Skip to main content

High Court: టీఎస్‌పీఎస్సీ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ఉద్యోగాల కోసం ఏళ్లుగా లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, వారి జీవితాలతో ఎందుకు ఆటలాడుకుంటున్నారని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ని హైకోర్టు ప్రశ్నించింది.
High Court, High Court Questions TSPSC Over Group-1 Job Delay,Unemployed in Telangana Demand Group-1 Jobs
టీఎస్‌పీఎస్సీ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

 నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు కూడా చూశామని, ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా చేయలేకపోవడమేంటని నిలదీసింది. ప్రిలిమ్స్‌కు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్‌ ఎందుకు తీసుకోలేదో చెప్పాలంటూ టీఎస్‌పీఎస్సీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను అమలు చేయలేనప్పుడు అనుబంధ నోటిఫికేషన్‌ ఇవ్వాలి కదా.. ఒకసారి గ్రూప్‌–1 ప్రశ్నపత్రం లీకైన నేపథ్యంలో పరీక్షను మళ్లీ నిర్వహించేటప్పుడు పకడ్బందీ చర్యలు చేపట్టాలి కదా అని ప్రశ్నించింది. జూన్‌ 11న నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేస్తూ సెప్టెంబ‌ర్ 23న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ అప్పీల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం సెప్టెంబ‌ర్ 26న‌ వాదనలు వింది.  

ఎన్ని పిటిషన్లు వచ్చినా కమిషన్‌కు అవకాశమిచ్చాం 

గ్రూప్‌–4కు బయోమెట్రిక్‌ ఉండదని అనుబంధ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు.. గ్రూప్‌–1కు ఎందుకు ఇవ్వలేదని డివిజన్‌ బెంచ్‌ టీఎస్‌పీఎస్సీని ప్రశ్నించింది. పేపర్‌ లీక్‌ తర్వాత.. దర్యాప్తు తేలే వరకు పరీ­క్ష ఆ­పాలని ఎన్ని పిటిషన్లు వచ్చినా ప్రిలిమ్స్‌ నిర్వహించేందుకు కమిషన్‌కు అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసం ఒకట్రెండు కాదని, మొత్తం నియా­మ­క పోస్టు (503)ల్లో సగానికిపైగా (258) ఉందని పేర్కొంది.

నిజంగా అక్రమాలు జరిగి ఉంటే.. లక్షల మంది అభ్యర్థులు పోటీ పడేది కదా అని పేర్కొంది. పరీక్ష నిర్వహించాక వెల్లడించిన అభ్యర్థుల సంఖ్యకు, కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న అభ్యర్థులకు 258 వ్యత్యాసం ఎందుకు వచ్చిందో చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 27కి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, ప్రతివాదుల తరఫున సీనియర్‌ న్యాయవాది గిరిధర్‌రావు సుదీర్ఘ వాదనలు వినిపించారు.  

మార్పుచేర్పులకు కమిషన్‌కు అధికారాలుంటాయి: ఏజీ 

ఏజీ వాదనలు వినిపిస్తూ.. ‘గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో నిబంధనల మార్పుచేర్పులకు కమిషన్‌కు అధికారాలు ఉంటాయి. కమిషన్‌ రాజ్యాంగ సంస్థ, దాని అధికారాల్లో కోర్టుల జోక్యం నామమాత్రమే. అభ్యర్థులకు జారీ చేసిన హాల్‌టికెట్లలోనూ బయోమెట్రిక్‌ విధానం లేదని, ఆధార్, పాన్‌ వంటి అధికారిక గుర్తింపు కార్డులతో హాజరుకావాలని స్పష్టంగా పేర్కొంది. హాల్‌టికెట్‌ తీసుకున్నాక అభ్యంతరాలు ఉంటే వెంటనే కోర్టును ఆశ్రయించాలి.

కానీ, పరీక్ష నిర్వహించాక ఉద్దేశపూర్వకంగా ఆశ్రయించడం ఆమోదనీయంకాదు. పరీక్షల రద్దు కోరుతూ ముగ్గురు అభ్యర్థులు మాత్రమే హైకోర్టును ఆశ్రయించారు. 2.33 లక్షల మంది అభ్యర్థుల్లో ముగ్గురు కోరితే దానిని ఆమోదించడం సరికాదు. బయోమెట్రిక్‌ను అమలు చేయలేదని సింగిల్‌ జడ్జి.. ప్రిలిమ్స్‌ను రద్దు చేయడం చెల్లదు’ అని పేర్కొన్నారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘కమిషన్‌కు మార్పులు చేసేందుకు అధికారాలున్నా.. బయోమెట్రిక్‌ అమలు చేయట్లేదని అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయాలి కదా? అత్యంత కీలక ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి పోస్టులకు వెళ్లే వారి నియామకంలో నిబంధనలను అత్యంత సమర్థవంతంగా అమలు చేయకపోతే ఎలా? అభియోగాల మేరకు అక్రమాలు జరిగి ఉంటే పోస్టుల భర్తీ లక్ష్యం నీరుగారుతుంది. అక్రమాలు జరగలేదని నిరూపణ కోసం ఓ అభ్యర్థి మ్యారేజీ సర్టిఫికెట్‌ తెచ్చే స్థాయికి కమిషన్‌ దిగజారింది’ అని వ్యాఖ్యానించింది.  

కావాలనే బయోమెట్రిక్‌ తీసుకోలేదు 

ప్రతివాదుల తరఫున గిరిధర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘కమిషన్‌ ఉద్దేశపూర్వకంగానే జూన్‌ 11న బయోమెట్రిక్‌ అమలు చేయలేదు. గత అక్టోబర్‌లో ప్రిలిమ్స్‌ నిర్వహించినప్పుడు అమలు చేసింది. గత సంవత్సరం ఏప్రిల్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ మేరకే రెండుసార్లు ప్రిలిమ్స్‌ నిర్వహించారు. అలాంటప్పుడు ఒకసారి బయోమెట్రిక్‌ తీసుకుని, ఒకసారి తీసుకోకపోవడం అక్రమాలకు తావిచ్చినట్లే అవుతుంది’ అని అన్నారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘బయోమెట్రిక్‌ లేదనే విషయం హాల్‌టికెట్లపైనే ఉన్నప్పుడు పరీక్ష నిర్వహించడానికి ముందుగానే న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించలేదు. ఒకసారి పేపర్‌ లీకేజీ కారణంగా పరీక్ష రద్దయింది. ఇప్పుడు బయోమెట్రిక్‌ అమలు చేయలేదని రద్దయింది. ఇలా అయితే అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఇది ప్రిలిమ్స్‌ మాత్రమే.. దీనిలో ఎంపికైనా తర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రతిభావంతులు కాకపోతే మెయిన్స్‌లో గట్టెక్కడం కష్టమే కదా’ అని ప్రశ్నించింది.  

అభ్యర్థులు ఎక్కువగా ఉన్న కారణంగానే.. 

అభ్యర్థుల సంఖ్య 2.33 లక్షలు ఉండటంతోనే బయోమెట్రిక్‌ తీసుకోవడం కష్టమని.. నిలిపివేసినట్లు ఏజీ చెప్పారు. దీనికి గిరిధర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర పోస్టుల నియామక పరీక్షలకు కమిషన్‌ బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేసిందన్నారు.

కానిస్టేబుల్‌ పోస్టులకు 1.30 లక్షలకుపైగా అభ్యర్థులు హాజరయ్యారని, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు లక్ష మంది వరకు హాజరైనా బయోమెట్రిక్‌ తీసుకున్నారన్నారు. అనంతరం ఎన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.. రాసిన అభ్యర్థుల వివరాలతో పూర్తి నివేదిక అందజేయాలని ధర్మాసనం కమిషన్‌ను అదేశించింది.  

Published date : 27 Sep 2023 02:47PM

Photo Stories