Skip to main content

మృత్తికలు (Soils)

భూ ఉపరితలంపై శైథిల్యం చెందిన శిలా శకలాలు, కుళ్లిన జంతు, వృక్ష సంబంధిత పదార్థాల పల్చని పొరనే ‘మృత్తిక’ అంటారు. మంచి మృత్తికల్లో.. ముఖ్యంగా ఒండ్రు మృత్తికలు ఉన్న ప్రాంతాల్లో గొప్ప నాగరికతలు వెల్లివిరిశాయి. లవణాలు, వయనం, కుళ్లిన జీవ సంబంధ పదార్థాల (హ్యూమస్) సరైన కలయిక ఉన్న మృత్తికలు వ్యవసాయానికి అనుకూలం. ఇవి దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అధికంగా దోహదపడతాయి.
నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక సారవంతమైన ఒండ్రు నేలల నుంచి నిస్సారమైన ఇసుక నేలల వరకు వివిధ రకాల మృత్తికలు ఉన్నాయి. తెలంగాణలో ఎగుడు, దిగుడులు ఉన్న పెనిప్లేయిన్‌లు ఉన్నప్పటికీ ఎర్ర, నల్లరేగడి, ఒండ్రు, లాటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి.
ఎర్ర నేలలు: తెలంగాణలో అధిక భాగం ఎర్ర మృత్తికలు విస్తరించి ఉన్నాయి. రాష్ట్ర విస్తీర్ణంలో ఇవి 48 శాతం ఉన్నాయి. ఈ నేలల్లో మొక్కలకు కావలసిన పౌష్టిక, సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉంటాయి. వీటిలో భాస్వరం అధికంగా ఉంటుంది. ఈ నేలలు తేలికగా, గాలి పారాడేట్లుగా ఉంటాయి. ‘ఐరన్ ఆక్సైడ్’ను కలిగి ఉండటం వల్ల ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి నీటిని గ్రహించే శక్తిని కలిగి ఉండి, అతి తక్కువ సారవంతమైనవిగా ఉంటాయి. ఈ నేలల్లో ప్రధాన పంట ‘వేరుశెనగ’. దీంతో పాటు జొన్న, సజ్జలు, ఆముదాలు మొదలైన మెట్ట పంటలు పండించే అవకాశాలున్నాయి.
ఎర్ర మృత్తికలు మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నేలలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ఎర్ర నేలలను చల్క, దుబ్బ నేలలుగా వర్గీకరించారు. చల్క నేలలు క్వార్ట్‌జైట్, ముడి గ్రానైట్ రాళ్లు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడతాయి. ఇవి చాలా దిగువగా అంటే గుట్టల మధ్య భాగంలోని వాలు భూముల్లో ఎక్కువగా ఉంటాయి. దుబ్బ నేలలు తక్కువ సారవంతమైనవి. ఇవి పాలిపోయిన బూడిద రంగులో ఉంటాయి.
నల్లరేగడి మృత్తికలు: అర్ధ శుష్క పరిస్థితులు ఉండే దక్కన్ పీఠభూమిలో బసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం ద్వారా ఈ నేలలు ఏర్పడతాయి. ఈ నేలలు ఎక్కువగా బంకమన్ను కలిగి ఉంటాయి. వీటికి నీటిని గ్రహించి చాలా కాలం వరకు నిల్వ ఉంచుకునే శక్తి ఉంటుంది. అందువల్ల వీటిలో భూసారం ఎక్కువగా ఉంటుంది. ఈ మృత్తికల్లో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, కార్బొనేట్‌లు, అల్యూమినియం పుష్కలంగా ఉంటాయి. కానీ నత్రజని, ఫాస్ఫారిక్ ఆమ్లం, సేంద్రీయ పదార్థాలు (హ్యూమస్) తక్కువ మోతాదులో ఉంటాయి.
ఈ మృత్తికల్లో ఎక్కువ శాతం మెత్తని ఇనుప పదార్థాలు ఉండటం వల్ల ఇవి ‘నలుపు రంగు’లో ఉంటాయి. వీటిని ‘రేగూర్’, ‘చెర్నోజెమ్’ నేలలు అని కూడా పిలుస్తారు. ఇవి పత్తి పంటకు చాలా అనువైనవి కావడం వల్ల వీటిని ‘బ్లాక్ కాటన్ సాయిల్స్’ అని కూడా అంటారు. పత్తితో పాటు మిర్చి, పొగాకు, పసుపు లాంటి వాణిజ్య పంటలు అధికంగా పండుతాయి.
నల్లరేగడి నేలలు తెలంగాణ భూభాగంలో 25 శాతం వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉన్న గోదావరి లోయ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. రంగారెడ్డి, నిజామాబాద్‌లోనూ విస్తరించి ఉన్నాయి.
ఒండ్రు మృత్తికలు (Alluvial Soils): నదులు అనేక సంవత్సరాల పాటు క్రమక్షయం చేసి ప్రవాహ క్రమంలో తీసుకువచ్చిన ఒండ్రుమట్టిని నిక్షేపించడం వల్ల ఈ మృత్తికలు ఏర్పడ్డాయి. ఇవి సాధారణంగా నదీ ప్రవాహానికి ఇరువైపులా, నదీ మైదానాల్లో, డెల్టా ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఇవి ఎక్కువ సారవంతమైనవి. అందువల్ల వ్యవసాయ రంగానికి చాలా ప్రధానమైనవి. ఈ మృత్తికల్లో సున్నం, పొటాష్, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. కానీ నత్రజని, హ్యూమస్ లోపించి ఉంటాయి.
ఒండ్రు నేలలు తెలంగాణ విస్తీర్ణంలో 20 శాతం వరకు ఉండి, మూడో స్థానాన్ని ఆక్రమించాయి. వీటికి నీటిని నిల్వ చేసుకొనే శక్తి అధికంగా ఉండి అత్యంత సారవంతమైనవిగా ఉంటాయి. ఈ మృత్తికలు అధికంగా గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో వరి, చెరకు, అరటి, మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి పంటలు ఎక్కువగా పండుతాయి.
లాటరైట్ (జేగురు) మృత్తికలు: ఏకాంతరంగా ఉండే ఆర్థ్ర, అనార్థ్ర రుతువుల్లోని అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో లాటరైట్ మృత్తికలు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో మౌలిక శిల నుంచి సిలికా అనే పదార్థం ఎక్కువగా నిక్షాళనం చెందడానికి దోహదపడుతుంది. ఈ మృత్తికల్లో అల్యూమినియం, ఇనుముల హైడ్రేటెడ్ ఆక్సైడ్‌ల మిశ్రమం ఉంటాయి. ఈ నేలలు పీత వర్ణం, గోధుమ, ఎరుపు రంగుల్లో ఉంటాయి. వీటిని ఎర్ర రాతి నేలలు అని కూడా అంటారు.
లాటరైట్ మృత్తికలు తక్కువ సారవంతమైనవి కావడం వల్ల తోట పంటలకు అనువైనవి. ఈ నేలల్లో ఇటుకలు తయారు చేస్తారు. వీటిలో ప్రధానంగా కాఫీ, తేయాకు, రబ్బరు, జీడిమామిడి, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా పండుతాయి. ఈ మృత్తికలు తడిసినప్పుడు మెత్తగా, ఎండినప్పుడు గట్టిగా ఉంటాయి. కాబట్టి వీటిని ‘బ్రిక్ సాయిల్’ అని కూడా అంటారు.
లాటరైట్ మృత్తికలు ప్రధానంగా మెదక్ జిల్లాలోని జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ మండలాల్లో, ఖమ్మంలో విస్తరించి ఉన్నాయి. ఇవి తెలంగాణ విస్తీర్ణంలో 7 శాతం మేరకు విస్తరించి చివరి స్థానంలో ఉన్నాయి.
  • మృత్తికల లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ‘భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి’ (ICAR) దేశంలోని నేలలను ఎనిమిది రకాలుగా వర్గీకరించింది. కానీ తెలంగాణలో ప్రధానంగా నాలుగు రకాల నేలలు మాత్రమే ఉన్నాయి.

మాదిరి ప్రశ్నలు

1. ‘చెర్నోజెమ్’ మృత్తికలు అని వేటిని పిలుస్తారు?
ఎ) లాటరైట్ నేలలు
బి) ఎర్ర మృత్తికలు
సి) నల్లరేగడి నేలలు
డి) ఒండ్రు నేలలు

Published date : 12 Sep 2015 03:36PM

Photo Stories