విశాఖలో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.350 కోట్లతో సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
విశాఖలో 20 ఎకరాల్లో రూ.133 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్ర ఉపరితల రవాణా, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్ సమావేశం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయవాడ నుంచి పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ఎంఎస్‌ఎంఈ కేంద్ర సహాయమంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి, కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ కార్యదర్శి బి.బి.స్పెయిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక అని పేర్కొన్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్లు, మౌలికాభివృద్ధి కేంద్రాలు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ టెర్మినళ్ల ఏర్పాటు దిశగా ఏపీ ముందడుగు వేస్తోందన్నారు. టెక్నాలజీ సెంటర్ల ద్వారా చిన్న పరిశ్రమలకు మరింత ఊతమివ్వనున్నట్లు తెలిపారు. నౌకా నిర్మాణం, వెల్డింగ్, ఫాబ్రికేషన్, ఉక్కు ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలున్న నేపథ్యంలో విశాఖలో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరుల (స్కిల్డ్ మ్యాన్ పవర్)ను ఏటా 8,500 మంది చొప్పున రాబోయే ఐదేళ్లపాటు తీర్చిదిద్దడమే ఈ సెంటర్ ఏర్పాటు లక్ష్యమని మంత్రి వివరించారు.
Published date : 11 Mar 2021 03:43PM