన కమిషన్ను నిర్వీర్యం చేస్తారా అంటూ ప్రశ్నించింది. కమిషన్ను మూసేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. కమిషన్కు చైర్మన్, సభ్యులను నాలుగు వారాల్లో నియమించాలని ఆదేశించింది. తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీలో చైర్మన్, సభ్యులను నియమించేలా ఆదేశించాలంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగి జె.శంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. కమిషన్లో 9 మంది సభ్యుల పదవీ కాలం ఎనిమిది నెలల క్రితం ముగి సిందని, చైర్మన్ పదవీ కాలం డిసెంబర్తో ముగిసిందని.. అయినా నియామక ప్రక్రియ చేపట్టడం లేదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం కమిషన్లో ఒకే ఒక సభ్యుడు ఉన్నారని, ఆయన పదవీకాలం కూడా ఆగస్టుతో ముగుస్తుందని తెలిపారు. ఉన్న ఒక్క సభ్యుడి పదవీకాలం ముగిసిన తర్వాత కానీ.. నియామక ప్రక్రియ ప్రారంభించరా అని ధర్మాసనం ఏజీ బీఎస్ ప్రసాద్ను ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకపాత్ర పోషించే కమిషన్కు చైర్మన్, సభ్యులను నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత జాప్యం చేయడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కుంటిసాకులు చెప్పకుండా వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించి నాలుగు వారాల్లో పూర్తి చేసి తదుపరి విచారణ నాటికి తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.
Published date : 30 Apr 2021 03:07PM

Photo Stories