Skip to main content

National Testing Agency : ఆ అమ్మాయిలకు మళ్లీ నీట్‌ పరీక్ష.. ఎందుకంటే..?

కేరళలో నీట్‌ పరీక్షకు హాజరైన సందర్భంగా ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో లోదుస్తులు విప్పించి.. ఆ తర్వాతే పరీక్ష రాయడానికి వెళ్లాలని సిబ్బంది ఆదేశించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.
NTA

ఈ వివాదంలో జాతీయ పరీక్షల మండలి(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది.

పరీక్షా కేంద్రం వద్ద అవమానం ఎదుర్కొన్న బాధిత అమ్మాయిలు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఎన్‌టీఏ. వారికి సెప్టెంబరు 4న నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి విద్యార్థినులకు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం చేరవేసినట్లు స్పష్టం చేసింది.

ఈ ఏడాది జులై 17న నీట్‌ పరీక్ష సమయంలో తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దాంతో అది పెను దుమారం రేపింది. కేరళలోని కొల్లం జిల్లా ఆయుర్‌లో గల మార్థోమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. లోదుస్తులకు ఉన్న హుక్స్‌ కారణంగా సౌండ్‌ వచ్చిందని దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆ తర్వాత పలువురు విద్యార్థినులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కళాశాల సిబ్బందిపై చర్యలకు డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఘటనపై నిజ నిర్ధారణ కమిటీని నియమించింది ఎన్‌టీఏ. ఈ కేసులో కేరళ పోలీసులు తనిఖీలు చేపట్టిన ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు.

Published date : 27 Aug 2022 07:28PM

Photo Stories