Skip to main content

‘జగనన్న గోరు ముద్ద’ యాప్ ఆవిష్కరణ

సాక్షి, అమరావతి: జగనన్న గోరు ముద్ద యాప్‌ను విద్యా శాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ మార్చి 5 (గురువారం)నఆవిష్కరించారు.
అనంతరం మధ్యాహ్న భోజన పథకంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్యాహ్న భోజన పథకం మెనూను పూర్తిగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు మార్పులు చేసి అమలు చేస్తున్నామన్నారు. నూతన మెనూ కింద పులిహోర, తీపి పొంగలి, వెజిటబుల్ రైస్, కిచిడీ, చిక్కీ పొందుపరిచారని అన్నారు. నూతన మెనూ నాణ్యత, పరిమాణం కచ్చితంగా అమలు పరచేందుకు నాలుగు అంచెల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. లోటుపాట్లు పరిశీలించేందుకు, సమస్యలు వెంటనే తెలుసుకుని పరిష్కరించేందుకే ప్రత్యేకంగా ‘జగనన్న గోరు ముద్ద’ యాప్‌ను ఆవిష్కరించామని చెప్పారు. మధ్యాహ్న భోజన సంచాలకులు సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ వివిధ స్థాయిల్లోని స్వయం సహాయక సంఘాలకు యాప్ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయ సంక్షేమ-విద్య సహాయకుల సేవలను మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమం పర్యవేక్షణకు వినియోగించుకోవాలని గ్రామ సచివాలయ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి కె.కన్నబాబు సూచించారు.
Published date : 06 Mar 2020 01:44PM

Photo Stories