Skip to main content

కృత్రిమ మేధస్సులో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో కృత్రిమ మేధస్సు వాటా భవిష్యత్‌లో రూ.1,284.2 లక్షల కోట్లకు చేరే అవకాశమున్న నేపథ్యంలో, అవకాశాలను అంది పుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఏఐ-2020 లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. 2020ని ‘ఇయర్ ఆఫ్ ఏఐ’గా ప్రకటించారు. రాష్ట్రంలో ఏఐ సాంకేతికత వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను నిర్వహి స్తామని పేర్కొన్నారు. ఏడాది కాలంలో రెండు వందలకు పైగా ఆవిష్కర్తలు, స్టార్టప్‌లను ఆకర్షిం చడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రాష్ట్రానికి రెండు నుంచి మూడు బిలి యన్ డాలర్ల పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ రంగం గుర్తించిన కీలక రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏఐ నైపుణ్యాన్ని రాష్ట్రానికి రప్పించడం ద్వారా రాష్ట్ర జీడీపీకి అదనంగా ఒక శాతం లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. వ్యవసాయం, ఆరోగ్య రంగాలతోపాటు సామాజిక ప్రయోజనాల కోసం కృత్రిమ మేధో సాంకేతికతను ఉపయోగించడంతో పాటు, ఐటీ కొత్త సాంకేతికతను గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా చూస్తామని తెలిపారు.

బిగ్ బ్రదర్ పాత్ర పోషించడం లేదు..
‘పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం తమ జీవితాల్లోకి తొంగిచూస్తుందనే అనుమానాలు చాలా మందిలో వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగంతో పాటు అది విసిరే సవాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నట్లు గతంలో మాపై ఓ పత్రికలో ఆరోపణలు వచ్చాయి. మేము బిగ్ బ్రదర్ పాత్ర పోషించడం లేదు. ప్రజా జీవితాన్ని సులభతరం చేయడం, ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చూసేందుకు మాత్రమే సాంకేతికతను వినియోగిస్తున్నాం. ప్రజల వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ సాంకేతికత అభివృద్ధిలో నైతికతకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు తయారు చేయడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. కొత్తగా వస్తున్న ఏఐ ఐటీ సాంకేతికత ద్వారా దేశంలో అద్భుత మార్పులు సాధ్యమవుతాయి. ఈ నేపథ్యంలో 2016లో ఐటీ పాలసీతో పాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, ఐవోటీ, రోబోటిక్స్ తదితర రంగాలకు సంబంధించి పాలసీ ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేశాం’అని కేటీఆర్ పేర్కొన్నారు.

2021 నాటికి 8 లక్షల ఉద్యోగాలు..
‘నాస్కామ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ రంగం వాటా 2025 నాటికి 16 బిలియన్ డాలర్లకు చేరడంతో పాటు, 2021 నాటికి 8 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుంది. ఏఐ రంగంలో 2.30 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ తరఫున 2020ని ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటిస్తున్నాం. ఈ రంగంలో తెలంగాణ యువతకు ఎక్కువ శాతం ఉద్యోగాలను దక్కేలా చూస్తాం. ఐఐటీ హైదరాబాద్ తరహాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు, ఇతర విద్యా సంస్థల్లోనూ ఏఐని బోధిస్తాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ టాస్క్, ఇతర సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించి ఏఐ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కేలా చూస్తాం. ఐటీ రంగానికి రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలోని 25 అగ్రశ్రేణి ఏఐ హబ్‌లలో ఒకటిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం’అని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఏఐ పరిశోధన, అభివృద్ధికి సంబంధించి వివిధ సంస్థలతో ఒప్పందాలు, ప్రాజెక్టులపై ప్రకటనలు చేశారు. ఏడాది పొడవునా నిర్వహించే కార్యక్రమాల వివరాలను విడుదల చేశారు.
Published date : 03 Jan 2020 03:21PM

Photo Stories