Skip to main content

డార్వినిజం- పకృతి వరణ సిద్ధాంతం

ప్రకృతిలోజీవపరిణామం సంభవించిన తీరు, కొత్త జాతులు ఆవిర్భవించిన విధానాన్ని డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం వివరిస్తుంది. డార్విన్ ప్రకారం.. జీవ పరిణామం అనేది హఠాత్తుగా జరగదు. ఇది క్రమేణా సంభవించే జీవ ప్రక్రియ.
డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం ప్రకారం... ప్రకృతి, వైవిధ్యాలను కలిగించదు. ఉపయోగకరమైన వైవిధ్యాలతో ఉన్న జీవులను మాత్రం ప్రకృతి ఎన్నుకుంటుంది (Natural Selection).

చార్లెస్ రాబర్ట్ డార్విన్ బ్రిటన్ ప్రకృతి శాస్త్రవేత్త. 1809, ఫిబ్రవరి 12న ఇంగ్లండ్‌లోని ష్రూస్‌బరిలో జన్మించాడు.డార్విన్ తన 22వ ఏట ఐదు సంవత్సరాల (1831-1835) పాటు హెచ్.ఎం.ఎస్. బీగల్ అనే బ్రిటిష్ నౌకపై ప్రయాణిస్తూ అట్లాంటిక్, దక్షిణ అమెరికా, దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ద్వీపాల్లో గలవృక్ష-జంతు జాలాన్ని పరిశీలించాడు. దక్షిణ పసిఫిక్‌లోని గాలపాగోస్ ద్వీపంలోగల ఫించ్ పక్షుల ముక్కుల నిర్మాణంలో స్వల్ప వైవిధ్యాలను గమనించాడు. ఫించ్ పక్షులపై అధ్యయనం చేసి, వైవిధ్యాల ఆధారంగా జీవజాతులు శాశ్వతమైనవి కావని, అవి ఎల్లప్పుడూ మార్పులకు లోనవుతాయని తెలిపాడు.

థామస్ మాల్థూస్, చార్లెస్ లయల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు రాసిన ప్రఖ్యాత రచనలు.. డార్విన్‌కు గొప్ప జీవ పరిణామ శాస్త్రవేత్తగా గుర్తింపు తీసుకొచ్చాయి.
థామస్ మాల్థూస్ జనాభాల మీద రాసిన వ్యాసం - యాన్ ఎస్సే ఆన్ ది ప్రిన్స్‌పల్ ఆఫ్ పాపులేషన్. ఈ వ్యాసం ప్రకారం జనాభా గుణ శ్రేణి (జ్యామితీయ రీతి)లో పెరుగుతుంటే (1, 2, 4, 8, 16....), వాటి ఆహార అవసరాలు అంకశ్రేఢిలో పెరుగుతాయి (1, 2, 3, 4, .....). అంటే ఆహారం, నివాసం పెరగవని అర్థం.చార్లెస్ లయల్ రచించిన గ్రంథం.. ‘ప్రిన్స్‌పల్స్ ఆఫ్ జియాలజీ’లో భౌగోళిక మార్పులు నెమ్మదిగా, క్రమబద్ధంగా జరుగుతాయని ప్రతిపాదించాడు.

జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలిసారి శాస్త్రీయంగా, సరైన ఆధారాలతో ప్రతిపాదించింది - చార్లెస్ డార్విన్. అందువల్లే డార్విన్‌ను జీవ పరిణామ పితామహుడు (Father of Evolution)గా పేర్కొంటారు. ఇదే కాలంలో ఆల్‌ఫ్రెడ్ రసెల్ వాలెస్.. మలయా ఆర్చిపెలాగోలోని జంతు, వృక్ష జాతులను పరిశీలించి, డార్విన్‌లాగే స్వతంత్రంగా ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి.. తన పరిశీలనలను డార్విన్‌కు పంపాడు.

కాబట్టి వాస్తవంగా ప్రకృతి వరణాన్ని వాలెస్, డార్విన్‌లు ప్రతిపాదించారని చెప్పవచ్చు. అయితే వాలెస్ కంటే ఎక్కువ నిరూపణలనులండన్ లిన్నేయస్ సొసైటీకి అందించిన కారణంగా ఆ గొప్పతనమంతా డార్విన్‌కే దక్కింది.
డార్విన్ 1859లో జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఇది 19వ శతాబ్దపు ప్రత్యేక గ్రంథం. ఈ పుస్తకం పూర్తి పేరు.. On The origin of Species by means of Natural Selection (or) The preservation of favoured races in the struggle for life.

డార్విన్ ఇతర పుస్తకాలు
1. The structure and distribution of coral reefs
2. Geological Observations on South America
3. Fertilization of Orchids.
4. The variation of animals and plants under domestication
5. The Descent of Man
6. The Expression of the Emotions in Man and Animals
7. Insectivorous plants
8. The Effects of Cross and Self Fertilisation in the Vegetable Kingdom.
9. Different forms of Flowers on Plants of the Same Species.
10. The Power of Movement in Plants.
11. Selection in Relation to Sex.

డార్విన్ తన పరిశీలనలను ప్రకృతి వరణ సిద్ధాంతంగా పేర్కొన్నాడు. డార్విన్ ప్రతిపాదించినందువల్ల దీన్ని డార్వినిజం అని కూడా అంటారు.

డార్వినిజం లేదా ప్రకృతి వరణ సిద్ధాంతంలోని ముఖ్య ప్రతిపాదనలు...
1. ప్రత్యుత్పత్తి
2. జనాభాల నిర్ణీత సంఖ్య
3. మనుగడ కోసం పోరాటం
4. వైవిధ్యాలు
5. ప్రకృతి వరణం
6. అనువంశికత
7. కృత్రిమ ఎన్నిక
8. లైంగిక ఎన్నిక
9. పాన్‌జెనెసిస్ సిద్ధాంతం

అధిక సంతానోత్పత్తి
ప్రతి జీవి తన సంతానాన్ని అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి చేయగలదనే సత్యాన్ని డార్విన్ గమనించాడు.
ఉదా: పారమీషియం రోజుకు మూడు లేదా నాలుగు సార్లు ప్రత్యుత్పత్తి జరుపుతుంది. పిల్ల జీవులు ఏ విధమైన అవాంతరం లేకుండా అదే నిష్పత్తిలో సంతానాన్ని ఉత్పత్తి చేస్తే 5 ఏళ్లలో మొత్తం పారమీషియాల ఘనపరిమాణం భూమి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

జనాభాల నిర్ణీత సంఖ్య
సంతానం అధికంగా ఉత్పత్తి అయినా జీవుల మధ్య ఆహారం, ఆవాసం కోసం పోరాటం జరగడం వల్లచాలా జీవులు సంతానోత్పత్తి దశకు చేరకముందే చనిపోతున్నాయి. ఫలితంగా ఆ జీవుల సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఇది డార్విన్ గుర్తించిన రెండో సత్యం.

మనుగడ కోసం పోరాటం
ఆహారం పరిమితంగా ఉండటం వల్ల జీవుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడుతుంది. దీన్నే డార్విన్ మనుగడ కోసం పోరాటం (Struggle for Existance) అని వర్ణించాడు. ఇది 3 రకాలు.
ఎ. సజాతి సంఘర్షణ: ఒకే జాతికి చెందిన జీవుల మధ్య పోరాటం.
ఉదా: మానవుడు - మానవుడు, కుక్క - కుక్క, పిల్లి- పిల్లి మధ్య జరిగే పోరాటం.
బి. విజాతి సంఘర్షణ: భిన్న జాతుల మధ్య జరిగే పోరాటం.
ఉదా: శాకాహారులు, మాంసాహారుల మధ్య పోరాటం, ఎలుక - పిల్లి, పాము - ముంగిస మధ్య పోరాటం.
సి. భౌతిక శక్తులతో సంఘర్షణ: తుపానులు, వరదలు, భూకంపాలు, సునామీలతో జీవులు జరిపే పోరాటం.
కాబట్టి పోరాటం వల్ల జనాభా సంఖ్య పెరగకుండా స్థిరంగా ఉంటుంది.

వైవిధ్యాలు
జీవుల మధ్య కనిపించే తేడాలనే వైవిధ్యం అంటారు. వైవిధ్యాలు ఉపయోగకరంగా లేదా హానికరంగా ఉండొచ్చు. ఉపయోగకరమైన వైవిధ్యం గల జీవులు.. ఆ విధమైన వైవిధ్యం లేని జీవుల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించే అవకాశాలుంటాయని డార్విన్ గుర్తించాడు.
ఉదా: దేహంపై దట్టంగా రోమాలు గల గొర్రె.. చలి బారి నుంచి రక్షణ పొందుతుంది.

ప్రకృతి వరణం
ఉపయోగకరమైన వైవిధ్యాలు, అధిక ప్రత్యుత్పత్తి జరిపే శక్తిగల జీవులను ప్రకృతి ఎన్నుకొంటుంది. దీన్నే ప్రకృతి వరణం అంటారు. డార్విన్ ప్రకృతి వరణాన్ని యోగ్యతల సార్థక జీవనం (Survival of the fittest) అని హెర్బర్ట్ స్పెన్సర్ పేర్కొన్నాడు.మనుగడ కోసం జరిగే పోరాటంలో ఉపయుక్త వైవిధ్యాలు లేని జీవులు శత్రువుల బారిన పడి నశిస్తాయి.

అనువంశికత
ఉపయుక్త వైవిధ్యాలు తరతరానికి అభివృద్ధి చెందుతూ సంతానానికి సంక్రమించడాన్నే అనువంశికత అంటారు. కొన్ని వేల తరాల తర్వాత ఆ వైవిధ్యాల సంచిత ప్రభావం వల్ల ఆ జీవి మొదటి పూర్వీకులకంటే భిన్నంగా ఉంటుంది. అదే కొత్త జాతి జీవి.

కృత్రిమ ఎన్నిక
ఇందులో మానవుడు ప్రజనన కర్త. మానవుడు రెండు జీవులను ఎన్నుకొని, వాటి మధ్య సంపర్కం జరిపి, మేలైన రకాలను ఉత్పత్తి చేస్తాడు.
ఉదా: కోళ్లు, పందులు, పశువులు.

లైంగిక ఎన్నిక
ఇది కూడా డార్వినిజానికి అనుబంధమే. స్త్రీ జీవి.. ఆకర్షణీయమైన రంగు, ఆకృతి, అందం గల పురుష జీవినే ఎన్నుకుంటుంది.

పాన్‌జెనెసిస్ సిద్ధాంతం
ప్రతి జీవిలో పాన్ జన్యువులుంటాయి. ఇవి రక్త ప్రవాహం ద్వారా బీజకోశాలను చేరి, అక్కడి నుంచి బీజకణాల ద్వారా సంతానానికి చేరతాయి.

డార్వినిజంపై ప్రధాన అభ్యంతరాలు
డార్వినిజంలో లోపాలున్నట్లు పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అవి...
జీవుల్లో ఉండే వైవిధ్యాల పుట్టుకను డార్విన్ వివరించలేదు (కారణం జన్యువుల గురించి డార్విన్‌కు తెలియదు).
అవశేషావయవాలను గురించి ఎలాంటి వివరాలు డార్వినిజంలో లేవు.
అనువంశికత, అనువంశికత రహిత వైవిధ్యాల మధ్య తేడాను డార్విన్ వివరించలేదు.
ఐరిస్ జింకలో కొమ్ములు అవసరానికి మించి పెరిగాయి. అలాగే జెపర్ సన్స్‌ మమాత్ (ఏనుగు)లో దంతాలు అవసరానికి మించి పెరిగాయి. అందువల్లే ఆ రెండు జీవులు నశించాయి. అయితే అవసరానికి మించి అవయవాల అభివృద్ధి ఎందుకు జరిగిందో డార్విన్ పేర్కొనలేదు.
డార్వినిజంలోని లోపాలను సరిదిద్ది డివ్రీస్, హర్డీ, వీన్‌బెర్గ్‌, సీవెలరైట్‌లు నియోడార్వినిజాన్ని ప్రతిపాదించారు.
దాదాపు 157 సంవత్సరాల కిందట చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని (1859) ప్రపంచానికి అందించాడు.
డార్విన్ సిద్ధాంతం రాకతో జీవుల పరిణామానికి సంబంధించి అప్పటి వరకు వాడుకలో ఉన్న సిద్ధాంతాలన్నీ ప్రాధాన్యం కోల్పోయాయి.
న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం, ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాలను ఆధునిక ప్రపంచంలో జరిగిన రెండు అద్భుత ఆవిష్కరణలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. పై వాటికి సరితూగే ఆవిష్కరణగా డార్విన్ ‘ప్రకృతి వరణ సిద్ధాంతం’ అనేక ప్రశంసలు అందుకుంది.


మోడల్ ప్రశ్నలు

1. The Origin of Species గ్రంథ కర్త ఎవరు ?
  1) హెర్బర్ట్ స్పెన్సర్ 
  2) చార్లెస్ డార్విన్
  3) డీవ్రీస్ 
  4) జె.బి.లామార్క్‌

Published date : 07 Mar 2017 02:16PM

Photo Stories