విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు: ఆదిమూలపు సురేష్
Sakshi Education
అనంతపురం విద్య: నాణ్యమైన విద్యను అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో విప్లవాత్మక మార్పులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
అనంతపురంలోని జేఎన్‌టీయూ(ఏ)లో జాతీయ స్థాయి రెండవ టెక్నాలజీ యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్ల సదస్సు ఫిబ్రవరి 13 (గురువారం)న ప్రారంభమైంది. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన 78 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యం లేదన్నారు. పరిశ్రమల అవసరాలు, మార్కెట్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యం పెంపొందించుకునే క్రమంలో విఫలం అవుతున్నారన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా అధ్యాపకుల్లోనూ నైపుణ్యంతో కూడిన శిక్షణ సామర్థ్యం పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు పెద్దపీట వేస్తున్నామని, సీఎం జగన్‌మోహన్ రెడ్డి విద్యా రంగానికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుదే, నూతన జాతీయ విద్యా విధానం డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ ప్రొఫెసర్ కె.రామచంద్రన్, ఆల్ ఇండియా యూనివర్సిటీ సెక్రటరీ జనరల్ పంకజ్ మిట్టల్, ఎన్‌బీఏ చైర్మన్, కెకె అగర్వాల్ యూజీసీ సభ్యులు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి, విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కరిసిద్దప్ప, జేఎన్‌టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస్ కుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈతో జేఎన్‌టీయూ అనంతపురం ఫ్యాకల్టీ ట్రైనింగ్ అండ్ లర్నింగ్ అనే అంశంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Published date : 14 Feb 2020 03:47PM