10th class exams in Telangana: పదో తరగతిలో మళ్లీ పదకొండు పేపర్లు

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు.. ప్రతి సబ్జెక్ట్‌లోనూ రెండు పేపర్లకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే.. హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లలోనూ పేపర్-1, పేపర్-2 పేరుతో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది! అంతేకాకుండా.. పూర్తి సిలబస్‌తో పరీక్షలు నిర్వహించనున్నారు! కోవిడ్ పూర్వ పరిస్థితులు నెలకొనడం, అకడమిక్ విధానం గాడిన పడడమే ఇందుకు కారణం!! విద్యార్థులు కొత్త మార్పులకు అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను మార్చుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల కొత్త విధానం, విద్యార్థులకు ప్రిపరేషన్...
- ప్రతి సబ్జెక్ట్‌లో పేపర్-1, పేపర్-2
- సిలబస్ కూడా పూర్తి స్థాయిలో
- త్వరలో విడుదల కానున్న బ్లూ ప్రింట్, మోడల్ పేపర్స్
- 2019 మాదిరిగానే ఉంటుందనే అభిప్రాయాలు
రెండు పేపర్లు.. 80 మార్కులు
అన్ని సబ్జెక్ట్‌లను రెండు పేపర్లుగా నిర్వహించాలనే నిర్ణయం నేపథ్యంలో.. గతంలో మాదిరిగానే ఒక్కో పేపర్‌ను 40 మార్కులకు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే.. ప్రతి సబ్జెక్ట్‌లోనూ మొత్తం 80 మార్కులకు వార్షిక పరీక్షలు జరుగుతాయి. మరో 20 మార్కులకు విద్యా సంవత్సరంలో తరగతి గదిలో నిర్వహించే ఇంటర్నల్స్‌కు కేటాయిస్తారు. ఇలా ఇంటర్నల్స్, వార్షిక పరీక్షలు రెండు కలిపి మొత్తం వంద మార్కులకు ప్రతి సబ్జెక్ట్‌కు పరీక్షల నిర్వహణ విధానాన్ని అమలు చేస్తారు. అదే విధంగా పరీక్ష సమయం 2:45 గంటలుగా ఉండే అవకాశముంది.
పూర్తి స్థాయిలో సిలబస్
గత రెండేళ్లుగా కరోనా కారణంగా సిలబస్‌ను 30 శాతం తగ్గించారు. 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరంలో 2019 మాదిరిగానే మళ్లీ పూర్తి సిలబస్‌ను అమలు చేయనున్నారు. వార్షిక పరీక్షలు పూర్తి సిలబస్ ఆధారంగానే జరగనున్నాయి. విద్యార్థులు ఇప్పటి నుంచి ప్రతి సబ్జెక్ట్‌లోనూ అన్ని అంశాలను అధ్యయనం చేయడంపై దృష్టిపెట్టాలి.
TS 10th Class TM Study Material
బ్లూ ప్రింట్‌కు అనుగుణంగా
పదో తరగతి పరీక్షల బ్లూ ప్రింట్‌ను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేస్తారని తెలుస్తోంది. ప్రతి సబ్జెక్ట్‌లోనూ చాప్టర్లు, వాటికి కల్పించే వెయిటేజీని బ్లూ ప్రింట్‌లో సమగ్రంగా పేర్కొంటారు. దీని ఆధారంగా విద్యార్థులు ఆయా అంశాలపై పట్టు సాధించే విధంగా సన్నద్ధత సాగించాలి.
మ్యాథమెటిక్స్.. ప్రత్యేకంగా
- మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ విషయంలో విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టి చదవాలి. మొత్తం 14 చాప్టర్లుగా ఉండే మ్యాథమెటిక్స్‌లో.. పేపర్-1 నుంచి ఏడు, పేపర్-2 ఏడు చొప్పున చాప్టర్లు అడుగుతారు. విద్యార్థులు ప్రిపరేషన్ సమయంలోనే సమస్య సాధనతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. దీంతోపాటు గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
- మ్యాథమెటిక్స్‌లో పేపర్-1 పార్ట్-ఎ, పార్ట్-బిగా ఉంటుంది. పార్ట్-ఎలో మూడు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొదటి విభాగంలో ఒక మార్కు ప్రశ్నలు 7(7 మార్కులు), రెండో విభాగంలో 2 మార్కుల ప్రశ్నలు 6 (12 మార్కులు), మూడో విభాగంలో 4 మార్కుల ప్రశ్నలు 4(16 మార్కులు) ఉంటాయి. పార్ట్-బిలో పది బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు ఉంటాయి. మూడో విభాగంలోని నాలుగు మార్కుల ప్రశ్నల విషయంలో అంతర్గత ఛాయిస్ ఉంటుంది. పేపర్-2 మార్కుల విధానం కూడా ఇదే పేపర్-1 మాదిరిగానే ఉంటుంది.
10th Class Model papers
సోషల్ స్టడీస్
సోషల్ స్టడీస్‌లో ఏడు ఒక మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు ఆరు, నాలుగు మార్కుల ప్రశ్నలు నాలుగు పార్ట్-ఎలో అడుగుతారు. పార్ట్-బిలో అర మార్కు ప్రశ్నలు పది ఉంటాయి. సోషల్ స్టడీస్ సబ్జెక్ట్‌ను అధ్యయనం చేసే క్రమంలో విద్యార్థులు పాఠ్యపుస్తకంలోని ఆయా అంశాలకు సంబంధించి నిజజీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ చదవడం ఎంతో లాభిస్తుంది. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస /అభినందనలపై సా«ధన చేయడం ఎంతో అవసరం. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి, సొంత పరిజ్ఞానంతో రాసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. వీటితోపాటు డయాగ్రమ్/రేఖాచిత్ర, పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా గత ప్రశ్న పత్రాల సరళిని పరిగణనలోకి తీసుకుంటే.. విషయావగాహనకు 40 శాతం, చదివి అర్థం చేసుకోవడం -వ్యాఖ్యానించడానికి 8 శాతం, సమాచార నైపుణ్యానికి 18శాతం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందనకు 16 శాతం, పట నైపుణ్యానికి 10 శాతం, ప్రశంస -అభినందనకు 8 శాతం వెయిటేజీలు కల్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.
-బి.శ్రీనివాస్, సబ్జెక్ట్ నిపుణులు
సైన్స్.. పీఎస్, ఎన్‌ఎస్‌గా
- సైన్స్ సబ్జెక్ట్‌లో.. భౌతిక రసాయన శాస్త్రాన్ని పేపర్-1గా,జీవ శాస్త్రాన్ని పేపర్-2గా నిర్వహిస్తారు. మిగతా పేపర్ల మాదిరిగానే పేపర్-1, పేపర్-2 మార్కింగ్ విధానం ఉంటుంది. ఏడు 1 మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు ఆరు, 4 మార్కుల ప్రశ్నలు నాలుగు పార్ట్-ఎలో అడుగుతారు. పార్ట్-బిలో అర మార్కు ప్రశ్నలు పది ఉంటాయి.
- భౌతిక రసాయన శాస్త్రంలో మొత్తం 12 చాప్టర్లు ఉంటాయి. వీటిలో ఫిజిక్స్ నుంచి ఆరు, కెమిస్ట్రీ నుంచి ఆరు చాప్టర్లుతో సిలబస్ ఉంటుంది. విద్యార్థులు విషయ అవగాహనతోపాటు, ప్రశ్నించడం-పరికల్పన చేయడం; ప్రయోగాలు-క్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలు-ప్రాజెక్ట్ పనులు; పటాలు-వాటి ద్వారా భావ ప్రసారం, వంటి వాటిపైనా కృషి చేయాలి.
- సైన్స్ రెండో పేపర్‌గా ఉండే నేచురల్ సైన్స్ (జీవశాస్త్రం)లో పది చాప్టర్లను విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆయా అంశాలను చదవడం తోపాటు.. విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనం చేయాలి. అదే విధంగా ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించే నేర్పు సొంతం చేసుకోవాలి. ప్రయోగాలకు సంబంధించి ప్రయోగం ఫలితంతోపాటు.. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం ఎంతో మేలు చేస్తుంది. అదే విధంగా.. డయాగ్రమ్స్‌ను ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. డయాగ్రమ్స్‌లోని భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా అభ్యసనం సాగించాలి. పరీక్షల్లో ప్రశ్నలు-మార్కులు విధానం ఇతర పేపర్ల మాదిరిగానే ఉంటుంది. ఒక మార్కు ప్రశ్నలు 7, రెండు మార్కుల ప్రశ్నలు ఆరు, నాలుగు మార్కుల ప్రశ్నలు 4 అడుగుతారు. దీంతోపాటు పార్ట్-బిలో అర మార్కు ప్రశ్నలు పది ఉంటాయి.
-ఎ.నాగరాజశేఖర్
తెలుగు.. సబ్జెక్ట్ ఇలా
- తెలుగు సబ్జెక్ట్‌కు సంబంధించి వ్యక్తీకరణ-సృజనాత్మక(స్వీయ రచన) ఆధారంగా..మూడు మా ర్కుల ప్రశ్నలు నాలుగు,ఆరు మార్కుల ప్రశ్నలు మూడు అడుగుతారు. పార్ట్-బిలో సొంత వాక్యాల ప్రశ్నలు రెండు, 16 బహుళైచ్ఛిక ప్రశ్నలు(ఒక్కో ప్రశ్నకు అర మార్కు) అడుగుతారు.
- పేపర్-2లో అవగాహన-ప్రతిస్పందనకు సంబంధించి పరిచిత గద్యం నుంచి ఒక మార్కు ప్రశ్నలు అయిదు, అపరిచిత గద్యం నుంచి మరో అయిదు మార్కులు, పద్యం-ప్రతిపదార్థం నుంచి 5 మార్కులు,అపరిచిత పద్యం నుంచి మరో 5 మార్కులు, వ్యక్తీకరణ-సృజనాత్మక విభాగంలో 5 మార్కుల ప్రశ్నలు రెండు అడుగుతారు. వీటితోపాటు వ్యాకరణం నుంచి అర మార్కు ప్రశ్నలు 20 ఉంటాయి. విద్యార్థులు అభ్యసనం సమయంలో 12 చాప్టర్లను పూర్తిగా అభ్యసనం చేయాలి.
-డి.విజయకుమారి
ఇంగ్లిష్
ఇంగ్లిష్ పేపర్-1లో రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి అయిదు మార్కులు, పొయెట్రీ నుంచి అయిదు మార్కులు, ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అయిదు మార్కులు, వొకాబ్యులరీ అండ్ గ్రామర్ నుంచి 10 మార్కులు, క్రియేటివ్ రైటింగ్ నుంచి 15 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-2లో రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని ఆధారంగా.. ఒక మార్కు ప్రశ్నలు 4, రెండు మార్కుల ప్రశ్నలు మూడు అడుగుతారు. అదే విధంగా.. మరో ప్యాసేజ్ ఆధారంగా బహుళైచ్ఛిక విధానంలో ఒక మార్కు ప్రశ్నలు మూడు, ఒక మార్కు ప్రశ్నలు రెండు అడుగుతారు. వొకాబ్యులరీ నుంచి అయిదు ఒక మార్కు ప్రశ్నలు, అర మార్కు ప్రశ్నలు పది అడుగుతారు. క్రియేటివ్ రైటింగ్ విభాగం నుంచి ఒక మార్కు ప్రశ్నలు 15 ఉంటాయి. విద్యార్థులు కాంప్రహెన్సివ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి సొంతంగా రాసుకునే అలవాటు చేసుకోవాలి. పొయెట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి. వీటితోపాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్,ఫ్రేజల్ వెర్బ్స్‌ను అధ్యయనం చేయాలి.
-సి.భాగ్యశేఖర్ రెడ్డి
ఆ నైపుణ్యాలే ఆధారంగా వార్షిక పరీక్షలు
వార్షిక పరీక్షల విషయానికొస్తే.. విద్యార్థులు తరగతి గదిలో వారు పొందిన నైపుణ్యాలను పరిశీలించేలా పరీక్షలు నిర్వహించనున్నారు. విషయ అవగాహన, ప్రశ్నించడం-పరికల్పనం, అవగాహన-ప్రతిస్పందన, ప్రాజెక్ట్ నిర్వహణ, పట నైపుణ్యం, సౌందర్యాత్మక స్పృహ, సృజనాత్మక వ్యక్తీకరణ వంటి నైపుణ్యాలను పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌లోనూ ఆయా అంశాలను పై నైపుణ్యాలు పెంచుకునేలా అభ్యసనం చేయాలి. అదే విధంగా పాఠ్య పుస్తకాల్లో ఉండే ప్రశ్నలు అడగరనే (డైరెక్ట్ కొశ్చన్ అండ్ ఆన్సర్) విషయాన్ని గుర్తించి.. పైన పేర్కొన్న నైపుణ్యాలను అలవర్చుకోవాలి.
-ఆవంచ వెంకట సుధాకర్, స్కూల్ అసిస్టెంట్