Skip to main content

399 Jobs: జెన్‌కోలో ఏఈ జాబ్స్‌.. వేతనం, ఎంపిక ఇలా

టీఎస్‌ జెన్‌కో 339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీటెక్‌ అర్హతతో ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు.
399 Jobs, Results,JobOpportunity,GovernmentJobs
జెన్‌కోలో.. ఏఈ జాబ్స్‌

 రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు. జెన్‌కో పరీక్ష తేదీని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. టీఎస్‌ జెన్‌కో ఏఈ పోస్ట్‌ల వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు..

జాబ్స్‌ ఇన్ఫో

తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. టీఎస్‌ జెన్‌కోగా సుపరిచితం. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించే ఈ సంస్థ.. మానవ వనరుల నియామకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ప్రతి ఏటా ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. తాజాగా.. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

చదవండి: AICTE: కొత్త కాలేజీల ఏర్పాటుపై నిషేధం ఎత్తేసిన ఏఐసీటీఈ.. తాజా నిబంధనలు ఇవీ..

నాలుగు బ్రాంచ్‌లు.. 339 పోస్ట్‌లు

  • టీఎస్‌ జెన్‌కో తాజా నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం నాలుగు బ్రాంచ్‌లలో 339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–145 పోస్ట్‌లు, లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌– 42 పోస్ట్‌లు.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(మెకానికల్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–74 పోస్ట్‌లు; లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌–3 పోస్ట్‌లు.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రానిక్స్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–25 పోస్ట్‌లు.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–1,లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌–49 పోస్ట్‌లు
  • నాలుగు బ్రాంచ్‌లకు సంబంధించి లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ పరిధిలో 94 పోస్ట్‌లు, జనరల్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో 245 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

విద్యార్హతలు

  • ఏఈ(ఎలక్ట్రికల్‌): ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌తో బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
  • ఏఈ(మెకానికల్‌): మెకానికల్‌ బ్రాంచ్‌తో బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.
  • ఏఈ(ఎలక్ట్రానిక్స్‌): ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(ఈసీఈ)/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ పవర్‌/పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి.

వయసు

జూలై 1, 2023 నాటికి 18–44 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ / ఎస్‌టీ/ ఓబీసీ(నాన్‌ –క్రీమీలేయర్‌)/ఈ డబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు ఇస్తారు.

వేతనం

తుది విజేతల జాబితాలో నిలిచి నియామకం ఖరారు చేసుకుంటే.. రూ.65,600–రూ.1,31,220 వేతన శ్రేణిలో ప్రారంభ వేతనం లభిస్తుంది.

ఎంపిక ఇలా

రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా రిజర్వేషన్లు, లోకల్‌ కేడర్‌ తదితర నిబంధనలను అనుసరించి తుది జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు. ఆ క్రమంలో ఆయా కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కుల నిబంధనను అమలు చేస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్‌, క్రీడాకారుల కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు; బీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులు; ఎస్‌సీ/ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు; పీహెచ్‌ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాఽధించాలి.

వంద మార్కులకు రాత పరీక్ష

  • రాత పరీక్షను రెండు విభాగాలుగా 100 మార్కులకు నిర్వహిస్తారు.
  • పార్ట్‌–ఎలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌ నుంచి 80 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్‌–బిలో ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, సంస్కృతి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నమోదైన అభివృద్ధి, బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.
  • పరీక్షను ఓఎంఆర్‌ విధానంలో నిర్వహిస్తారు.

రెండేళ్ల ప్రొబేషన్‌, శిక్షణ

నియామకం ఖరారైన వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్‌, శిక్షణ విధానాన్ని అమలు చేస్తారు. తొలి ఏడాదిని శిక్షణ సమయంగా, రెండో ఏడాదిని ప్రొబేషన్‌ పీరియడ్‌గా పరిగణిస్తారు. ప్రొబేషన్‌ నిబంధనలతోపాటు.. సర్వీస్‌ బాండ్‌ను కూడా టీఎస్‌ జెన్‌కో అమలు చేస్తోంది. నియామకం ఖరారు చేసుకున్న వారు ట్రైనింగ్‌, ప్రొబేషన్‌లకు కేటాయించిన రెండేళ్లతో కలిపి.. మొత్తం అయిదేళ్లపాటు జెన్‌కోలో విధులు నిర్వహిస్తామని సర్వీస్‌ బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎస్‌ఈ స్థాయికి చేరుకునే అవకాశం

టీఎస్‌ జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా కొలువు దీరిన వారు.. భవిష్యత్తులో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. సర్వీసు నిబంధనలను అనుసరించి.. ఏఈ తర్వాత.. అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌, ఆ తర్వాత డివిజనల్‌ ఇంజనీర్‌, అనంతరం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ స్థానాలకు పదోన్నతులు లభిస్తాయి. చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయికి కూడా చేరుకోవచ్చు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్‌ 29,2023
  • రాత పరీక్ష తేదీ: డిసెంబర్‌ 3, 2023
  • రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో.
  • వెబ్‌సైట్‌: www.tsgenco.co.in
Published date : 19 Oct 2023 02:49PM

Photo Stories