‘వర్క్ ఫ్రం హోం’ నేపథ్యంలో.. భారత్‌లో 91 శాతం పెరిగిన ల్యాప్‌టాప్ వినియోగం
ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోవడంతోపాటు ఇంటి నుంచి బయటకు లేదా ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి. ఎలాగోలా వెళ్లితే ఎక్కడ కరోనా బారిన పడతామోనన్న భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం, రిమోట్ డెస్క్ వంటి పని పద్ధతులను వివిధ రంగాల సంస్థలు, ఉద్యోగులు ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ల్యాప్‌ట్యాప్‌లు, నోట్‌బుక్‌ల వినియోగం పెరిగింది. దీంతో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కరోనాకు ముందు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో నోట్‌బుక్‌లు, ల్యాప్‌ట్యాప్‌లకు డిమాండ్ నామమాత్రంగా ఉండేది. ఇప్పుడవి హాట్‌కేకుల్లా అమ్ముడుపోతుండటంతో కొన్ని కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయి. అయితే వాటి కూడా స్టాక్ అయిపోవడంతోపాటు దేశంలో ఎక్కడ స్టాక్ ఉందో వెతికి పట్టుకుని వినియోగదారులకు అందించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
ఏకంగా కొత్త ప్లాంటు ప్రారంభం
ఒక కంపెనీ మరో సంస్థ సహకారంతో తమిళనాడులో ఏకంగా ఒక కొత్త ప్లాంటునే ప్రారంభించింది. దీనిని బట్టి ల్యాప్‌ట్యాప్‌లకు డిమాండ్ ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియా ఇటీవల నిర్వహించిన ప్రైమ్‌డే సేల్‌లోనూ ల్యాప్‌ట్యాప్ అమ్మకాలే టాప్‌లో నిలిచాయి. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో లాక్‌డౌన్ ఉన్నప్పటికీ దాదాపు 20 శాతం మేర షిప్‌మెంట్లలో వృద్ధి నమోదైనట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) గణాంకాలను బట్టి వెల్లడైంది.
డెస్క్‌టాప్‌లు అమ్మకాలు తగ్గుముఖం
నోట్‌బుక్‌ల అమ్మకాల్లో 105.5 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు ల్యాప్‌టాప్‌లు/నోట్‌బుక్‌ల వైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపడంతో డెస్క్‌టాప్‌ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి, దీంతో వీటి షిప్‌మెంట్ కూడా 46 శాతం తగ్గినట్టు ఐడీసీ సమాచారం బట్టి తెలుస్తోంది. ఐటీ సర్వీసెస్, గ్లోబర్ ఎంటర్ ప్రైజెస్, కన్సల్టింగ్ కంపెనీలు నోట్‌బుక్‌ల కోసం భారీ ఆర్డర్లు ఇవ్వడంతోపాటు డెస్క్‌టాప్‌ల కొనుగోళ్లను గణనీయంగా తగ్గించినట్టు వెల్లడైంది.
91% పెరిగిన ల్యాప్‌టాప్‌ల వినియోగం
కోవిడ్ మహమ్మారి సందర్భంగా భారత్‌లో 91 శాతం మేర ల్యాప్‌టాప్‌లు ఉపయోగించేవారు పెరిగినట్టు లెనోవ్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ పరిశీలనలో వెల్లడైంది. కస్టమర్లు తమ పాత ల్యాప్‌టాప్‌లను హై పెర్‌ఫార్మెన్స్ డివెజైస్‌గా అప్‌డేట్ చేసుకోవడంతోపాటు వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టుగా స్పష్టమైంది. దీంతో ఈ కేటగిరిలో ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌ల మార్కెట్ వృద్ధి అవకాశాలు మరింత పెరిగాయి.