Skip to main content

Medical Colleges: దేశ చరిత్రలో ఒకేసారి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల నిర్మాణం

ఈ రోజుల్లో అందరికీ ఆందోళన కలిగించేవి ఆరోగ్య సమస్యలే. ఎవరికైనా ఉన్నట్లుండి అత్య వసర వైద్యం అవసరమైతే గ్రామీణ ప్రజలు 100–120 కిలోమీటర్ల దూరంలో ఉండే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇకపై ఈ పరిస్థితి ఏ ఒక్కరికీ ఎదురు కాకూడదని సీఎం జగన్ గట్టిగా సంకల్పించారు. ఇప్పుడున్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా కొత్తగా ఒకేసారి 16 కాలేజీల నిర్మాణానికి పూనుకున్నారు. తద్వారా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఓ బోధ నాస్పత్రి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అం దించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
medical colleges
విశాఖపట్నం జిల్లా పాడేరులో జోరుగా జరుగుతున్న మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు

రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టి, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద ఎత్తున బోధనాస్పత్రుల నిర్మాణం చేపట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. కేవలం రెండున్నరేళ్ల పాలనలోనే ఒకేసారి 16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాల పనులను ప్రారంభించిన ఘనత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయా కాలేజీల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల వారు, వైద్య రంగ నిపుణులు అంటున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని

ప్రైవేట్‌ పరం చేయడానికే ప్రాధాన్యత ఇస్తే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యతో పాటు ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక బోధనాస్పత్రి ఉండాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ కాలేజీలకు అవసరమైన భూ సేకరణ చేసి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించారు. పలు కాలేజీల పనులు కూడా ప్రారంభమయ్యాయి.

కోవిడ్‌ ఇబ్బందులు ఉన్నప్పటికీ..

ఒక పక్క కోవిడ్‌తో రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడినప్పటికీ చెప్పిన మాట నుంచి వెనక్కు పోకుండా రూ.7,880 కోట్లతో 16 కాలేజీల నిర్మాణ పనులను పట్టాలెక్కించారు. పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరులో ఇప్పటికే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పునాదులను దాటి పిల్లర్ల స్థాయికి పనులు చేరుకున్నాయి. మిగతా 12 కాలేజీల పనుల ప్రారంభానికి ఆయా స్థలాలకు కాంట్రాక్టు సంస్థలు సామగ్రిని తరలిస్తున్నాయి. బాపట్ల, ఏలూరు, పాలకొల్లు కాలేజీల నిర్మాణానికి భూ పరీక్షలు పూర్తయ్యాయి. ఒక్కో మెడికల్‌ కాలేజీని 35 నుంచి 60 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చేపడుతున్నారు. భూ సేకరణకు రూ.210 కోట్లు పరిహారంగా చెల్లించారు. అన్ని మెడికల్‌ కాలేజీలతో పాటు నర్సింగ్‌ కాలేజీలను కూడా నిర్మిస్తున్నారు. 24 నెలల నుంచి 30 నెలల్లో నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది.

మచిలీపట్నంలో 64 ఎకరాల్లో..

 • కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రూ.550 కోట్ల వ్యయంతో మెడికల్‌ కాలేజీని ఏకంగా 64 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ కాలేజీలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా నర్సింగ్‌ హాస్టళ్లను, యూజీ హాస్టళ్లను వేర్వేరుగా నిర్మిస్తున్నారు.
 • గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి శివారులో 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాలు తగ్గడంతో నిర్మాణ పనులు 24 గంటలూ జరుగుతున్నాయి. నిర్మాణం పిల్లర్ల స్థాయికి చేరింది.
 • వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో 50 ఎకరాల విస్తీర్ణంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ.500 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. పిల్లర్ల పై స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి.
 • విశాఖ జిల్లా పాడేరులో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల వ్యయంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా పునాది దాటి పిల్లర్‌ స్థాయిలో పనులు సాగుతున్నాయి.

సకల సౌకర్యాలతో నిర్మాణం

 • రోగులకు, వైద్యులకు, వైద్యేతర సిబ్బందికి అనుకూలంగా ఉండేలా సౌకర్యాలు కల్పిస్తారు.
 • ఓపీడీ, ఐపీడీతో పాటు 24 గంటలూ అక్యూట్‌ కేర్‌ బ్లాక్, ఐసీయూ, ఎన్ ఐసీయూ, ఎంఐసీయూ, ఎస్‌ఐసీయూ వార్డులు.
 • ప్రతి వైద్య కళాశాలలో లైబ్రరీ, లెక్చర్‌ గ్యాలరీ (ఏసీ), క్రీడా మైదానం.
 • వైద్య విద్యార్థులకు హాస్టళ్లు, స్టాఫ్‌ క్వార్టర్స్, వర్కింగ్‌ నర్స్‌ క్వార్టర్లు.
 • దిశా, మెడిసిన్ స్టోర్, మార్చురీ, ల్యాండ్రీ, బయో మెడికల్‌ వేస్ట్, క్యాంటీన్, అటెండర్లకు ప్రత్యేక వసతి, కేంద్రీకృత వేడి నీటి వసతి (సెంట్రలైజ్డ్‌ హాట్‌ వాటర్‌ సిస్టం).
 • ప్రతి బెడ్‌కూ ఆక్సిజన్ పైప్‌లైన్. లిక్విడ్‌ ఆక్సిజన్ ట్యాంకులు, ఆర్‌ఓ ప్లాంటు, అగ్నిమాపక విభాగం.
 • కాలేజీలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీ కాలువలు.
 • సీసీటీవీ, లాన్, వైద్యసేవలు అవసరమైనప్పుడు నర్సులకు ఫోన్ చేసే విధానం (నర్స్‌ కాల్‌ సిస్టం) యాక్సెస్‌ కంట్రోల్‌ సిస్టం.
 • అత్యాధునిక వసతులతో కూడిన ఆపరేషన్ థియేటర్లు, ఓపీడీ కన్సల్టేషన్ గదులు.
 • ప్రతి వైద్య కళాశాలలో కనిష్టంగా 100, గరిష్టంగా 150 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండేలా చర్యలు.

బందరువాసుల కష్టాలు తీరతాయి

ఇప్పటిదాకా అత్యవసర వైద్యం కోసం విజయవాడ, గుంటూరు వెళ్లాల్సి వచ్చేది. బందరులో మెడికల్‌ కాలేజీ నిర్మాణం ద్వారా ఇక్కడే మెరుగైన వైద్యం అందుతుంది. మా కష్టాలను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మెడికల్‌ కాలేజీ మంజూరు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంది. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.
– బొర్రా విఠల్, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్, మచిలీపట్నం

సీఎం రుణం తీర్చుకోలేనిది

పులివెందులలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనం. ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిది. గతంలోనే దివంగత మహానేత వైఎస్సార్‌ ఇక్కడ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే ఆయన అకాల మరణంతో అప్పుడు ఆ కోరిక తీరలేదు. ఇపుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడంతో అది కార్యరూపం దాల్చింది. పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మెడికల్‌ కళాశాల ఏర్పాటు ద్వారా ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది.
– వరప్రసాద్, మునిసిపల్‌ చైర్మన్, పులివెందుల

 

పల్నాడు ప్రాంతానికి వరం

పల్నాడు ప్రాంతానికి మెడికల్‌ కళాశాల రావటం ఓ వరం. ఇన్నాళ్లూ ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమైతే 120 కిలోమీటర్ల దూరంలోని గుంటూరుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అదే ఈ కళాశాల పూర్తయితే అ ఇక్కట్లు ఉండవు. ముఖ్యమంత్రి పుణ్యమా అని పల్నాడు ప్రాంతానికి నడిబొడ్డు అయిన పిడుగురాళ్ల సమీపంలో మెడికల్‌ కళాశాల, వైద్యశాల నిర్మిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. వైద్య పరంగా పల్నాడు ప్రాంతానికి మహర్దశ అని చెప్పవచ్చు.
– సయ్యద్‌ జబీర్, సీహెచ్‌వి నాగరాజు, పిడుగురాళ్ల

చరిత్రాత్మకం

మా పంచాయతీ పరిధిలోని తలారిసింగి పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో 35 ఎకరాల విస్తీర్ణంలో డాక్టర్‌ వైఎస్సార్‌ మెడికల్‌ కళాశాలను నిర్మిస్తుండటం చరిత్రాత్మకం. రూ.500 కోట్లతో నిర్మిస్తున్న ఈ మెడికల్‌ కళాశాల ద్వారా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు 2023 నాటికి అందుబాటులోకి తెచ్చేలా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ కళాశాల అందుబాటులోకి వస్తే విశాఖ కేజీహెచ్‌కు వెళ్లే ఇబ్బందులు తొలగుతాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డికి గిరిజనులమంతా ఎంతో రుణపడి ఉంటాం.
– వంతాల సీతమ్మ, సర్పంచ్, చింతలవీధి, పాడేరు మండలం.

 

కొత్తగా 1800 ఎంబీబీఎస్‌ సీట్లు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పట్టుదల కారణంగా ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. జాతీయ ప్రమాణాలతో పనులు కొనసాగుతున్నాయి. అనకాపల్లి, నంద్యాలలో కోర్టు కేసులు వారంలో పరిష్కారం అవుతాయి. ఈ మెడికల్‌ కళాశాల ద్వారా కొత్తగా 1,800 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రావడంతో పాటు, ఆయా ప్రాంతాల ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. వైద్య కళాశాలల నిర్వహణను పదేళ్ల పాటు నిర్మాణ సంస్థలకే అప్పగించాం. ఎక్విప్‌మెంట్‌ నుంచి భవనాల వరకు నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం.
– డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్

కొత్త మెడికల్‌ కాలేజీలు


జిల్లా

ప్రాంతం

వ్యయం (రూ.కోట్లలో)

వైఎస్సార్‌

పులివెందుల

500

విశాఖపట్నం

పాడేరు

500

గుంటూరు

పిడుగురాళ్ల

500

కృష్ణా

మచిలీపట్నం

550

విజయనగరం

విజయనగరం

500

తూర్పుగోదావరి

అమలాపురం

475

తూర్పుగోదావరి

రాజమండ్రి

475

పశ్చిమగోదావరి

పాలకొల్లు

475

పశ్చిమగోదావరి

ఏలూరు

525

గుంటూరు

బాపట్ల

505

ప్రకాశం

మార్కాపురం

475

చిత్తూరు

మదనపల్లి

475

అనంతపురం

పెనుకొండ

475

కర్నూలు

ఆదోని

475

కర్నూలు

నంద్యాల

475

విశాఖపట్నం

అనకాపల్లి

500

చదవండి:

560 Grade 2 Posts: ఫార్మసిస్ట్‌ల నియామకం

After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!

AP jobs: డీఎంఈ, ఏపీలో 326 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

Published date : 13 Dec 2021 12:37PM

Photo Stories