Skip to main content

సివిల్స్ ప్రిలిమ్స్.. సక్సెస్‌కు సన్నాహాలు

దేశంలో అత్యున్నత సర్వీసులను చేజిక్కించుకునేందుకు వీలుకల్పించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2015 నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం 24 అఖిల భారత సర్వీసుల్లో 1,129 ఖాళీలతో ప్రకటన అభ్యర్థుల ముందుకొచ్చింది. ప్రిలిమినరీలో పేపర్-2 సీశాట్‌ను కేవలం అర్హత పరీక్షగా యూపీఎస్సీ పేర్కొంది. సీశాట్‌తో గత నాలుగేళ్లుగా అవకాశాలు చేజారాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వారికి ఇదో తీపి కబురు! ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో జీఎస్ పేపర్‌లో ముందంజలో నిలవడానికి, పేపర్-2లో అర్హత సాధించేందుకు సబ్జెక్టు నిపుణుల సలహాలు..

పరీక్ష విధానం
పేపర్-1 (జనరల్ స్టడీస్ పేపర్):
200 మార్కులు
పేపర్-2 (సీశాట్): 200 మార్కులు

అరచేతిలో ‘భూగోళం’
  • జనరల్ స్టడీస్‌లో జాగ్రఫీకి సంబంధించి ప్రధానంగా ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామికల్ జాగ్రఫీలపై దృష్టిపెట్టాలి. పర్యావరణ సమస్యలు-ప్రకృతి విపత్తుల ప్రభావిత ప్రాంతాలు, పృకృతి విపత్తులకు కారణాలు, ఇటీవల నేపాల్‌తో పాటు, ఈశాన్య భారతదేశాన్ని సైతం వణికించిన భూకంపం, అందుకు కారణాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.
  • సోషల్, ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించి జనాభా గణాంకాలు; స్త్రీ, పురుష నిష్పత్తి; వాతావరణ మార్పులు - సామాజికంగా, ఆర్థికంగా చూపుతున్న ప్రభావం (ఉదా: పంటలు ఎండిపోవడం వల్ల పట్టణ ప్రాంతాలకు పెరుగుతున్న వలసలు, పెరుగుతున్న నిరుద్యోగిత రేటు వంటివి) పై పట్టు సాధించాలి. కోర్ జాగ్రఫీలో రుతు పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రతలు, భూ అంతర నిర్మాణం, శిలలు వంటి వాటిపై ప్రపంచంలో ముఖ్య ప్రాంతాల గురించి తెలుసుకోవాలి. ఫిజికల్ జాగ్రఫీలో మానవ జాతులు, దేశంలోని నదులు; ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నదుల అనుసంధానం గురించి అవగాహన పెంచుకోవాలి. అట్లాస్‌పై పరిజ్ఞానం, పర్వతాలు, ఎత్తై, లోతైన ప్రాంతాలపై అవగాహన తప్పనిసరి. ఇండియా ఇయర్‌బుక్, అట్లాస్; ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి.

చరిత్ర.. ప్రాచీనం నుంచి వర్తమానం వరకు
చరిత్రను వర్తమానంతో ముడిపెడుతూ ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రాచీన, మధ్యయుగ చరిత్రల్లో సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, ఆనాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై దృష్టిసారించాలి.
  • ఇటీవల ప్రశ్నల సరళిని విశ్లేషిస్తే ఆధునిక చరిత్రకు ప్రాధాన్యం పెరుగుతోంది. భారత్‌లో బ్రిటిష్ పాలనలో ముఖ్య ఘట్టాలు, స్వాతంత్య్రోద్యమం, సంస్కరణోద్యమాలపై పట్టుసాధించాలి.
  • చరిత్రలో ప్రశ్నల సరళిపైనా అవగాహన పెంచుకోవాలి. ఇటీవల కాలంలో చరిత్ర సంబంధిత ప్రశ్నల్లోనూ అసెర్షన్ అండ్ రీజన్, మ్యాచింగ్ ప్రశ్నలు పెరుగుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు తులనాత్మక ప్రిపరేషన్ విధానాలు అనుసరించాలి. ఎన్‌సీఈఆర్‌టీ 6 నుంచి 12వ తరగతి వరకు సోషల్ పుస్తకాలు ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.

ఎకానమీ.. సమకాలీన సమన్వయం
ప్రాథమిక అంశాలు, సమకాలీన అంశాలను సమన్వయం చేసుకుంటూ చదవాల్సిన సబ్జెక్ట్ ఎకానమీ. ఆర్థిక రంగంలో సంభవించే పరిణామాలకు మూలాధారం కోర్ ఎకనామిక్ అంశాలే. ఔత్సాహికులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎకానమీ ప్రిపరేషన్‌కు వ్యూహం అమలు చేయాలి.
  • ప్రభుత్వం తాజాగా చేపట్టిన ఆర్థిక పరమైన సంస్కరణలు/విధానాలను చదవాలి. ఆర్థిక అభివృద్ధి, హ్యూమన్ ఇండెక్స్‌లపై అవగాహన అవసరం. భారత ఆర్థిక వ్యవస్థ మూల భావనలు, ఆర్థికాభివ ృద్ధికి సంబంధించి కాన్సెప్టులపై పట్టు సాధించాలి. స్థూల ఆర్థికశాస్త్ర అంశాలను విస్మరించకూడదు.
  • జాతీయాదాయ భావనలు, స్థిర వృద్ధి, సమ్మిళిత వృద్ధి, నిరుద్యోగిత భావనలు, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ రంగం వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి.
  • ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, ఇండియన్ ఎకనామీ-ఉమా కపిల, యోజన, కురుక్షేత్ర వంటి పుస్తకాలు చదవాలి. తాజా ఆర్థిక సర్వేలు, బడ్జెట్ నివేదికల గణాంకాలపై పట్టు సాధించాలి.

పాలిటీలో పట్టు సాధించాలంటే
  • పాలనాపరంగా అనువర్తిస్తున్న విధానాలపై అవగాహన పెంచుకుంటూ కోర్ పాలిటీ అంశాలను చదవాలి. ఉదాహరణకు ఇటీవల కాలంలో ప్రభుత్వం పాలన పరంగా తీసుకున్న కీలక నిర్ణయాలు, ఈ-గవర్నెన్స్, సోషల్ ఆడిట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటివి. రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చి న తీరు వరకు; రాజ్యాంగ సవరణలు- వాటి అమలుకు రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకరణలపైనా అవగాహన అవసరం. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి పలు కమిటీలు చేసిన సిఫార్సులపై పట్టు ఎంతో అవసరం. వివిధ పథకాలు, వాటి అమలు తీరు, సమస్యలపై అవగాహన అవసరం. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతోపాటు; ఇన్‌ట్రడక్షన్ టు కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (డి.డి.బసు); ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (పి.ఎం.భక్షి) పుస్తకాలు చదవాలి.

జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ..
ప్రాథమిక అంశాలను సమకాలీన అంశాలకు బేరీజు వేసుకుంటూ చదవాలి. ఇటీవల కాలంలో అడుగుతున్న ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. అంతరిక్షం, రక్షణ రంగాలకు సంబంధించిన అంశాలు (ఉదా: ఉపగ్రహ ప్రయోగాలు; క్షిపణుల ప్రయోగాలు-వాటి ఫలితాలు తదితర) ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్‌డేటెడ్ నాలెడ్జ్ అవసరం. జీవశాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీలోని ప్రాథమిక అంశాలపై పట్టుసాధించాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు; వర్తమాన వ్యవహారాలపై నైపుణ్యం కోసం సైన్స్ రిపోర్టర్ వంటి పత్రికలు, ఇతర కాంపిటీటివ్ మ్యాగజీన్లు చదవాలి.

ఎకాలజీ
ఎకాలజీకి సంబంధించి ఎక్కువగా తాజా పరిణామాల (పర్యావరణ సంబంధ ఒప్పందాలు, సదస్సులు - తీర్మానాలు, పర్యావరణ సంస్థలు తదితర)పై అవగాహన ఏర్పరచుకుంటే సులువుగా ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు.

జీకే అండ్ కరెంట్ అఫైర్స్
వాస్తవానికి సిలబస్‌లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని పేర్కొన్నప్పటికీ అధికశాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచే అడుగుతున్నారు. స్టాక్ జీకే అంశాల పద్ధతి క్రమేణా తగ్గుతోంది. కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు సంబంధిత కోర్ అంశాల కలయికగా వస్తున్నాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం గతేడాది కాలంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, రూపకల్పన చేసిన ముఖ్య పథకాలు-వాటి లక్ష్యాలు-లక్షిత వర్గాలపై దృష్టిసారించాలి.
  • గత ఏడాది కాలంలో భారత్-ఇతర దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు(ముఖ్యంగా మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్-చైనా సంబంధాలు-సరిహద్దు వివాదాలపై దృష్టి పెట్టాలి). ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 23న జరగనుంది. జూలై 30కు ముందు ఏడాది కాలంలో ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలను చదివేటప్పుడు విశ్లేషణాత్మక దృక్పథంతో అడుగులు వేస్తే మెయిన్స్‌లోని జనరల్ ఎస్సేకు కూడా ఉపకరిస్తుంది. కరెంట్ అఫైర్స్ కోసం స్టాండర్డ్ రెడీ రెకనర్స్‌తోపాటు అభ్యర్థులు సొంత నోట్స్ రూపొందించుకోవడం మేలు.

సివిల్స్ ప్రిలిమ్స్ గత పరీక్షలు-సబ్జెక్ట్ వారీ ప్రశ్నల వెయిటేజీ

సబ్జెక్ట్

2014

2013

2012

హిస్టరీ అండ్ కల్చర్

20

16

21

జాగ్రఫీ అండ్ ఎకాలజీ

32

26

24

పాలిటీ

14

16

16

ఎకానమీ

10

19

13

ఎస్ అండ్ టీ

16

19

11

కరెంట్ ఈవెంట్స్

8

4

9



సివిల్స్-2015 ప్రత్యేకతలు
  • గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు కొనసాగింపు
  • కేవలం అర్హత పరీక్షగానే సీశాట్ పేపర్
    (ఇందులో 33 శాతం మార్కులు సాధించాలి)
  • సీశాట్ సిలబస్ నుంచి ఇంగ్లిష్ లాంగ్వేజ్
    కాంప్రహెన్షన్ విభాగం తొలగింపు
  • 2011లో హాజరైన అభ్యర్థులకు మరో అవకాశం
  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అనంతపురంలో పరీక్ష కేంద్రం
  • తెలంగాణలో హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం

ప్రతి అంశాన్ని ప్రాధాన్యతగా
సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని ప్రాధాన్యతాంశంగా గుర్తించాలి. ఆయా సబ్జెక్ట్‌ల మధ్య ప్రశ్నల వెయిటేజీ విషయంలో హెచ్చుతగ్గులున్నప్పటికీ.. అన్ని అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులకు జాగ్రఫీ అండ్ ఎకాలజీ, పాలిటీ అండ్ ఎకానమీలు ప్రిపరేషన్ పరంగా సమయం ఆదా చేయడంతోపాటు, అంశాలపై సన్నద్ధత విషయంలోనూ మేలు చేకూర్చుతాయి. ఈ సబ్జెక్టుల నుంచి అంతర్గత సంబంధమున్న ప్రశ్నలు ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని అనుకూలంగా మలచుకోవాలి
- గౌరవ్ అగర్వాల్, ఆలిండియా టాపర్, సివిల్స్ 2013.


పేపర్-2 ప్రిపరేషన్ (సీశాట్)
కాంప్రహెన్షన్
ఈ విభాగం ద్వారా అభ్యర్థిలో పఠన నైపుణ్యాలతో పాటు గ్రాహక శక్తిని పరిశీలిస్తారు. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలతో ఉండే రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే పదాలను ప్రభావవంతంగా ఉపయోగించడం, వాటిపై అవగాహన వంటి అంశాల్లో పట్టు ఉండాలి. వేగంగా చదివే నైపుణ్యం, కచ్చితమైన సమాచారాన్ని గుర్తించడం, వాక్య నిర్మాణ శైలిపై అవగాహన, సారాంశాన్ని గుర్తించడం, కోడింగ్- డీ కోడింగ్ నైపుణ్యాలతో రీడింగ్ కాంప్రహెన్షన్‌ను సులభంగా ఎదుర్కోవచ్చు. ఇందుకోసం ఇంగ్లిష్ వ్యాసాలు, ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్ చదవడం.. అందులో ఉపయోగిస్తున్న పదాలు, వాక్య నిర్మాణంపై అవగాహన పెంచుకోవాలి.

ఇంటర్ పర్సనల్ స్కిల్స్
ఈ విభాగం ద్వారా అభ్యర్థుల్లోని చొరవ, ఇతరులతో మమేకమయ్యే లక్షణం, నాయకత్వ లక్షణాలను పరీక్షిస్తారు. ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్ వెర్బల్ స్కిల్స్‌పై దృష్టిసారించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఎదురయ్యే ప్రశ్న ల కోసం ఇంగ్లిష్ గ్రామర్ నైపుణ్యం ఉపయోగపడుతుంది. ఈ విభాగంలోనూ స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు లేదా సిట్యుయేషన్ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక బృందంలో పని చేస్తున్నారు. మీ బృందంలోని ఒక వ్యక్తి సరిగా చేయకపోవడం వల్ల సరైన సమయానికి అసైన్‌మెంట్ పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. ఈ సందర్భంలో సహచరుడిగా మీరు ఎలా స్పందిస్తారు. ఈ విషయాన్ని ఆ సహచరుడికి ఎలా చెబుతారు. ఈ సమస్యకు సమాధానం ద్వారా.. అభ్యర్థిలో ఉన్న ఇతరులను మెప్పించే తత్వాన్ని, ఒక అంశాన్ని వ్యక్తీకరించే నైపుణ్యాలను పసిగట్టడం తేలిక. ఇలాంటి వాటి కోసం అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కొంత తర్ఫీదు పొందడం మేలు.

లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ
లాజికల్ రీజనింగ్.. అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. ఇందులో స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు ఇచ్చి కొన్ని కన్‌క్లూజన్స్ ఇస్తారు. ఇచ్చిన కన్‌క్లూజన్స్‌లో స్టేట్‌మెంట్‌కు సరితూగే దాన్ని ఎంచుకోవాలి. సీటింగ్ అరేంజ్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్, సీక్వెన్సింగ్, కంపారిజన్, సెలక్షన్, డిడక్షన్స్, లాజికల్ కనెక్టివ్స్, క్యూబ్స్, వెన్ డయాగ్రమ్స్, అసెర్షన్ అండ్ రీజన్ వంటి వాటిలో నైపుణ్యం వంటివి ఈ విభాగంలో రాణించేందుకు ఉపకరించే సాధనాలు.

డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్
నిర్దిష్ట సిలబస్ అంటూ లేకుండా అభ్యర్థుల్లోని నిర్ణయ సామర్థ్యాన్ని, సమస్య పరిష్కార నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఉదాహరణకు మీరు కలెక్టర్‌గా ఉన్న ప్రాంతంలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. సహాయక చర్యలకు అవసరమైన పడవల వినియోగానికి నిధుల సమస్య ఆటంకంగా నిలిచింది. ఈ సమయంలో మీరు ఎలా స్పందిస్తారు. ఇది వాస్తవంగా గత సివిల్స్ పరీక్షల్లో ఎదురైన ప్రశ్న. దీనికి సరైన సమాధానం: తక్షణ నష్ట నివారణ దిశగా పడవల యజమానులను ఒప్పించేలా వ్యవహరించడం. ఇలా ఆయా సందర్భాలకు అనుగుణంగా తక్షణమే నిర్ణయాలు తీసుకునే విధంగా వ్యవహరించాలి. డెసిషన్ మేకింగ్ విషయంలో అభ్యర్థులు ప్రధానంగా అయిదు అంశాలను గుర్తిస్తే రాణించినట్లే. అవి.. సమస్యను గుర్తించడం; పరిష్కార మార్గాలు కనుక్కోవడం; సరైన పరిష్కారాన్ని ఎంచుకోవడం; మిగతా పరిష్కారాలను తొలగించడం; తుది నిర్ణయం తీసుకోవడం.

జనరల్ మెంటల్ ఎబిలిటీ
జనరల్ మెంటల్ ఎబిలిటీలో ఈక్వేషన్స్, రేషియోస్, ప్రపోర్షన్స్, వేరియేషన్స్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, జామెట్రీ అండ్ మెన్సురేషన్, ప్రాబబిలిటీ, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి అంశానికి సంబంధించి కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకుంటూ సదరు సమస్యకు అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే ఈ విభాగంలో పట్టు సాధించడం తేలికే.

బేసిక్ న్యూమరసీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
ఏదైనా ఒక అంశాన్ని దానికి సంబంధించిన పలు డేటాలు, అందులోని అంకెలు, గణాంకాల ఆధారంగా విశ్లేషించే నైపుణ్యాలను పరీక్షించే విభాగం బేసిక్ న్యూమరసీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్. ఈ విభాగంలో రాణించేందుకు కాలిక్యులేషన్స్‌పై పట్టు అవసరం. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో నిర్దేశిత సమస్యపై అవగాహన ఏర్పరచుకోవడం, సమస్య పరిష్కారానికి పలు మార్గాలను అన్వేషించే నైపుణ్యం, తార్కిక విశ్లేషణ అవసరం.
Published date : 29 May 2015 11:52AM

Photo Stories