విద్యాక్యాలెండర్‌లో పేర్కొన్న సమయాలు ఐచ్ఛికమే.. టీచర్లందరికీ వర్తించవు..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు 2021–22లో నిర్వహించాల్సిన అంశాలతో విడుదల చేసిన విద్యాక్యాలెండర్‌లో పేర్కొన్న సమయాలు టీచర్లందరికీ వర్తించేవి కావని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు సెల్ఫ్ స్టడీ తదితర సహ పాఠ్యకార్యక్రమాలు విద్యార్థులు, టీచర్ల ఐచ్ఛికం ప్రకారమే నిర్వహించుకోవచ్చని తెలిపారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నిర్దేశించిన విద్యార్థుల సెల్ఫ్ స్టడీ, సవరణాత్మక బోధన వంటివి కూడా ఉపాధ్యాయులు, టీచర్ల ఐచ్ఛికానుసారమే నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర టీచర్లకు స్కూళ్ల రెగ్యులర్ సమయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే ఉంటుందని, ఈ అంశాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు. ఇలా ఉండగా పాఠశాలల పని వేళలు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంట ల వరకు నిర్ణయించడం అశాస్త్రీయమని యూ టీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సమయాలను మార్చాలని డిమాండ్ చేశారు.
Published date : 20 Aug 2021 07:07PM