School exams: నేటి నుంచి పాఠశాలల్లో పరీక్షలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: కొత్త విద్యా సంవత్సరంలో పరీక్షల పర్వం మొదలుకానుంది. జూన్, జూలై మాసాల్లో జరిగిన సిలబస్‌లకు సంబంధించి విద్యార్థుల అభ్యసన మదింపు, సామర్థ్యాలను అంచనా వేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమైంది. ఆగస్టు 1వ తేదీ నుంచి పాఠశాలల్లో పరీక్షలు మొదలుకానున్నాయి. గుణాత్మక విద్యను అందించేందుకు నిర్వహిస్తున్న ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలను ప్రభుత్వం గత ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (సీబీఏ) పేరుతో నిర్వహిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్ పరీక్షల నిర్వహణకు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు (డీసీఈబీ) ఏర్పాట్లు చేసింది. గత ఏడాది మాదిరిగానే 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సీబీఏ విధానంలో, 9,10 తరగతుల వారికి ఫార్మేటివ్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. సీబీఏ విధానంలో నిర్వహించే పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు.
FA-1 exams in AP: నేటి నుంచి ఫార్మేటివ్ – 1 పరీక్షలు
‘ద్విభాషా’ విధానంలో ప్రశ్నపత్రాలు..
సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ప్రశ్నపత్రం సులువుగా అర్థమయ్యేందుకు బైలింగ్విల్ (ద్విభాష) విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. విద్యార్థికి ఇంగ్లీషులో ప్రశ్న అర్థం కాకుంటే తెలుగులో చదివి అర్థం చేసుకునేందుకు గత ఏడాది నుంచి ద్విభాషా విధానంలో ప్రశ్నపత్రాలు ప్రవేశపెట్టారు. ఇందులో 10 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఐదు ప్రశ్నలు రాతపూర్వక విధానంలో ఇస్తారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలన్నీ విద్యార్థి మేథస్సును సమగ్రంగా అంచనా వేసేలా ఉంటాయి. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాల్సి ఉంటుంది.