Skip to main content

వీఏఏల నియామకాల్లో అక్రమాలు

సాక్షి, అమరావతి: గ్రామీణ వ్యవసాయాధికారుల (వీఏఏ) నియామకాల్లో కొన్నిచోట్ల అనర్హులకు పోస్టింగ్‌లు ఇచ్చినట్లు శాఖాపరమైన దర్యాప్తులో తేలింది.
రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చి సాగును లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామ సచివాలయాల్లో వీఏఏలను నియమించింది. అయితే కొంతమంది అభ్యర్థులు సెలక్షన్ కమిటీ సభ్యులకు లంచాలు ఇచ్చి బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌కు ఫిర్యాదులు అందడంతో అంతర్గత విచారణకు ఆదేశించారు. కర్నూలు సహా నాలుగైదు జిల్లాల్లో అవకతవకలు జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) గుర్తింపు కలిగిన బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ వ్యవసాయ ఇంజనీరింగ్, అగ్రి పాలిటెక్నిక్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్‌లో రెండేళ్ల డిప్లొమా, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ గుర్తించిన వ్యవసాయ పాలిటెక్నిక్‌లో మూడేళ్ల డిప్లొమా, బీఎస్సీ (బీజెడ్‌సీ) డిగ్రీతో ఎంపీఈవోలుగా పని చేస్తున్న వారిని (ఒకసారి అవకాశం కల్పించారు)ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించారు. వ్యవసాయ అసిస్టెంట్ డెరైక్టర్ (ఏడీఏ) ఆధ్వర్యంలో వ్యవసాయాధికారి, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్‌లతో కూడిన సెలక్షన్ కమిటీ దరఖాస్తులను పరిశీలించి అర్హుల పేర్లను జాయింట్ డెరైక్టర్‌కు సిఫార్సు చేయాలి. అయితే అవకతవకలన్నీ ఈ స్థాయిలోనే జరిగినట్టు శాఖాపరమైన దర్యాప్తులో తేలింది.
  • రాష్ట్రవ్యాప్తంగా 6,714 మంది వీఏఏల నియామకాలకు ప్రభుత్వం గత ఏడాది జూలైలో నోటిఫికేషన్ ఇచ్చింది.
  • కర్నూలు జిల్లాలో సెలక్షన్ కమిటీకి నేతృత్వం వహించిన ఓ అధికారి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ముడుపులు తీసుకుని బోగస్ సర్టిఫికెట్లు కలిగిన వారిని వీఏఏలుగా నియమించారు. 23 మంది ఇలా పోస్టింగ్‌లు పొందినట్లు తేలడంతో పక్కనబెట్టారు.
  • ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో అన్ని జిల్లాల్లో దర్యాప్తు మొదలైంది.
  • వ్యవసాయ మార్కెటింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ చేసినవారికి సైతం అర్హత లేకున్నా వీఏఏ ఉద్యోగాల్లో నియమించారు.
  • ఐసీఏఆర్ గుర్తింపులేని విద్యాసంస్థల నుంచి బోగస్ సర్టిఫికెట్లు పొందిన వారిని కూడా ఉద్యోగాల్లో నియమించారు.

10 మందిని తొలగించాం
‘వీఏఏల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు అందిన ఫిర్యాదులపై విచారణ నిర్వహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో బయోటెక్నాలజీ డిగ్రీ ద్వారా వీఏఏ పోస్టింగ్‌లు పొందిన పది మందిని తొలగించాం. బయో టెక్నాలజీ చేసిన వారికి ఈ పోస్టులకు అర్హత లేదు. ఏ దశలోనూ అవకతవకల్ని సహించే ప్రసక్తే లేదు’
-హెచ్.అరుణ్‌కుమార్ (వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్)
Published date : 27 Jan 2020 01:05PM

Photo Stories