Skip to main content

US Visa: ఇలా చేస్తే ఈజీగా అమెరికాకి వెళ్లొచ్చు... కొత్త నిబంధ‌న‌లు తెలుసా?

మ‌న‌దేశ యువ‌త‌కు అమెరికా అంటే ఒక క్రేజ్‌. అమెరికా వెళ్లాలి.. అక్క‌డే చ‌దువుకుని స్థిర‌ప‌డాలి అనే యువ‌తీయువ‌కులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అయితే అమెరికా అధ్య‌క్షుడు మారిన‌ప్పుడ‌ల్లా వీసా నిబంధ‌న‌లు కూడా మారుస్తుండ‌డంతో విద్యార్థుల క‌ల ఒక్కో సారి క‌లగానే మిగిలిపోతోంది.
Study In USA

అయితే ప్ర‌స్తుత అధ్యక్షుడు జోబైడెన్ తీసుకొచ్చిన నూత‌న వీసా నిబంధ‌న‌ల‌తో విద్యార్థులు ఎగిరిగంతేసే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.
ఏడాది ముందుగానే....
అమెరికాలో చ‌దువుకోవాల‌నే విద్యార్థుల‌కు వీసా క‌ష్టాలు ఇక‌పై తీర‌నున్నాయి. కోర్సు ప్రారంభ తేదీకి ఏడాది ముందుగానే విద్యార్థి వీసా(ఎఫ్‌-1) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు కోర్సు మొదలవడానికి నాలుగు నెల‌లు లేదా అంతకంటే తక్కువ సమయం ఉన్నప్పుడు మాత్రమే వీసా ఇంటర్వ్యూ కోసం షెడ్యూల్‌ చేసుకోవాల్సి వచ్చేది. 

చ‌ద‌వండి: ఇలా చేస్తే జాబ్‌లేక‌పోయినా ఎంచ‌క్కా ఇంగ్లాండ్‌లో స్థిర‌ప‌డొచ్చు
నిబంధ‌న‌ల్లో మార్పులు...
మ‌రోవైపు విద్యాసంస్థ‌లు కూడా 4 నుంచి 6 నెల‌ల ముందు మాత్రమే ప్రవేశ అనుమతి కోసం ఐ-20 ధ్రువపత్రాలను జారీ చేసేవి. ఫలితంగా కొన్నిసార్లు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తేవి. విద్యాసంస్థల నుంచి ఆలస్యంగా ఐ-20 పత్రాలు రావటం, ఇంటర్వ్యూ తేదీలు లభించకపోవటం జరిగేది. దీంతో విద్యార్థులు ఏకంగా విద్యా సంవ‌త్స‌రాన్నే కోల్పోయేవారు. వీటికి చెక్ పెడుతూ అమెరికా ప్ర‌భుత్వం నూత‌న వీసా నిబంధనలు తీసుకొచ్చింది. 
క‌చ్చితంగా ఎస్‌ఈవీఐఎస్‌లో నమోదు చేసుకోవాలి
విద్యార్థులు తమ కోర్సు ప్రారంభ తేదీకి ఏడాది ముందుగా వీసా పొందొచ్చు. విద్యాసంస్థలు కూడా 12-14 నెలల ముందు నుంచి ఐ-20 పత్రాలను జారీ చేస్తాయి. అయితే తరగతుల ప్రారంభానికి 30 రోజుల ముందుగా మాత్రమే విద్యార్థుల‌ను దేశంలోకి అనుమ‌తిస్తారు. నూతన నిబంధనలు ఇప్ప‌టికే అమలులోకి వచ్చినట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది. అయితే తమ దేశంలో చదువుకోవాలనుకునే విద్యార్థులు.. స్టూడెంట్‌, ఎక్స్ఛేంజ్‌ విజిటర్స్‌ సిస్టం (ఎస్‌ఈవీఐఎస్‌)లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. విద్యార్థి జీవిత భాగస్వామి అయినా, వారి మైనరు పిల్లలైనా అమెరికాలో ఉండాలనుకుంటే వేరువేరుగా ఆయా విద్యాసంస్థల నుంచి ఐ-20 పొందాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి:​​​​​​​ విశ్వ‌విజేత విశ్వ‌నాథ‌న్ ఆనంద్ తొలి గురువు ఎవ‌రో తెలుసా
60 రోజుల్లో తిరిగి వెళ్లాలి
విద్యాభ్యాసం పూర్తియిన 60 రోజుల్లోపు విద్యార్థులు అమెరికాను వీడాల్సి ఉంటుంది. కోర్సు ప్రారంభంలోనే ఆయా విద్యాసంస్థ‌లు కోర్సు ముగిసే స‌మ‌యాన్ని పేర్కొంటాయి. యూనివ‌ర్సిటీలు తెలిపిన తేదీ నుంచి గ‌రిష్టంగా రెండు నెల‌లు మాత్ర‌మే అమెరికాలో ఉండే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాత విధిగా ఆ దేశాన్ని వీడాల్సిందే.

Published date : 25 Feb 2023 03:47PM

Photo Stories