‘నర్సింగ్’ ధ్రువపత్రాల పరిశీలన వాయిదా: టీఎస్‌పీఎస్సీ
Sakshi Education
సాక్షి, సిటీబ్యూరో: నర్సింగ్ సిబ్బంది నియామకంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ అంశంపై నాలుగు రోజుల నుంచి నర్సింగ్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నేటి నుంచి జరగాల్సిన స్టాఫ్ నర్సుల ధ్రువపత్రాల పరిశీలనను గురువారం ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 3,311 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పదేళ్ల నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న అభ్యర్థులకు సర్వీస్ వెయిటేజీ మార్కుల కేటాయింపు విషయంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఆయా అభ్యర్థులు వైద్య ఆరోగ్యశాఖ డెరైక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధ్రువపత్రాల పరిశీలన వాయిదా వేయడంపై తెలంగాణ మెడికల్ ఔట్ సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ యూనియన్ అధ్యక్షుడు నరసింహ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు మేల్కొని, అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Published date : 13 Nov 2020 04:10PM