Skip to main content

హిమాలయపర్వత వ్యవస్థ - ప్రాధాన్యం

ఉత్తరాన కోటగోడలా విస్తరించి ఉన్న హిమాలయ పర్వత వ్యవస్థ భారత్‌కు పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్ దేశాలతో సరిహద్దుగా ఉంది. వ్యూహాత్మకంగానే కాకుండా ఆర్థిక, సామాజిక అంశాల పరంగా కూడా హిమాలయ పర్వతాలు భారతదేశానికి కీలకం. దేశానికి ఉత్తర ప్రాంతం నుంచి సైనిక దాడులను నిరోధించి రక్షణ కల్పించడంలో హిమాలయాలు ప్రధానపాత్రను పోషిస్తున్నాయి. తూర్పు హిమాలయ ప్రాంతంలో భారత్-చైనాలను విడదీసే ‘మెక్‌మోహన్ రేఖ’ను శాస్త్రీయ సరిహద్దుగా అభివర్ణిస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయ పర్వతాలు, వాటి కనుమలను పూర్తిగా భారతదేశం కిందకు తేవడంతో చైనా ఈ ప్రాంతంలో భారత్‌లోకి చొచ్చుకు రావడం చాలా కష్టం. కాబట్టి చైనా మెక్‌మోహన్ రేఖను అంగీకరించడం లేదు. చైనా వాదన ప్రకారం ఈ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు హిమాలయ పర్వత పాదాల వద్ద ఉండాలి. అంటే మొత్తం హిమాలయ పర్వతాలను (అరుణాచల్ ప్రదేశ్‌ను) చైనా కోరుతుందన్న మాట. ఇది భారత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతం కాదు.
సైనిక వ్యూహాల పరంగా హిమాలయ పర్వతాల్లోని కనుమలు చాలా ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. 1962 యుద్ధంలో అరుణాచల్ హిమాలయాల్లోని తవాంగ్, బొమిడిల్లా కనుమలను రక్షించుకోలేకపోవడంతోనే చైనా సైన్యాలు సులువుగా అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించగలిగాయి. జమ్ముకశ్మీర్ హిమాలయాల్లోని కారకోరం కనుమ నుంచి భారత్, చైనా, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భూభాగాల్లోకి సులువుగా ప్రవేశించవచ్చు. 1980లలో (పీఓకే)మీదుగా చైనా, పాకిస్తాన్‌లను కలుపుతూ కారకోరం కనుమ ద్వారా రహదారి నిర్మించడంతో భారత్ భద్రతకు ముప్పు ఏర్పడింది. కాబట్టి కారంకోరం కనుమకు సమీపంలోని సియాచిన్ హిమానీ నద ప్రాంతంలో సైనిక బలగాలను మోహరించాల్సి వచ్చింది.  కార్గిల్ యుద్ధంలో కూడా జొజిల్లా కనుమకు ముప్పు ఏర్పడింది. శ్రీనగర్-లే జాతీయ రహదారికి సమీపంలో ఈ కనుమ ఉంది. జొజిల్లా కనుమ శత్రువుల ఆధీనంలోకి వెళితే భారతదేశం నుంచి లడఖ్‌ను సులువుగా వేరు చేయొచ్చు. ఈ ప్రమాదాన్ని గమనించే కార్గిల్ యుద్ధంలో జొజిల్లా కనుమ సమీపంలోని టైగర్‌కొండ, ముష్‌కోష్ లోయల్లో తిష్ట వేసిన ముష్కరులను హతమార్చడానికి భారత సైన్యం పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. ‘బనిహాల్ కనుమ’ గుండా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి వెళ్తుంది. అందుకే ఈ కనుమను ‘కశ్మీర్ లోయ ముఖద్వారం’గా పరిగణిస్తారు.
 
వాణిజ్య-సాంస్కృతిక సంబంధాలు
హిమాలయ పర్వతాల కనుమలు అనాదిగా వాణిజ్య,సాంస్కృతిక సంబంధాల్లోనూ కీలక పాత్ర పోషించాయి. భారతదేశం నుంచి చైనాలోకి బౌద్ధమత వ్యాప్తి హిమాలయ పర్వత కనుమల ద్వారా జరిగింది. సిక్కిం-టిబెట్ సరిహద్దులోని నాథూలా, జెలెప్ కనుమల ద్వారా టిబెట్ రాజధాని లాసా, కోల్‌కతా రేవు పట్టణాలను కలిపే రహదారి వెళ్తుంది. 1962 యుద్ధం తర్వాత ఈ రెండు కనుమల ద్వారా జరిపే వాణిజ్యాన్ని నిలిపివేశారు. ఇటీవల నాథూలా కనుమను తిరిగి వాణిజ్యానికి తెరిచారు. టిబెట్-నేపాల్-ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతంలోని ‘లిపులేక్’ కనుమ మార్గం అనాదిగా వాణిజ్యానికి ప్రసిద్ధి. 1962 యుద్ధం తర్వాత ఈ కనుమను కూడా మూసివేశారు.
 
శీతోష్ణస్థితి నియంత్రణ
భారతదేశపు శీతోష్ణస్థితిని నియంత్రించడంలో కూడా హిమాలయాలు కీలక పాత్రపోషిస్తాయి. శీతాకాలంలో సైబీరియా (రష్యా) నుంచి దక్షిణాసియా వైపు వీచే అతి శీతల పవనాలను హిమాలయాలు అడ్డుకొని గంగా-సింధు-బ్రహ్మపుత్ర మైదానాన్ని హిమపాతం నుంచి కాపాడతాయి. హిమాలయాలు లేకపోతే సైబీరియా శీతల పవనాల వల్ల  గంగా-సింధు-బ్రహ్మపుత్ర మైదానంలో శీతకాలంలో రబీ వ్యవసాయం సాధ్యపడేది కాదు. గంగా, యమున, సట్లెజ్, బ్రహ్మపుత్ర నదులు శీతాకాలంలో గడ్డ కట్టుకుపోయేవి. కాబట్టి ఉత్తర మహా మైదాన ప్రాంతం ఉప ఆయనరేఖా అక్షాంశ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆయనరేఖా శీతోష్ణస్థితిని కలిగి ఉంది. భారతదేశంలో నైరుతి రుతుపవనాల చురుకుదనం శీతాకాలంలో హిమాలయాల్లో కురిసిన మంచు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
 
జీవ నదులకు ఆలవాలం
హిమాలయాల్లోని హిమానీనద సరస్సులు, హిమానీ నదాలు, మంచుతో కప్పుకుపోయిన పర్వత శిఖరాలు అనేక జీవ నదులకు మాతృకలు. ఉదాహరణకు గంగోత్రి హిమానీనదం నుంచి గంగా, యమునోత్రి వద్ద యమున, రాకాస్‌తాల్ సరస్సు నుంచి సట్లెజ్, చాంమ్యుయాంగ్ హిమానీనదం నుంచి సింధు, వెరినాగ్ కొండల నుంచి జీలం, కైలాస మానస సరోవరం వద్ద బ్రహ్మపుత్ర, కులూ కొండల్లో రావి నదులు ఆవిర్భవిస్తున్నాయి. హిమాలయాల్లో ఆవిర్భవించడం వల్ల ఈ నదులన్నీ ‘జీవనదులు’గా అవతరించాయి. అయితే ఇటీవల  గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయ హిమానీ నదులు క్రమంగా కుంచించుకుపోవడం ఆందోళనను కల్గిస్తోంది. హిమాలయాల్లో రెండో అతిపెద్దదైన గంగోత్రి హిమానీనదం వేగంగా కుంచించుకు పోతుందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. దీనివల్ల గంగానదిలో సమీప భవిష్యత్తులో వరద తీవ్రత పెరిగి దీర్ఘ కాలంలో క్రమంగా ఎండిపోయే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
 
అటవీ, వన్యమృగ సంపద
హిమాలయ పర్వత సానువులు దట్టమైన అరణ్యాలతో కూడి విశిష్టమైన అటవీ, వన్యమృగ సంపదను కలిగి ఉన్నాయి. హిమాలయ పర్వత సానువుల్లో వివిధ ఎత్తుల్లో వివిధ రకాల అరణ్యాలు ఉన్నాయి. శివాలిక్ కొండల్లో ఆయనరేఖా ఆకురాల్చు అరణ్యాలు, సమశీతోష్ణ అరణ్యాలు పెరుగుతున్నాయి. హిమాచల్ పర్వతాల్లో విశిష్టమైన కోనిఫెరస్ (శృంగాకార) అరణ్యాలు ఉన్నాయి. నాణ్యమైన మెత్తని కలప నిచ్చే పైన్, ఫర్, స్పూన్, దేవదారు మొదలైన వృక్ష జాతులు ఇక్కడ పెరుగుతున్నాయి. హిమాద్రి పర్వతాల (గ్రేటర్ హిమాలయాల) నిమ్న సానువులు విశాలమైన పచ్చిక బయళ్లకు  ప్రసిద్ధి. ఈ ప్రాంతాల్లో రోడో డెండ్రాన్ వంటి ఆకర్షణీయమైన పుష్ప జాతులతో పాటు విలువైన ఔషధ మొక్కలు కూడా లభిస్తాయి.
అరుదైన హిమాలయ ఎలుగుబంటి, కస్తూరి మృగం వంటి వన్య ప్రాణులు కూడా ఈ అరణ్యాల్లో సంచరిస్తున్నాయి. శివాలిక్ కొండలు-లెస్సర్ హిమాలయూల మధ్యలో విస్తరించి ఉన్న ‘డూన్’ ప్రాంతాలు, కశ్మీర్ లోయ ప్రాంతాల్లో సాంద్ర వ్యవసాయం కేంద్రీకృతమై ఉంది. నిమ్న హిమాలయాల్లో పర్వత సానువుల వెంట ఆపిల్ వంటి పండ్ల తోటలను పెంచుతున్నారు. హిమాలయ పర్వతాల్లో వివిధ రకాల ఖనిజ నిల్వలున్నప్పటికీ, వాటి వెలికితీత ఆర్థికంగా లాభదాయకం కాదు. నదులు హిమాలయ పర్వతాలను దాటేటప్పుడు విశిష్టమైన జల పాతాలను సృష్టిస్తాయి. ఇవి విస్తృతంగా జల విద్యుచ్ఛక్తి వనరులను కలిగి ఉన్నాయి. దూల్‌హస్తి, సలాల్, చమేలి, కర్ణప్రయాగ్ ముఖ్యమైన జల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కేంద్రాలు.
Published date : 11 Dec 2015 06:07PM

Photo Stories