Telangana MBBS and BDS Seats 2023 : ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు ఎంత మంది దరఖాస్తు చేశారంటే..? కొత్త మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లు వీరికే..
అయితే గతేడాది నీట్‌లో అర్హులైన వారిలో 13 వేల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి ఏకంగా 23 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
ఈ ఏడాది తెలంగాణ నుంచి 72,842 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. అందులో రాష్ట్రం నుంచి 42,654 మంది ఉత్తీర్ణత సాధించారు.
చాలామందికి పెద్ద ర్యాంకులు వచ్చినా కూడా..
2014కు ముందు రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 56కు చేరుకుంది. ఇదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,850 నుంచి 8,340కు చేరింది. ఈ ఏడాది ఏకంగా కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా వచ్చాయి. దీంతో విద్యార్థుల్లో చాలామందికి పెద్ద ర్యాంకులు వచ్చినా కూడా ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ వస్తుందన్న నమ్మకం ఏర్పడింది.
కొత్త మెడికల్ కాలేజీల్లో అన్ని సీట్లు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మెడికల్ కాలేజీల్లో అన్ని సీట్లూ రాష్ట్రంలోని విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ఈసారి కన్వీనర్ కోటాలో కూడా రిజర్వు అభ్యర్థులకు లక్షన్నర ర్యాంకుకు కూడా ఏదో ఒక కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే బీ కేటగిరీలో 9 లక్షల నుంచి 10 లక్షల ర్యాంకుకు కూడా సీటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరోవైపు ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు విరివిగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు భారీగా ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఉండదంటున్నారు. పేరున్న కాలేజీలు తప్పిస్తే సాధారణ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే తక్కువ వసూలు చేసే అవకాశం ఉందని, లేకుంటే ఎవరూ వాటిల్లో చేరే అవకాశం లేదని అంటున్నారు.
☛ NEET Ranks: నీట్‌లో రాష్ట్రం నుంచి 44,629 మందికి ర్యాంకులు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..