Skip to main content

వృద్ధి అంచనాలు

ప్రపంచ బ్యాంక్
పటిష్టమైన విస్తరణతోపాటు అనుకూల చమురు ధరలు దక్షిణాసియాలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయగలవని ప్రపంచబ్యాంకు అభిప్రాయపడింది. 2017-18లో భారత్‌లో జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదు కాగలదని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2015-16లో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని, 2016-18 మధ్య కాలంలో పెట్టుబడి వృద్ధి 12 శాతంగా ఉండగలదని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొన్నారు.
వినియోగం నుంచి పెట్టుబడి ఆధారిత వృద్ధిపై భారత్ దృష్టి సారించిందని ప్రపంచ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ మార్పు విషయంలో చైనా పరిస్థితి విరుద్ధంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. స్వదేశీ సంస్థలకు సంబంధించి "Ease of doing business"లో మొత్తం 189 దేశాలకుగాను భారత్ 130వ స్థానాన్ని పొందినట్లు ప్రపంచ బ్యాంక్ 2015 అక్టోబర్ 27న వెల్లడించింది. ‘డూయింగ్ బిజినెస్ 2016: మెజరింగ్ రెగ్యులేటరీ క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ’ అనే నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ అంశాన్ని పేర్కొంది.

ఐఎంఎఫ్
2014తో పోలిస్తే 2015లో ప్రపంచవృద్ధి రేటులో తగ్గుదల ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. అక్టోబర్ 2015లో వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో ఐఎంఎఫ్ వెల్లడించిన అంచనాల ప్రకారం 2014లో ప్రపంచ వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 3.4 శాతంగా ఉంది. ఇది 2015లో 3.1 శాతంగా, 2016లో 3.6 శాతంగా ఉండగలదని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల సగటు జీడీపీ వృద్ధి 2015లో రెండు శాతం కాగా, 2016లో 2.2 శాతంగా ఉండగలదని ఐఎంఎఫ్ తెలిపింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో 2015లో జీడీపీ వృద్ధి స్పెయిన్‌లో అధికంగా (3.1 శాతం), జపాన్‌లో అల్పంగా (0.6 శాతం) ఉండగలదని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సగటు జీడీపీ వృద్ధి 2015లో 4 శాతం కాగా, 2016లో 4.5 శాతంగా ఉండగలదని ఐఎంఎఫ్ తెలిపింది. చైనా జీడీపీ వృద్ధి 2015లో 6.8 శాతంగా, 2016లో 6.3 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2014లో 7.3 శాతం జీడీపీ వృద్ధి నమోదు చేసుకున్న చైనా తర్వాత కాలంలో తక్కువ వృద్ధి కనబరచడాన్ని గమనించవచ్చు. భారత్‌కు సంబంధించి జీడీపీ వృద్ధి 2014లో 7.3 శాతం కాగా, 2015లో 7.3 శాతం, 2016లో 7.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా. రష్యా, బ్రెజిల్ దేశాల జీడీపీ వృద్ధి 2015, 2016లో రుణాత్మకంగా ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది.

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు
2015లో రెండు శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసుకోగలిగే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు 2016లో 2.2 శాతం వృద్ధి సాధించగలవని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఆయా దేశాల జీడీపీ వృద్ధిలో కొంతమేర ఆశిస్తున్న పెరుగుదల ఉండటానికి కారణాలను ఐఎంఎఫ్ కింది విధంగా పేర్కొంది.
  1. యూరో ప్రాంతంలో కొంతమేర పురోగమన పరిస్థితులు ఏర్పడటం.
  2. జపాన్ ధనాత్మక వృద్ధి.
  3. క్రూడ్ చమురు ధరల్లో తగ్గుదల.
  4. అభిలషణీయ ద్రవ్య విధానాలను అవలంభించే సూచనలు.
  5. విత్త పరిస్థితులు మెరుగుపడటం.
  6. కొన్ని దేశాల విషయంలో కరెన్సీ విలువలో తగ్గుదల.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో బలహీన వృద్ధి
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో 2014తో పోలిస్తే 2015లో వృద్ధి క్షీణించింది. దీనికి ఐఎంఎఫ్ కింద పేర్కొన్న కారణాలను తెలిపింది.
  • చమురు ఎగుమతుల్లో వృద్ధి బలహీన పడటం.
  • చైనా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మందగించడం.
  • ఇతర వస్తువుల ఎగుమతిదారులకు అనుకూలమైన వాతావవరణం లేకపోవడం.
  • ఎగుమతుల ధరల్లో తగ్గుదల
  • జియోపొలిటికల్ టెన్షన్లు.
  • అమెరికాలో వడ్డీ రేట్లు అధికమవుతాయనే అంచనాలతో పాటు డాలర్ విలువలో పెరుగుదల ఉంటుందనే అంచనాలు.

డాలర్ విలువ అధికమవడం వల్ల అభివృద్ధి చెందుతున్న రుణగ్రహీత దేశాలకు రుణాల ఖర్చు (Borrowing Cost)లో పెరుగుదల ఏర్పడుతుంది.

యూఎన్‌సీటీఏడీ: ప్రపంచ ఉత్పత్తి వృద్ధి

ప్రపంచ ఉత్పత్తి వృద్ధి 2014, 2015 సంవత్సరాల్లో ఒకే విధంగా (2.5 శాతం) ఉండగలదని యూఎన్‌సీటీఏడీ పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి ఉత్పత్తి వృద్ధి 2014లో 1.6 శాతం కాగా, 2015లో 1.9 శాతం ఉంటుందని యూఎన్‌సీటీఏడీ నివేదికలో తెలిపారు. అమెరికాలో ఉత్పత్తి వృద్ధి 2014లో 2.4 శాతం కాగా, 2015లో 2.3 శాతంగా ఉంటుందని యూఎన్‌సీటీఏడీ పేర్కొంది.
2014లో ఉత్పత్తికి సంబంధించి రుణాత్మక వృద్ధి నమోదు చేసుకున్న ఇటలీ, జపాన్ 2015లో ధనాత్మక వృద్ధిని కనబరుస్తాయని, 2015లో అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి అమెరికా (2.3 శాతం), యూకే (2.3 శాతం) దేశాల ఉత్పత్తిలో వృద్ధి అధికంగా ఉంటుందని యూఎన్‌సీటీఏడీ నివేదికలో పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉత్పత్తి వృద్ధి 2014లో 4.5 శాతం కాగా, 2015లో 4.1 శాతంగా ఉండగలదని యూఎన్‌సీటీఏడీ పేర్కొంది. 2014లో భారత్ కంటే చైనాలో ఉత్పత్తిలో వృద్ధి అధికంగా ఉండగా, 2015లో చైనాను భారత్ అధిగమించింది. చైనాలో ఉత్పత్తి వృద్ధి 2014లో 7.4 శాతం కాగా, 2015లో 6.9 శాతంగా ఉంటుందని యూఎన్‌సీటీఏడీ అంచనా. భారత్‌కు సంబంధించి ఉత్పత్తి వృద్ధి 2014లో 7.1 శాతం కాగా, 2015లో 7.5 శాతంగా ఉండగలదని యూఎన్‌సీటీఏడీ అంచనా వేసింది.

స్వాతంత్య్రానంతరం భారత్‌లో జాతీయ, తలసరి ఆదాయాల వృద్ధి
ఒక నిర్ణీత కాలంలో ఆర్థిక వ్యవస్థలో జాతీయ, తలసరి ఆదాయాల్లో పరిమాణాత్మక పెరుగుదలను ఆర్థికవృద్ధిగా పరిగణిస్తారు. స్వాతంత్య్రానంతరం గత 68 ఏళ్లలో వాస్తవిక జాతీయాదాయ సాంవత్సరిక వృద్ధి రేటు 4.5 శాతానికి పైగా నమోదైంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కొంత కాలంపాటు వాస్తవిక జాతీయాదాయ వృద్ధిలో తగ్గుదల ఏర్పడినప్పటికీ అనంతర కాలంలో వృద్ధిలో పెరుగుదల నమోదైంది.
స్వాతంత్య్రానంతరం మొదటి దశాబ్ద కాలంలో వాస్తవిక జాతీయాదాయ సగటు వృద్ధి 3.8 శాతంగా ఉంది. ఇది 1960వ దశకంలో 3.5 శాతంగా, 1970వ దశకంలో 3.1 శాతంగా, 1980వ దశకంలో 5.5 శాతంగా నమోదైంది. ఆర్థిక ప్రణాళికలు ప్రారంభమైన తర్వాత మొదటి మూడు దశకాల్లో జాతీయాదాయ వృద్ధి సగటు 3.5 శాతంగా ఉండగా, 1980-81 తర్వాత సగటున 5.7 శాతంగా నమోదైంది. 1960, 1970 దశాబ్దాలతో పోలిస్తే 1980వ దశకంలో జాతీయాదాయ వృద్ధి అధికంగా ఉంది. దీనికి కింది కారణాలను పేర్కొనవచ్చు.

  1. ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల. ఇది ఆర్థిక వ్యవస్థకు విత్త మద్దతును అందించింది.
  2. మూలధన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటోమొబైల్ రంగంలో వినియోగించే తయారీ పరికరాల దిగుమతులపై ఆంక్షలు తొలగించడం.
  3. పెరుగుతున్న ద్రవ్య, కరెంటు అకౌంట్ లోటులను పూడ్చుకోవడానికి ప్రభుత్వం విదేశీ బహిర్గత రుణాలపై దృష్టి సారించడం.
స్థూల జాతీయాదాయం స్థిర ధరల వద్ద మొదటి ప్రణాళికలో 4 శాతం, పదో ప్రణాళికలో 7.6 శాతం, పదకొండో ప్రణాళికలో 7.8 శాతం వృద్ధిని సాధించింది. నికర జాతీయాదాయ వృద్ధి స్థిర ధరల వద్ద మొదటి ప్రణాళికలో 4.6 శాతం కాగా, పదో ప్రణాళికలో 7.6 శాతం, పదకొండో ప్రణాళికలో 7.5 శాతంగా నమోదైంది. 2014-15లో నికర జాతీయాదాయం స్థిర ధరల వద్ద (2011-12 ప్రకారం) రూ. 94,00,266 కోట్లుగా, ప్రస్తుత ధరల వద్ద రూ.112,17,079 కోట్లుగా సీఎస్‌వో అంచనా వేసింది.

వెనుకబడిన రాష్ట్రాల్లో వృద్ధి ప్రక్రియ ధోరణులు
  • 1980వ దశాబ్దం, సంస్కరణల అమలు కాలంలో వివిధ రాష్ట్రాల మధ్య.. ముఖ్యంగా వెనుకబడిన రాష్ట్రాల మధ్య వృద్ధి రేటులో వ్యత్యాసాలు ఏర్పడ్డాయి.
  • 1990వ దశాబ్దంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు సాధించిన వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉంది. అయినప్పటికీ ప్రస్తుత దశాబ్దం మొదటి అర్ధ భాగంలో ఈ రెండు రాష్ట్రాల్లో వృద్ధి రేటు మందగించింది.
  • 1990వ దశాబ్దం రెండో అర్ధ భాగం, ఆ తర్వాత కాలంలో ఒడిశా, బిహార్, అసోం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధి క్షీణించింది. ఇదే కాలానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో వృద్ధి రేటులో పెరుగుదల ఏర్పడింది. గత పదేళ్ల కాలంలో బిహార్‌లో జీఎస్‌డీపీ వృద్ధి అధికంగా నమోదు కావడం గమనించవచ్చు. 2012-13లో బిహార్ మాత్రమే రెండంకెల వృద్ధి (10.73 శాతం) సాధించగలిగింది. ఈ రాష్ట్రం 2010-11లో 15.03 శాతం, 2011-12లో 10.29 శాతం వృద్ధి సాధించింది.
  • కొన్ని రాష్ట్రాలు జీఎస్‌డీపీ వృద్ధి రేటు సాధనలో ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడినప్పటికీ పేదరిక నిర్మూలనలో మంచి ఫలితాలను సాధించాయి.
  • అధిక వృద్ధి సాధించిన రాష్ట్రాల్లో పేదరికం కొంత శాతం తగ్గినప్పటికీ వృద్ధి ప్రక్రియలో కొన్ని ప్రాంతాలు, సమూహాలు నిరక్ష్యానికి గురయ్యాయి.
  • వ్యవసాయ రంగ వృద్ధి, పేదరికం తగ్గింపు మధ్య ఉన్న సంబంధం ఈస్ట్రన్ ఇండియాలోని వెనుకబడిన రాష్ట్రాల్లో కనిపించింది.
తలసరి ఆదాయ వృద్ధి
తలసరి నికర జాతీయాదాయం 1950-51లో ప్రస్తుత ధరల వద్ద రూ. 274 కాగా స్థిర ధరల వద్ద (2004-05 ప్రకారం) రూ. 7513గా ఉంది. 2014-15లో తలసరి నికర జాతీయాదాయం ప్రస్తుత ధరల వద్ద రూ. 88,533 కాగా, స్థిర ధరల వద్ద రూ.74,193. ప్రణాళికా యుగంలో స్థిర ధరల వద్ద తలసరి ఆదాయ వృద్ధి మొదటి ప్రణాళికలో 2.7 శాతం కాగా, పదో ప్రణాళికలో 5.9 శాతం, పదకొండో ప్రణాళికలో 6 శాతంగా నమోదైంది.

మాదిరి ప్రశ్నలు

 

Published date : 30 Oct 2015 05:51PM

Photo Stories