ఆ విద్యార్థుల ఫీజులు వెనక్కి ఇవ్వాల్సిందే:యూజీసీ
Sakshi Education
సాక్షి, అమరావతి: కోవిడ్-19 కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడి ఉండడం, తరగతుల నిర్వహణ నిలిచిపోయిన నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను తిరిగి వెనక్కు చెల్లించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది.
ఈ మేరకు తమ పరిధిలోని అన్ని విద్యా సంస్థల్లో ఫీజులు తిరిగి చెల్లింపు ప్రక్రియను అమలు చేయించాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. ముఖ్యంగా ప్రైవేట్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల విద్యార్థుల నుంచి పలు ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొంది. కొన్ని సంస్థలు ఫీజులు ఇవ్వకపోవడమే కాకుండా తక్కిన బకాయిల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నట్లు, వారి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ మేరకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ఫస్టియర్ విద్యార్థుల ఫీజులు వెనక్కు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Published date : 24 Dec 2020 05:16PM