Skip to main content

Students Commit Suicide After Inter Results: ఏడుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య.. ఫెయిలవుతాననే భయంతో సూసైడ్‌, కానీ రిజల్ట్స్‌లో పాస్‌

Students Commit Suicide After Inter Results

సాక్షి, నెట్‌వర్క్‌: ఏడుగురు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఇంటర్మిడియెట్‌ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఆరుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో ఇంకొక విద్యార్థిని బలవన్మరణం పొందింది.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్‌ (17), హైదరాబాద్‌ అత్తాపూర్‌కు చెందిన హరిణి, మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలం అచ్చులాపూర్‌ గ్రామానికి చెందిన మైదం సాత్విక్, మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఫెయిలవుతాననే భయంతోనే ఆత్మహత్య..
సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పతూరు గ్రామానికి చెందిన ఒకేషనల్‌ ఫస్టియర్‌ విద్యార్థిని శ్రీజ ఫెయిలైతే అందరి ముందు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు సేవించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, పరీక్ష ఫలితాల్లో ఆమె పాసైనట్లు వెల్లడైంది. ఆయా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

seven students suicide inter exam fail

1. మంచిర్యాల జిల్లా తాండూరు మండలానికి చెందిన విద్యార్థి(16) మొదటి ఏడాది ఎంపీసీ చదువుతున్నాడు. ఫలితాలను చూసుకుంటే నాలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కాలేదని తెలిసింది. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

2. మంచిర్యాల జిల్లా నస్పూర్​ మండలానికి చెందిన విద్యార్థిని మొదటి ఏడాదిలో ఎంపీసీ చదువుతోంది. రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్​ కావడంతో తీవ్రమనస్తాపానికి గురై, సెల్​ఫోన్​ సిగ్నల్​ రావడం లేదని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి పై అంతస్తులోకి వెళ్లింది. ఎంతకీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు పై అంతస్తుకు వెళ్లి చూడగా ఫ్యాన్​కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

3. మహబూబాబాద్​ మండలం రెడ్యాలకు చెందిన విద్యార్థిని(16) సీఈసీ మొదటి ఏడాది చదువుతోంది. ఒక సబ్జెట్​ ఎకనామిక్స్​లో ఫెయిల్​ కావడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

4. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఒక విద్యార్థిని(17) మొదటి ఏడాదిలో గణితం ఫెయిల్​ అయింది. మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కుమార్తె ఫెయిల్​ అయినట్లు తెలిసి ఫర్వాలేదులే అని ధైర్యం చెప్పానని కానీ ఇలా చేస్తుందనుకోలేదని తండ్రి వాపోయారు.

5. మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ మండలం చిల్కోడుకు చెందిన విద్యార్థిని(17) బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. బోటనీలో ఫెయిల్​ అయింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేరని చూసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

6. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​ పురపాలక పరిధి కొల్లూరులో ఉంటున్న విద్యార్థి(17) ఇంటర్​ ఎంపీసీ పూర్తి చేశాడు. ఫలితాలు చూసుకుని చెరువు గట్టు దగ్గరకు వెళ్లి అక్కడ ఉరేసుకుని, బలవన్మరణానికి పాల్పడ్డాడు.

7. రంగారెడ్డి జిల్లా హైదర్​గూడలో నివాసం ఉండే విద్యార్థిని(16) ఎంపీసీ మొదటి సంవత్సరం ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదు. మనోవేదనకు గురైన ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా తమ నూరేళ్ల జీవితకాలాన్ని ఇలా మనస్తాపం చెంది అర్దాంతరంగా ముగించుకుంటున్నారు.

8. భద్రాచలంలో ఇంటర్​ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థిని గణితంలో ఫెయిల్​ అయింది. అయితే గత సంవత్సరం ఇంటర్​ ద్వితీయ సంవత్సరంలో ఈ పేపర్​నే ఫెయిల్​ కావడంతో మళ్లీ పరీక్ష రాసింది. అయితే ఇప్పుడు కూడా పరీక్షలో పాస్​ కాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
 

Published date : 25 Apr 2024 04:40PM

Photo Stories