విద్యా బోధన మాతృభాషలోనే..: టీఎస్ హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నిర్బంధ విద్యా హక్కు చట్టంతోపాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 350-ఎ ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన చేయాల్సి ఉన్నా ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, కార్పొరేట్ స్కూల్స్ పట్టించుకోవడం లేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే చట్ట నిబంధనలను, ప్రభుత్వ ఉత్తర్వులను ప్రైవేటు పాఠశాలలు అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నప్పుడు వారిని ప్రతివాదులుగా చేర్చకపోతే ఎలా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రతివాదిగా లేని వారికి ఆదేశాలు ఎలా ఇస్తామని పేర్కొంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ప్రతివాదులుగా చేర్చాలంటూ తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. మాతృభాషలోనే విద్యాబోధన చేసేలా ఆదేశించాలంటూ నగరానికి చెందిన గరీబ్‌గైడ్ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వ నిబంధనలను ప్రభుత్వ పాఠశాలలు పాటిస్తుండగా, ప్రైవేటు పాఠశాలలు పాటించడం లేదని పిటిషనర్ తరఫు న్యా యవాది నివేదించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న అభ్యర్థులు పోటీ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులతో పోటీపడలేక నష్టపోతున్నారని తెలిపారు.
Published date : 12 Feb 2021 04:09PM