Skip to main content

పరిశ్రమలు

ఒక దేశం లేదా రాష్ట్రం ఆర్థికంగా, సాంకేతికంగా ముందడుగు వేయడంలో పరిశ్రమల పాత్ర కీలకం. సమాజ సంక్షేమం పారిశ్రామిక అభివృద్ధితోనే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. భారతదేశంలో ఇనుము-ఉక్కు పరిశ్రమల స్థాపనతో ప్రారంభమైన పారిశ్రామికీకరణ క్రమంగా అన్ని రంగాలకు విస్తరించింది. రెండో పంచవర్ష ప్రణాళికా కాలం నుంచి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశ్రమల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోంది. ‘టీఎస్-ఐపాస్’ లాంటి నూతన విధానాలతో పారిశ్రామికీకరణను వేగవంతం చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం భారీ పరిశ్రమలకు పుట్టినిల్లు లాంటిది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ఐటీ, ఫార్మా, ఇంజనీరింగ్ గూడ్స్, డిఫెన్స్ లాంటి చాలా పరిశ్రమలను నెలకొల్పారు.
రాష్ట్రంలోని పరిశ్రమలను ముడిసరకు ఆధారంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి:
1. వ్యవసాయాధారిత పరిశ్రమలు
2. అటవీ ఆధారిత పరిశ్రమలు
3. ఖనిజ ఆధారిత పరిశ్రమలు

వ్యవసాయాధారిత పరిశ్రమలు
వ్యవసాయ ముడి పదార్థాలపై ఆధారపడి వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ‘వ్యవసాయాధారిత పరిశ్రమలు’ అంటారు. వీటిలో వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ, సిగరెట్ పరిశ్రమలు ముఖ్యమైనవి.
ఎ. వస్త్ర పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. హైదరాబాద్, మెదక్, భువనగిరి, నిర్మల్, వరంగల్ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమకు గుర్తింపు పొందాయి.
ముఖ్యమైన వస్త్ర పరిశ్రమలు:
  • అజాంజాహీ మిల్లు - వరంగల్. దీన్ని 1934లో ప్రారంభించారు. ఇది 1990లో మూతపడింది.
  • నటరాజ్ స్పిన్నింగ్ మిల్లు - నిర్మల్ (ఆదిలాబాద్)
  • ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్లు - సదాశివపేట (మెదక్)
  • సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లు - భువనగిరి (నల్లగొండ)
  • డీబీఆర్ మిల్లు - హైదరాబాద్
బి. పంచదార పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పంచదార పరిశ్రమ ‘నిజాం చక్కెర పరిశ్రమ’. దీన్ని హైదరాబాద్ సంస్థానం చివరి నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1921లో నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో స్థాపించారు. ఇది రాష్ట్రంలోని పంచదార పరిశ్రమల్లో కెల్లా పెద్దది. ఈ కర్మాగారంలో పంచదారతోపాటు మొలాసిస్, పిప్పర్‌మెంట్లు, కార్బన్ డై ఆక్సైడ్ వాయువును కూడా తయారు చేస్తారు.
ఈ పరిశ్రమకు అనుబంధంగా నాలుగు పంచదార ఫ్యాక్టరీలను నెలకొల్పారు.
అవి:
1. జహీరాబాద్ (మెదక్) - 1973
2. మిర్యాలగూడ (నల్లగొండ) - 1977
3. ముత్యంపేట (కరీంనగర్) - 1981
4. సారంగాపూర్ (నిజామాబాద్)
సి. సిగరెట్ పరిశ్రమ
వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ (వీఎస్‌టీ):దీన్ని ఎం.డి. వజీర్ 1920లో ఆజామాబాద్ (హైదరాబాద్)లో స్థాపించారు. ఇది 1983లో పూర్తిగా స్వతంత్ర సంస్థగా రూపొంది వీఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌గా నమోదైంది. ఇది చార్మినార్ సిగరెట్లను తయారు చేసి, సరఫరా చేస్తోంది.
  • సిగరెట్ల తయారీలో వాడుతున్న కాగితం నూనెను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
  • హైదరాబాద్‌లో ‘ఇండియన్ టొబాకో కంపెనీ’ (ఐటీసీ) అనే మరో ప్రముఖ సిగరెట్ పరిశ్రమ కూడా ఉంది.

అటవీ ఆధారిత పరిశ్రమలు
అడవిలో లభించే ముడి పదార్థాలతో వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ‘అటవీ ఆధారిత పరిశ్రమలు’ అంటారు. వీటిలో కాగితం పరిశ్రమ ముఖ్యమైంది.
కాగితం పరిశ్రమ
సాధారణంగా కాగితం పరిశ్రమల్లో వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ కలపను వినియోగిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిశ్రమలో ఎక్కువగా వెదురును వాడుతున్నారు.
సిర్పూర్ పేపర్ మిల్స్: హైదరాబాద్ చివరి నవాబు అయిన మీర్ ఉస్మాన్ అలీ కాలంలో 1938లో ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ‘సిర్పూర్ పేపర్ మిల్స్’ను నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రంలోని మొదటి పేపర్ మిల్లు ఇదే. ప్రస్తుతం ఇది మూతపడి ఉంది.

రాష్ట్రంలోని ముఖ్యమైన కాగితం మిల్లులు:
  • భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ - సారపాక గ్రామం (ఖమ్మం).
  • నాగార్జున పేపర్ మిల్స్ - పటాన్ చెరువు (మెదక్)
  • తెలంగాణ పేపర్ మిల్స్ - నాచంగూడెం (ఖమ్మం)
  • చార్మినార్ పేపర్ మిల్స్ - మాతంగి (మెదక్).
  • రేయాన్ పరిశ్రమ - ఇది వరంగల్ జిల్లాలోని కమలాపురంలో ఉంది.

ఖనిజ ఆధారిత పరిశ్రమలు
గనుల నుంచి లభించే ఖనిజాలను ముడిసరకుగా ఉపయోగించి వస్తువులను తయారు చేసే పరిశ్రమలను ‘ఖనిజ ఆధారిత పరిశ్రమలు’ అంటారు. తెలంగాణాలో ఎక్కువగా సిమెంట్, ఇనుము-ఉక్కు, ఆస్‌బెస్టాస్ తదితర ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి
ఎ. ఇనుము - ఉక్కు పరిశ్రమ
1980లో ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ‘స్పాంజ్ ఐరన్ ప్లాంట్’ను స్థాపించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్. ఇందులో తక్కువ స్థాయి బొగ్గును
ఉపయోగిస్తున్నారు.
బి. సిమెంట్ పరిశ్రమ
రాష్ట్రంలో సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్నందువల్ల సిమెంట్ పరిశ్రమ రాష్ట్ర మంతటా వ్యాపించి ఉంది. ఇవి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.
  1. అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ (ఏసీసీ): ఇది తెలంగాణ రాష్ట్రంలోని మొదటి సిమెంట్ ఫ్యాక్టరీ. దీన్ని ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల వద్ద 1958లో స్థాపించారు.
  2. కేశోరామ్ సిమెంట్స్: దీన్ని 1969లో కరీంనగర్‌లోని బసంతనగర్‌లో ప్రారంభించారు.
  3. దక్కన్ సిమెంట్స్: దీన్ని నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌లో స్థాపించారు.
  4. రాశి సిమెంట్స్: దీన్ని నల్లగొండ జిల్లాలోని వాడపల్లి వద్ద స్థాపించారు.
  5. నాగార్జున సిమెంట్స్: దీన్ని నల్లగొండ జిల్లాలో స్థాపించారు.
సి. ఆస్‌బెస్టాస్ పరిశ్రమ
  1. హైదరాబాద్ ఆస్‌బెస్టాస్ సిమెంట్ ఉత్పత్తుల కర్మాగారాన్ని 1949లో సనత్‌నగర్‌లో స్థాపించారు.
  2. ఇండియన్ హ్యూమ్ పైప్ ఫ్యాక్టరీని హైదరాబాద్‌లోని ఆజామాబాద్‌లో స్థాపించారు.
  3. మెదక్ జిల్లాలోని పటాన్ చెరువులో విశాఖ ఆస్‌బెస్టాస్ సిమెంట్ ఉత్పత్తుల కర్మాగారం ఉంది.
ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ): దీన్ని 1980లో కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో స్థాపించారు. బొగ్గు ముడి పదార్థంగా ఎరువును తయారు చేసిన మొట్టమొదటి ఫ్యాక్టరీ ఇది. ప్రస్తుతం ఇది మూతపడి ఉంది. మళ్లీ ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
  1. నైట్రోజన్, ఫాస్పేట్‌ను తయారు చేసే ‘హైదరాబాద్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్’ పరిశ్రమను రంగారెడ్డి జిల్లాలోని మౌలాలిలో స్థాపించారు.

రాష్ట్రంలోని ముఖ్యమైన కుటీర పరిశ్రమలు

1. నిర్మల్ పెయింటింగ్స్అండ్ టాయ్స్
ఈ పరిశ్రమ ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్‌లో 1955లో ఏర్పడింది. దీనికి రాష్ట్రపతి అవార్డు లభించింది. నిర్మల్ పెయింటింగ్స్ బంగారు వర్ణానికి ప్రసిద్ధి. వీటికి ఉపయోగించే కలప ‘పునికి కర్ర’. ఇది తేలికగా, అందంగా తీర్చిదిద్దడానికి అనువుగా ఉంటుంది.
  • నిర్మల్ పెయింటింగ్స్ పై పేటెంట్ పొందిన సంవత్సరం 2010.
2. పోచంపల్లి చీరలు
వీటిని నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో తయారు చేస్తారు.
  • ‘సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ’గా పేరు పొందింది - పోచంపల్లి.
  • వరంగల్‌ను ‘టెక్స్‌టైల్ హబ్’గా అభివృద్ధిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు
  • సిరిసిల్ల - కరీంనగర్ జిల్లా
  • పోచంపల్లి - నల్లగొండ జిల్లా
  • గద్వాల్ - మహబూబ్‌నగర్ జిల్లా
  • సిద్దిపేట - మెదక్ జిల్లా
3. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ
ఇది పురాతన కళ. ఇది ఎక్కువగా కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి చెందింది. ఇందులో ఎక్కువ మొత్తంలో వెండి లేదా బంగారం లోహాలను ఉపయోగించి మృదువైన ఆభరణాలను తయారు చేస్తారు.
4. పెంబర్తి ఇత్తడి కుటీర పరిశ్రమ

కఠినమైన ఇత్తడి మెటల్ షీట్‌పై అద్భుత కళాఖండాలు చెక్కే కళ ఇది. ఈ కళ వరంగల్ జిల్లాలోని ‘పెంబర్తి’ గ్రామంలో పుట్టింది. పెంబర్తి ఇత్తడి కళ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. దేశంలోని ఇత్తడి కళకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది.

ఇతర కుటీర పరిశ్రమలు - ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు:
  • తుంగ చాపలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం - మహబూబ్‌నగర్.
  • తివాచీలు, కంబళ్లకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం - సిరిసిల్ల, వరంగల్.
  • గాజు - గాజుల పేట (మహబూబ్‌నగర్)
  • బిద్రీవేర్ - హైదరాబాద్, సికింద్రాబాద్.
  • పట్టు - మునేరు (మెదక్), వరంగల్, ఆదిలాబాద్.
  • అగరువత్తులు - హైదరాబాద్.
  • వెండి నగిషీలు - కరీంనగర్.
  • టస్సార్ సిల్క్ - ఆసిఫాబాద్ (ఆదిలాబాద్), మహాదేవ్‌పూర్ (కరీంనగర్).
  • ఆట వస్తువులు - నిర్మల్ (ఆదిలాబాద్).
Published date : 09 Nov 2015 05:36PM

Photo Stories