TSLPRB: అర్హులకు మరోమారు దేహదారుఢ్య పరీక్షలు
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షల్లో బహుళ సమాధాన ప్రశ్నల (మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్)కు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని, ఈ మేరకు అర్హులైన వారికి మరోమారు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తూ ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు జనవరి 29న ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లను జనవరి 30న www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు.
చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్
దరఖాస్తులు నింపండి..
ఇప్పుడు మార్కులు కలపడంతో అర్హత సాధించే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పార్ట్–2 దరఖాస్తును నింపాలని టీఎస్‌ఎల్పీఆర్బీ వెల్లడించింది. వీటిని నింపేందుకు ఫిబ్రవరి 1 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు సమయం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షల్లో (ఎస్సై లేదా కానిస్టేబుల్) అర్హత సాధించి, బోర్డు తాజా నిర్ణయంతో రాతపరీక్షలో అర్హత సాధించే అభ్యర్థులు కూడా మళ్లీ పార్ట్–2 దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు.. ఇప్పుడు కొత్తగా మార్కులు కలపడం వల్ల రాతపరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ వారికి మరో అవకాశం ఇచ్చేది లేదని పోలీస్ బోర్డు స్పష్టం చేసింది.
వీరికి మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్
గతంలో దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనని, ఇప్పుడు మార్కులు కలిపితే కొత్తగా అర్హత సాధించే అభ్యర్థులకు మాత్రమే ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌ల్లో నిర్వహించనున్న ఈ ఫిజికల్ ఈవెంట్స్‌ను పదిరోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. వీటి అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు టీఎస్‌ఎల్పీఆర్బీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలుంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవ్చని లేదా support@tslprb.inకు ఈమెయిల్ చేసిగానీ సంప్రదించవచ్చని చెప్పారు.